చెట్టుకూలిన ఘటనపై రవీందర్ బంధువులు, స్థానికుల ఆగ్రహం
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన
రసూల్‌పురా: బొల్లారం కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిలో ఆవరణలో చెట్టు కూలి మృతి చెందిన తూంకుంట నివాసి రవీందర్ కుటుంబానికి కంటోన్మెంట్ బోర్డు అధికారులు న్యాయం చేయాలని కోరుతూ బంధువులు, కుటుంబ సభ్యులు బుధవారం ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఎండిన చెట్టు తొలగించడంలో బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం బలైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయ పడిన రవీందర్ సతీమణి సరళాదేవి ఆస్పత్రి ఆవరణలో అంబులెన్స్‌లోనే ఉండి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తిరుమలగిరి మండల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మద్దతు పలికి ఆందోళనలో పాల్గొన్నారు.
దీనిపై సమాచారం అందుకున్న బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తమ తరపున ప్రతినిధులుగా వాటర్‌వర్క్స్ సూపరిటెండెంట్ రాజ్‌కుమార్, నర్సింగ్ రావు, యాని, రమణ, రాములును ఆస్పత్రికి పంపించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ బోర్డు అధికారులు ఘటనకు బాధ్యత వహించి రవీందర్ ఇద్దరు కుమార్తెలకు న్యాయం చేయాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యంవల్లే రవీందర్ మృతి చెందాడని ఆరోపించారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని ఆస్పత్రి ముందు, మీటింగ్ హాల్లో, సూపరింటెండెంట్ రామకృష్ణ వద్ద నాలుగు గంటల పాటు నిరసనకు దిగారు. ఒక దశలో ఉపాధ్యాయులు అధికారి రాజ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగారు.
అధికారుల హామీతో ఆందోళన విరమణ
ఈ విషయంలో నిర్ణయం తీసుకునే వీలు తమకు లేదని, బోర్డు పాలకమండలి సమావేశంలో చర్చించి రవీందర్ కుటుంబానికి, వారి ఇద్దరు కుమార్తెలకు న్యాయం చేసేందుకు తగిన నిర్ణయం తీసుకుంటామని వాటర్‌వర్క్స్ అధికారి రాజ్‌కుమార్ హామీచ్చారు. అదే విధంగా తీవ్రంగా గాయపడిన సరళాదేవికి కిమ్స్ హాస్పిటల్‌లో మెరుగైన చికిత్స అందజేస్తామని, ఆ ఖర్చు మొత్తం బోర్డు భరిస్తుందని, బొల్లారం హస్పిటల్ నుంచి ఓ డాక్టర్‌ను కిమ్స్ ఆసుపత్రికి సరళాదేవితో పంపిస్తామని అధికారులు హామీచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment