water pipelines
-
ఢిల్లీ నీటి సంక్షోభం.. ‘వాటర్ పైప్లైన్ల వద్ద భద్రత పెంచండి’
ఢిల్లీ: ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జలవనరుల శాఖమంత్రి అతిశీ రాష్ట్ర పోలీసు కమిషనర్ సంజయ్ ఆరోరాకు లేఖ రాశారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న కీలకమైన వాటర్ పైప్లైన్ల వద్ద పోలీసులు భద్రత కల్పిస్తూ, పర్యవేక్షించాలని లేఖలో కోరారు.‘‘ రాష్ట్రంలోని కీలకమైన వాటర్ పైప్లైన్ల వద్ద మరో 15 రోజుల పాటు పోలీసులు భద్రత, పర్యవేక్షణ పెంచాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను కోరుతున్నా. ఢిల్లీకి జీవనాధారంగా మారిన వాటర్ పైప్లైన్లను కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేయడాన్ని ఆపటం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు’’ అని మంత్రి అతిశీ లేఖలో కోరారు.మరోవైపు.. ఆప్ ఎమ్మెల్యేలు కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. అయితే కేంద్రమంత్రి తన వివాసంలో లేకపోవటంతో ఆప్ ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యే రాఖీ బిర్లా మీడియాతో మాట్లాడారు.‘‘ మేము నిన్న (శనివారం) కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ ఇచ్చాం. ఈ రోజు ఆయన్ను కలవడానికి వచ్చాం. అయితే ఆయన తన నివాసంలో లేరని సమాచారం అందింది. ఢిల్లీలో నెలకొన్న నీటి కొరతపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేయడానికి వచ్చాం’’అని తెలిపారు.నీటి సంక్షోభం వల్ల ద్వారకా ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పశ్చిమ ఢిల్లీ ఎంపీ కమల్జిత్ కమల్జీత్ సెహ్రావత్ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ద్వారకా ప్రాంతంతో ప్రభుత్వం ట్యాంకర్లు అందుబాటులో లేవని అన్నారు. దీంతో ప్రైవేట్ ట్యాంకర్ల ప్రజల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. నీటి సంక్షోభంపై ఢిల్లీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. కానీ, అసలు సమస జలవనరులకు శాఖలో ఉందని అన్నారు. కనీసం మానవత్వంతో అయినా అతిశీ ఆమె శాఖపై జాగ్రత్త దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. -
తాగునీటి సమస్యకు చెక్ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం
-
ఇవేం పైపులైన్లు?
తీవ్రంగా కలుషితమవుతున్న జలాలు పురాతన పైపులైన్లే కారణం గుర్తించిన అధికారులు నూతన పైపులైన్ల ఏర్పాటుకు చర్యలు.. ఏడు నీటి నమూనాల్లో బ్యాక్టీరియా కలకలం.. సిటీబ్యూరో: నగరంలో పురాతన మంచినీటి పైపులైన్లు, డ్రైనేజి పైపులైన్లు ఒకదానిపై మరొకటి ఉన్న చోట కలుషిత జలాల సమస్య తరచూ తలెత్తుతోంది. ఇటీవల సరూర్‌నగర్ పరిధిలోని కామేశ్వర్రావు నగర్, అల్వాల్‌లోని రాజీవ్‌నగర్, అంబేద్కర్‌నగర్, మలక్‌పేట్‌లోని ప్రిన్స్ బాడీగార్డ్లేన్, చర్చికాలనీ, రామంతాపూర్‌లోని గోకుల్‌నగర్‌లో కలుషిత జలాల సమస్య ఉత్పన్నమైన విషయం విదితమే. ఈనేపథ్యంలో జలమండలి అధికారులు రంగంలోకి దిగి కలుషిత జలాలకు కారణాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పురాతన ఆర్సీసీ, ఏసీ, పీవీసీ, హెచ్డీపీఈ మంచినీటి సరఫరా పైపులను భూమి నుంచి 5 నుంచి ఆరు అడుగుల లోతున ఏర్పాటు చేశారు. వీటిపై నుంచి నూతనంగా మురుగు నీటి పైపులైన్లు వేయడంతో మంచినీరు, మురుగు నీటి పైపులైన్లకు ఏర్పడిన స్వల్ప లీకేజీలతో కలుషిత సమస్య ఉత్పన్నమైంది. ఆయా ప్రాంతాల్లో తక్షణం పురాతన మంచినీటి పైపులైన్ల స్థానే నూతన పైపులైన్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హడ్కో సంస్థ మంజూరు చేసిన రుణంతో ఆయా ప్రాంతాల్లో ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జలమండలి ఎండీ బి.జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారన్నారు. ఇక ఆయా ప్రాంతాల్లో గుంతల్లో ఏర్పాటు చేసిన పిట్ట్యాప్లను తక్షణం తొల గించాలని స్థానికులకు సూచించామని జలమండలి వర్గాలు తెలిపాయి. 11247 నీటి నమూనాలకు పరీక్షలు.. మార్చి 1 నుంచి 24 వరకు నగర వ్యాప్తంగా 11,247 మంచినీటి నమూనాలకు ఇన్సిట్యూట్ ఆఫ్ హెల్త్‌సిస్టమ్స్ ల్యాబుల్లో పరీక్షలు నిర్వహించినట్లు జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో ఏడు నీటి నమూనాల్లో మాత్రమే బ్యాక్టీరియా ఆనవాళ్లున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో కలుషిత జలాల సమస్యను నివారించామని ప్రకటించింది. ఇక రోజువారీగా నగరం నలుమూలల నుంచి 2180 నీటి నమూనాలను సేకరింంచి ఇన్సిట్యూట్ ఆఫ్ హెల్త్‌సిస్టమ్స్, ఇన్సిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ల్యాబుల్లో పరీక్షిస్తున్నామన్నారు. నీటి నమూనాల సేకరణకు సెల్ఫ్‌హెల్ప్‌గ్రూపు మహిళల సహకారం తీసుకుంటున్నామన్నారు. కలుషిత జలాలపై అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఎండీ బి.జనార్దన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సీజీఎం, జీఎం, డీజీఎం, మేనేజర్లకు ఆదేశాలిచ్చారన్నారు. -
జలం.. గరళం
మహా నగరంలోని పైపులైన్లు జలానికి బదులు గరళాన్ని సరఫరా చేస్తున్నాయి. గత్యంతరం లేని జనం... ఆ గరళాన్ని మింగి... ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎప్పుడో తాతల కాలం నాటి పైపులైన్లు... అవీ మురుగు కాల్వల మధ్య నుంచి... పోనీ మంచిగా ఉన్నాయా? అంటే.... ఎక్కడికక్కడే లీకులు. ఇవే కాలుష్యానికి ద్వారాలు. వింత వింత రంగుల్లో కనిపించే నీరు...ప్రజల కన్నీటికి కారణమవుతోంది. వీటిని సరి చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది. సాక్షి,సిటీబ్యూరో: బంజారాహిల్స్ రోడ్‌నెం.12లోని ఎన్బీటీ నగర్, ఎన్బీనగర్, శ్రీరాంనగర్, భోలానగర్, ఖాజానగర్ బస్తీల్లో కొన్ని నెలలుగా నల్లాల్లో రంగుమారి దుర్వాసన వెదజల్లుతున్న, పురుగులతో కూడిన కలుషిత నీరుసరఫరా అవుతోంది. ఇటీవల స్వచ్ఛ హైదరాబాద్‌లో ఈ బస్తీల్లో పర్యటించిన మంత్రి హరీష్‌రావుతో పాటు అధికారులకు ఈ విషయమై వందలాది మంది మహిళలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే దెబ్బతిన్న మంచినీటి పైపులను మార్చాలని అధికారులను ఆదేశించారు. కానీఇంతవరకు ఈ పనులు ప్రారంభం కాలేదు. బస్తీవాసులు కలుషిత నీటితో రోగాల పాలయ్యే దుస్థితి నెలకొంది. ... ఇది కొన్ని బస్తీల సమస్య కాదు. గ్రేటర్ పరిధిలో కలుషిత జలాలతో సతమతమవుతున్న ఇలాంటి బస్తీలు వందల్లో ఉన్నాయి. పురాతన మంచినీటి పైప్లైన్లకు చిల్లులు పడడం... వీటి పక్కనే డ్రైనేజి పైప్లైన్లు ఉండడంతో మురుగు నీరు మంచినీటి పైప్లైన్లలో చేరి తాగునీరు కలుషితమవుతోంది. ఈ నీటిని తాగిన చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు డయేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. పాత నగరం సహా అనేకప్రాంతాల్లో సుమారు 1150 కి.మీ. పరిధిలో దశాబ్దాల క్రితం వేసిన పురాతన మంచినీటి పైప్లైన్లు తుప్పుపట్టి చెడిపోవడం... వాటికి చిల్లులు పడడంతో తాగునీటిలో మురుగు నీరు కలుస్తోంది. ఫలితంగా కలుషిత జలాల సమస్య ఉత్పన్నమవుతోంది. వీటిని మార్చేందుకు అవసరమైన రూ.1200 కోట్లను ఠమొదటిపేజీ తరువాయి రాష్ట్ర సర్కారు విదల్చడం లేదు. నల్లా నీళ్లు కలుషితమవడంతో బస్తీవాసులు ఫిల్టర్‌ప్లాంట్లు విక్రయిస్తున్న తాగునీటిని కొనుగోలు చేసి... జేబులు గుల్ల చేసుకుంటున్నారు. కలుషిత జలాలతో సతమతమవుతున్న బస్తీల్లో మంగళవారం పర్యటించిన ‘సాక్షి’ బృందం వద్ద స్థానికులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. ఎక్కడెక్కడంటే... - కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్ నగర్, జీడిమెట్ల, ఆదర్శ నగర్, జగద్గిరిగుట్ట సెక్షన్ల పరిధిలో మంచినీటి పైప్లైన్లకు తరచూ లీకేజీలతో మురుగు నీరు చేరి తాగునీరు గరళమవుతోంది. - సూర్యానగర్‌కు వెళ్లే ఎస్కే ఫంక్షన్ హాలు రోడ్డు, నందా నగర్‌కు వెళ్లే దారి, రంగారెడ్డి నగర్ ఐ పైలాన్ ఎదురుగా, గాంధీనగర్ పారిశ్రామికవాడకు వెళ్లే దారి, బాల్‌రెడ్డి నగర్ మెయిన్ రోడ్డు, పద్మానగర్ ఫేజ్-02 శ్మశాన వా టిక, మాణిక్యనగర్, గోదావరి హోమ్స్, చింతల్ చంద్రానగర్, భగత్‌సింగ్ నగర్ హైస్కూల్ సమీపంలో, చింతల్ ఆగ్రోస్ సమీపంలో, గాంధీనగర్ ఠాగూర్ స్కూల్ గల్లీలో గత కొద్ది రోజులుగా మంచినీటి పైప్లైన్లకు లీకేజీలతో తాగునీరు వృథా అవడంతో పాటు కలుషిత జలాల సమస్య వేధిస్తోంది. - రహమత్ నగర్ డివిజన్లోని బస్తీల్లో కలుషిత జలాల సమస్య ఉత్పన్నమవుతున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనే జీ పైపులకు చిల్లులు పడడం, మ్యాన్‌హోళ్లు లీకై... మంచినీటి పైప్లైన్లలో కలవడంతో కలుషిత నీరు సరఫరా అవుతోందని బస్తీ వాసులు మండిపడుతున్నారు. ఇటీవల స్థానిక ఓంనగర్ బస్తీలో మహిళలు కలుషిత మంచినీటిని సీసాలలో నింపి బస్తీలో ఆందోళన నిర్వహించారు. - కూకట్పల్లి ఆస్బె స్టాస్ కాలనీలో భూమిలోకి చేరిన పారిశ్రామిక రసాయనాలతో బోర్ల నుంచి ఎర్రటి రంగుతో నీరు వెలువడుతోందని స్థానికులు చెబుతున్నారు. - కూకట్పల్లి ప్రశాంత్ నగర్, రంగారెడ్డి నగర్లలోని పారిశ్రామికవాడల్లోని కంపెనీల్లో వాడిన వ్యర్ధాలను స్థానిక నాలాలోకి వదులుతున్నారు. ఆ నీరు మంచినీటిలో చేరుతోంది. సుమారు 2 వందల అడుగుల లోతులో బోర్లు వేసినా ఎర్రటి దుర్గంధభరితమైన నీరు సరఫరా అవుతోంది. ఈ ప్రాంతాలకు అరకొరగా మంజీర నీరు సరఫరా అవుతుండడంతో బోరుబావుల నీటిని వినియోగించిన వారు రోగాల పాలవుతున్నారు. పాపారాయుడు నగర్, ఏబీవీపురం ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి. - జియాగూడ డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో మురుగునీటి పైపులు, కచ్చామోరీలు పొంగిపొర్లి పక్కనే ఉన్న మంచినీటి పైప్లైన్లోకి చేరుతున్నాయి. వెంకటేశ్వర నగర్, ఇక్బాల్‌గంజ్, పురానాపూల్ వెనుక, పురానాపూల్, అర్జున్గల్లీ, మక్బరా, గోపీ హోటల్, బీమ్నగర్, ఇమామ్పురా, సత్తన్నగల్లీ, గౌలిగూడ సెక్షన్ పరిధిలోని గౌలిగూడ, ఫీల్‌ఖానా, బేగంబజార్, సిద్దంబర్‌బజార్ తదితర ప్రాంతాల్లోనూ తరచూ కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయి. - వనస్థలిపురంలోని రెడ్వాటర్ ట్యాంక్‌ను చివరిసారి 2013 జనవరి 23న శుభ్రం చేశారు. రెండున్నరేళ్లుగా దీన్ని పట్టించుకోవడం లేదు. కలుషిత జలాలకు కారణాలివే... - గతంలో జలమండలి నిర్వహించిన అధ్యయనంలో నగరంలో 1150 కిలోమీటర్ల మేర ఉన్న పురాతన ఆర్సీసీ మంచినీటి పైప్‌లైన్ వ్యవస్థ వల్లనే కలుషిత జలాల పరిస్థితి పునరావృతమవుతున్నట్టు తేలింది. - పైప్‌లైన్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రూ.1200 కోట్లు అవసరం. ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేయడం లేదు. - వివిధ ప్రాంతాల్లో లీకేజీలను అరికట్టడంలో జలమండలి సిబ్బంది విఫలమవుతున్నారు. - వందేళ్లు పూర్తయిన మీరాలం ఫిల్టర్ బెడ్లను ఆధునికీకరించకపోవడం శాపంగా పరిణమిస్తోంది. గ్రేటర్‌కు మంచినీరు సరఫరా చేస్తున్న ఫిల్టర్ బెడ్ల వద్ద క్లోరినేషన్, ఫిల్టరేషన్, రసాయన పరీక్షలు సక్రమంగా నిర్వహించడం లేదు. - జలమండలి ఆధ్వర్యంలో కలుషిత జలాల నివారణకు రూ.75 కోట్ల అంచనాతో చేపట్టిన సమగ్ర వాటర్ సేఫ్టీ ప్రణాళిక అమలుకు ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చేస్తోంది. - స్టోరేజి రిజర్వాయర్లు, పైప్‌లైన్ వ్యవస్థల్లో క్లోరినేషన్ ప్రక్రియ మొక్కుబడిగా సాగుతోంది. దీంతో బాక్టీరియా విజృంభించి.. రోగాలకు కారణమవుతోంది. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు చింతల్ ప్రధాన రహదారిలో మంజీర పైపులైన్ మరమ్మతుల కోసం తవ్వారు. నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో ఈ ప్రాంతంలో మంజీర నీరు వృథా పోతూ... కలుషితమవుతోంది. దీనిపై మూడుసార్లు జలమండలి అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా పట్టించుకోవడం లేదు. -పి.శ్రీనివాస్‌రెడ్డి, చింతల్. రంగు మారిన నీరు సరఫరా రహమత్ నగర్ డివిజన్ ఓం నగర్ బస్తీతో పాటు కొన్ని బస్తీల్లో కలుషిత మంచినీరు సరఫరా అవుతోంది. అధికారులు పట్టించుకోవడం లేదు. పేదలు నివసించే ఎస్.పి.ఆర్. ప్రాంతంలోని వివిధ బస్తీల్లో సమస్య అధికంగా ఉంది. - మేఘన పద్మ, ఓం నగర్ నీటి నమూనాలు పరీక్షించండి వాటర్‌వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డ్‌లో ప్రత్యేకంగా కాలుష్యాన్ని గుర్తించే విభాగం ఉంటుంది. వీరు తప్పనిసరిగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి సమస్యను పరిష్కరించాలి. ప్రతిరోజూ సరఫరా అవుతున్న మంచినీటి నమూనాలను సేకరించి పరీక్షించాలి. - దర్పల్లి నర్సింహులు, కేశవస్వామి నగర్ డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి మంచినీరు కలుషితం కావడానికి ప్రధాన కారణం డ్రైనేజీ ఓవర్‌ఫ్లో. ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని పరిష్కరించకపోవడం వల్లే మురుగునీరు మంచినీటి పైప్లైన్లలో కలుస్తోంది. - నరహరి చారి, దుర్గానగర్ -
కలుషిత జలాలకు చెక్ పెడదాం
- పైపులైన్ లీకేజీల నివారణకు చర్యలు - హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి - జలమండలి పథకాలపై ఉన్నతస్థాయి కమిటీ సమీక్ష - ఈనెల 6న తిరిగి సమావేశం సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కలుషిత జలాలు, మంచినీటి పైప్లైన్లకు తరచూ ఏర్పడుతున్న లీకేజీలపై అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని, త్వరలో ఈ సమస్యలకు చెక్ పెడతామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. గురువారం జలమండలి ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వాణిజ్య టారిఫ్‌కు బదులుగా వ్యవసాయ రంగం తరహాలోజలమండలికి రాయితీ ధరపై విద్యుత్ సరఫరా చేసే అంశంపై ప్రభుత్వానికి నివేదిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. నాలాల్లో పరిమితికి మించి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. బోర్డులో 1480 ఉద్యోగ ఖాళీల భర్తీ అంశాన్ని ప్రభుత్వ దష్టికి తీసుకెళతామన్నారు. ఉదయం అత్తాపూర్, తేజస్వినగర్, పల్లెచెరువు, మైలార్‌దేవ్‌పల్లి, ఇమ్లిబన్పార్క్ నాలాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. జలమండలి పథకాలపై బోర్డు ఎండీ ఎం. జగదీశ్వర్ సభ్యులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు కేశవరావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, ప్రకాశ్‌గౌడ్, డెరైక్టర్లు తదితరులున్నారు. పేదలకు బిల్లు బకాయిలు మాఫీ చేయాలి జలమండలికి రూ.661 కోట్ల నీటి బిల్లు బకాయిలుండగా..అందులో బీపీఎల్ కింద ఉన్న నిరుపేదల బకాయిలు రూ.71 కోట్లను తక్షణం మాఫీ చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్భరుద్దీన్ ఓవైసీ కోరారు. రూ.3800 కోట్ల వ్యయంతో చేపడుతున్న గోదావరి మంచినీటి పథకానికి అవసరమైన నీటిని ఏ ప్రాజెక్టు నుంచి సేకరిస్తారో స్పష్టంచేయాలని నిలదీశారు. దీనిపై అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఎంపీ కేకే కల్పించుకుని సర్ధిచెప్పారు. సమావేశంలో చర్చించినఅంశాలివే.. రామచంద్రాపురం, పటాన్చెరు, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కాప్రా, ఎల్బీనగర్ మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.1523 కోట్లతో మంచినీటి సరఫరా నెట్వర్క్, స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి కేంద్రంతో చర్చించి పరిపాలన అనుమతులు సాధించాలి. బోర్డులో నిర్వహణ వ్యయానికి నిధుల పెంపు, విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేయాలని నిర్ణయం. నీటి బిల్లుల వసూలుకు జీహెచ్ఎంసీ సిబ్బంది వినియోగం. రక్షిత నీటి సరఫరా ప్రణాళిక రూపొందించేందుకు చర్యలు. కత్భుల్లాపూర్, అల్వాల్, ఉప్పల్, రాజేంద్రనగర్ సర్కిళ్ల పరిధిలో నీటి సరఫరాకు రూ.1132 కోట్లతో పనులు రూ.1250 కోట్లతో నగరవ్యాప్తంగా 1150 కి.మీ పరిధిలో ఉన్న పురాతన, దెబ్బతిన్న పైప్లైన్లమార్పు. విద్యుత్ బిల్లుల చెల్లింపునకు నెలకు రూ.47 కోట్లు ఖర్చు చేస్తుండగా.. కృష్ణా మూడోదశతో రూ.8 కోట్లు, గోదావరి మొదటిదశ పూర్తితో మరో రూ.30 కోట్ల విద్యుత్ బిల్లులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాయితీపై విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. 33.47 శాతం నీటి సరఫరా నష్టాలను తగ్గించాలి. పురాతన మంజీరా ఫేజ్-1,2 పైప్లైన్ల మార్పిడి, ఉస్మాన్‌సాగర్ కాండ్యూట్, ఫిల్టర్బెడ్ల ఆధునికీకరణ. శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.3195 కోట్లతో మంచినీటి సరఫరా నెట్వర్క్. రూ.2867 కోట్ల అంచనా వ్యయంతో డ్రైనేజి ఏర్పాటుకు నిధుల సేకరణపై దృష్టి. రూ.1240 కోట్లతో డ్రైనేజి వసతుల కల్పన. జలమండలి పరిధిలో దశలవారీగా రూ.20,775 కోట్ల వ్యయంతో వివిధ పథకాలు చేపట్టాలి. -
సికింద్రాబాద్ అభివృద్ధికి రూ.300 కోట్లు
మంత్రి పద్మారావు సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్, కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మంచినీటి పైప్లైన్ల విస్తరణ, స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం, డ్రైనేజీ వంటి వసతులు కల్పిస్తామని ఆబ్కారీశాఖమంత్రి పద్మారావు తెలిపారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో జలమండలి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గతంలో ఈప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించి సిద్ధంచేసిన మాస్టర్‌ప్లాన్‌ను సమగ్రంగా అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా మారేడ్‌పల్లి, తార్నాక, లాలాపేట్ ప్రాంతాల్లో భారీ మంచినీటి స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి అంచనాలు సిద్ధంచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీతాఫల్మండి ప్రాంతంలో స్టోరేజి రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. కంటోన్మెంట్ పరిధిలో తాగునీరు, డ్రైనేజి వసతుల కల్పనపై నెలకొన్న వివాదాలను త్వరితంగా పరిష్కరించాలన్నారు. సికింద్రాబాద్ పరిధిలో మురుగునీటి పారుదల వ్యవస్థను ఆధునికీకరించేందుకు భారీ ట్రంక్‌మెయిన్స్, లేటరల్స్ నిర్మించాలని సూచించారు. అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, లాలాపేట్, తార్నాక పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీల్లో మంచినీరు, డ్రైనేజీ వసతులు కల్పించాలన్నారు. మూడోదశపై సమీక్ష కృష్ణా మూడోదశ ప్రాజెక్టును త్వరితంగా పూర్తిచేసి, నగరానికి అదనంగా 90 మిలియన్ గ్యాలన్ల కృష్ణాజలాలను తరలించి నగరం నలుమూలలకు సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ విభాగం డెరైక్టర్ రామేశ్వర్రావు, జీఎం ఆనంద్‌స్వరూప్, డీజీఎం హర్నాకర్ తదితరులు పాల్గొన్నారు.