కలుషిత జలాలకు చెక్ పెడదాం | to stop the polluted water | Sakshi
Sakshi News home page

కలుషిత జలాలకు చెక్ పెడదాం

Published Fri, Jun 5 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

కలుషిత జలాలకు చెక్ పెడదాం

కలుషిత జలాలకు చెక్ పెడదాం

- పైపులైన్ లీకేజీల నివారణకు చర్యలు
- హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి
- జలమండలి పథకాలపై ఉన్నతస్థాయి కమిటీ సమీక్ష
- ఈనెల 6న తిరిగి సమావేశం    
సాక్షి, సిటీబ్యూరో:
నగరంలో కలుషిత జలాలు, మంచినీటి పైప్‌లైన్లకు తరచూ ఏర్పడుతున్న లీకేజీలపై అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని, త్వరలో ఈ సమస్యలకు చెక్ పెడతామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. గురువారం జలమండలి ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వాణిజ్య టారిఫ్‌కు బదులుగా వ్యవసాయ రంగం తరహాలోజలమండలికి రాయితీ ధరపై విద్యుత్ సరఫరా చేసే అంశంపై ప్రభుత్వానికి నివేదిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.

నాలాల్లో పరిమితికి మించి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. బోర్డులో 1480 ఉద్యోగ ఖాళీల  భర్తీ అంశాన్ని ప్రభుత్వ దష్టికి తీసుకెళతామన్నారు. ఉదయం అత్తాపూర్, తేజస్వినగర్, పల్లెచెరువు, మైలార్‌దేవ్‌పల్లి, ఇమ్లిబన్‌పార్క్ నాలాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. జలమండలి పథకాలపై బోర్డు ఎండీ ఎం. జగదీశ్వర్ సభ్యులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు కేశవరావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, ప్రకాశ్‌గౌడ్, డెరైక్టర్లు తదితరులున్నారు.

పేదలకు బిల్లు బకాయిలు మాఫీ చేయాలి
జలమండలికి రూ.661 కోట్ల నీటి బిల్లు బకాయిలుండగా..అందులో బీపీఎల్ కింద ఉన్న నిరుపేదల బకాయిలు రూ.71 కోట్లను తక్షణం మాఫీ చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్భరుద్దీన్ ఓవైసీ కోరారు. రూ.3800 కోట్ల వ్యయంతో చేపడుతున్న గోదావరి మంచినీటి పథకానికి అవసరమైన నీటిని ఏ ప్రాజెక్టు నుంచి సేకరిస్తారో స్పష్టంచేయాలని నిలదీశారు. దీనిపై అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఎంపీ కేకే కల్పించుకుని సర్ధిచెప్పారు.

సమావేశంలో చర్చించినఅంశాలివే..
రామచంద్రాపురం, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కాప్రా, ఎల్బీనగర్ మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.1523 కోట్లతో మంచినీటి సరఫరా నెట్‌వర్క్, స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి కేంద్రంతో చర్చించి పరిపాలన అనుమతులు సాధించాలి.

బోర్డులో నిర్వహణ వ్యయానికి నిధుల పెంపు, విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేయాలని నిర్ణయం. నీటి బిల్లుల వసూలుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది వినియోగం. రక్షిత నీటి సరఫరా ప్రణాళిక రూపొందించేందుకు చర్యలు.
కత్భుల్లాపూర్, అల్వాల్, ఉప్పల్, రాజేంద్రనగర్ సర్కిళ్ల పరిధిలో నీటి సరఫరాకు రూ.1132 కోట్లతో పనులు
రూ.1250 కోట్లతో నగరవ్యాప్తంగా 1150 కి.మీ పరిధిలో ఉన్న పురాతన, దెబ్బతిన్న పైప్‌లైన్లమార్పు.
విద్యుత్ బిల్లుల చెల్లింపునకు నెలకు రూ.47 కోట్లు ఖర్చు చేస్తుండగా.. కృష్ణా మూడోదశతో రూ.8 కోట్లు, గోదావరి మొదటిదశ పూర్తితో మరో రూ.30 కోట్ల విద్యుత్ బిల్లులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాయితీపై విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి.
33.47 శాతం నీటి సరఫరా నష్టాలను తగ్గించాలి.
పురాతన మంజీరా ఫేజ్-1,2 పైప్‌లైన్ల మార్పిడి, ఉస్మాన్‌సాగర్ కాండ్యూట్, ఫిల్టర్‌బెడ్ల ఆధునికీకరణ.
శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.3195 కోట్లతో మంచినీటి సరఫరా నెట్‌వర్క్. రూ.2867 కోట్ల అంచనా వ్యయంతో డ్రైనేజి ఏర్పాటుకు నిధుల సేకరణపై దృష్టి.  
రూ.1240 కోట్లతో డ్రైనేజి వసతుల కల్పన.
జలమండలి పరిధిలో దశలవారీగా రూ.20,775 కోట్ల వ్యయంతో వివిధ పథకాలు చేపట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement