polluted waters
-
సోమ్లా తండాకు జ్వరం
కలుషిత జలాలే కారణమంటున్న తండావాసులు వైద్య శిబిరం నిర్వహించాలని వేడుకోలు డోర్నకల్ : డోర్నకల్ పట్టణ పరిధిలోని సోమ్లా తండాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూపోతోంది. తలనొప్పి, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో కూడిన జ్వరం తండావాసులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే చాలామంది డోర్నకల్‌తో పాటు ఖమ్మంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. స్థానికులు వాంకుడోత్ శారద, వాంకుడోత్ ఉపేందర్, దేవ్‌సింగ్, ధారావత్ సోనియా, రుక్మిణి, వాంకుడోత్ వరుణ్‌తేజ్, బానోత్ పార్వతి, కమిలి తదితరులు జ్వరంతో మంచంపట్టారు. సుమారు 80 కుటుంబాలు ఉన్న ఈ తండాకు రక్షిత మంచినీటి బావి, బోరు బావి ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వాటి నుంచి కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయని, అవి తాగడం వల్లే అనారోగ్యం బారిన పడుతున్నట్లు తండావాసులు పేర్కొంటున్నారు. బోరు బావి ద్వారా సరఫరా అయ్యే నీటినే తాగాలని ఇప్పటికే తాము సూచించామని గ్రామ పంచాయతీ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు స్థానికంగా పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది. ఫలితంగా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. వెంటనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యం అందించాలని తండావాసులు కోరుతున్నారు. -
ఈ నీరు తాగలేం!
కలుషిత జలాలపై ఫిర్యాదుల వెల్లువ సాక్షి,సిటీబ్యూరో: కలుషిత జలాలపై జలమండలికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 1 నుంచి 9 వరకు ఈ సమస్యపై నగర వ్యాప్తంగా 261 మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఇందులో 106 సమస్యలను అధికారులు పరిష్కరించగా.. మరో 155 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. సింగూరు, మంజీర, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు వట్టిపోవడంతో ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకు గోదావరి జలాలను సరఫరా చేస్తున్నారు. బురదతో, రంగుమారిన జలాలు సరఫరా అవుతున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు గోదావరి పైపులైన్లలో పేరుకుపోయిన మట్టి, చెత్త నీటితో కలిసి సరఫరా అవుతుండడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలను శుద్ధి చేస్తున్న మల్లారం నీటి శుద్ధి కేంద్రం వద్ద మొత్తం 52 ఫిల్టర్‌బెడ్స్‌కుగాను ప్రస్తుతానికి 17 ఫిల్టర్బెడ్లు మాత్రమే పని చేస్తుండడంతోఈ పరిస్థితి తలెత్తిందని సమాచారం. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీటిని సరఫరా చేసే పైపులైన్లకు చిల్లులు పడుతుండడంతో డ్రైనేజి నీరు, చెత్త అందులో కలిసి కలుషిత జలాల సమస్య ఉత్పన్నమవుతోంది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లలో నీరుఅడుగంటడంతో పాత నగరంలోని వివిధ ప్రాంతాలకు బురద, మట్టి కలిసిన జలాలు సరఫరా అవుతున్నాయి. కలుషిత జలాలతో సతమతమవుతున్న ప్రాంతాలివే.. బంజారాహిల్స్: ఎన్బీటీనగర్, సింగాడికుంట, ఉదయ్ నగర్, చింతలబస్తీ, ప్రేమ్‌నగర్ సనత్‌నగర్: ఫతేనగర్, ఎస్.ఆర్.నగర్, ఎస్ఆర్టీ కాలనీ, జెక్ కాలనీ, రాజరాజేశ్వరీనగర్, సుందర్‌నగర్. కూకట్పల్లి: ఆల్విన్‌కాలనీ, బాలానగర్, మూసాపేట్, బాలాజీనగర్, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్ ముషీరాబాద్: గాంధీనగర్, జవహర్‌నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్. చార్మినార్: అమితానగర్, పటేల్‌నగర్, హబీబ్‌నగర్, ఘన్సీబజార్, చందూలాల్ బారాదరి, రియాసత్‌నగర్, పురానాపూల్. -
కలుషిత జలాలకు చెక్ పెడదాం
- పైపులైన్ లీకేజీల నివారణకు చర్యలు - హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి - జలమండలి పథకాలపై ఉన్నతస్థాయి కమిటీ సమీక్ష - ఈనెల 6న తిరిగి సమావేశం సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కలుషిత జలాలు, మంచినీటి పైప్లైన్లకు తరచూ ఏర్పడుతున్న లీకేజీలపై అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని, త్వరలో ఈ సమస్యలకు చెక్ పెడతామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. గురువారం జలమండలి ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వాణిజ్య టారిఫ్‌కు బదులుగా వ్యవసాయ రంగం తరహాలోజలమండలికి రాయితీ ధరపై విద్యుత్ సరఫరా చేసే అంశంపై ప్రభుత్వానికి నివేదిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. నాలాల్లో పరిమితికి మించి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. బోర్డులో 1480 ఉద్యోగ ఖాళీల భర్తీ అంశాన్ని ప్రభుత్వ దష్టికి తీసుకెళతామన్నారు. ఉదయం అత్తాపూర్, తేజస్వినగర్, పల్లెచెరువు, మైలార్‌దేవ్‌పల్లి, ఇమ్లిబన్పార్క్ నాలాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. జలమండలి పథకాలపై బోర్డు ఎండీ ఎం. జగదీశ్వర్ సభ్యులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు కేశవరావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, ప్రకాశ్‌గౌడ్, డెరైక్టర్లు తదితరులున్నారు. పేదలకు బిల్లు బకాయిలు మాఫీ చేయాలి జలమండలికి రూ.661 కోట్ల నీటి బిల్లు బకాయిలుండగా..అందులో బీపీఎల్ కింద ఉన్న నిరుపేదల బకాయిలు రూ.71 కోట్లను తక్షణం మాఫీ చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్భరుద్దీన్ ఓవైసీ కోరారు. రూ.3800 కోట్ల వ్యయంతో చేపడుతున్న గోదావరి మంచినీటి పథకానికి అవసరమైన నీటిని ఏ ప్రాజెక్టు నుంచి సేకరిస్తారో స్పష్టంచేయాలని నిలదీశారు. దీనిపై అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఎంపీ కేకే కల్పించుకుని సర్ధిచెప్పారు. సమావేశంలో చర్చించినఅంశాలివే.. రామచంద్రాపురం, పటాన్చెరు, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కాప్రా, ఎల్బీనగర్ మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.1523 కోట్లతో మంచినీటి సరఫరా నెట్వర్క్, స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి కేంద్రంతో చర్చించి పరిపాలన అనుమతులు సాధించాలి. బోర్డులో నిర్వహణ వ్యయానికి నిధుల పెంపు, విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేయాలని నిర్ణయం. నీటి బిల్లుల వసూలుకు జీహెచ్ఎంసీ సిబ్బంది వినియోగం. రక్షిత నీటి సరఫరా ప్రణాళిక రూపొందించేందుకు చర్యలు. కత్భుల్లాపూర్, అల్వాల్, ఉప్పల్, రాజేంద్రనగర్ సర్కిళ్ల పరిధిలో నీటి సరఫరాకు రూ.1132 కోట్లతో పనులు రూ.1250 కోట్లతో నగరవ్యాప్తంగా 1150 కి.మీ పరిధిలో ఉన్న పురాతన, దెబ్బతిన్న పైప్లైన్లమార్పు. విద్యుత్ బిల్లుల చెల్లింపునకు నెలకు రూ.47 కోట్లు ఖర్చు చేస్తుండగా.. కృష్ణా మూడోదశతో రూ.8 కోట్లు, గోదావరి మొదటిదశ పూర్తితో మరో రూ.30 కోట్ల విద్యుత్ బిల్లులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాయితీపై విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. 33.47 శాతం నీటి సరఫరా నష్టాలను తగ్గించాలి. పురాతన మంజీరా ఫేజ్-1,2 పైప్లైన్ల మార్పిడి, ఉస్మాన్‌సాగర్ కాండ్యూట్, ఫిల్టర్బెడ్ల ఆధునికీకరణ. శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.3195 కోట్లతో మంచినీటి సరఫరా నెట్వర్క్. రూ.2867 కోట్ల అంచనా వ్యయంతో డ్రైనేజి ఏర్పాటుకు నిధుల సేకరణపై దృష్టి. రూ.1240 కోట్లతో డ్రైనేజి వసతుల కల్పన. జలమండలి పరిధిలో దశలవారీగా రూ.20,775 కోట్ల వ్యయంతో వివిధ పథకాలు చేపట్టాలి. -
ఇక స్వచ్ఛమైన సాగర్!
కలుషిత జలాలు, రసాయనాలతో కాలుష్యకాసారంగా మారిపోయిన హుస్సేన్ సాగర్‌కు మంచి రోజులు రానున్నాయి. సాగర్ జలాలను శుద్ధి చేసి నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించే దిశగా మహానగరాభివృద్ధి సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. జలాశయాన్ని పరిశుభ్రం చేసేందుకు జర్మనీ, అమెరికా దేశాల్లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గల యంత్రాలను వినియోగించనుంది. ఒకపక్క సాగర్ ప్రక్షాళన.. మరోవైపు తాజాగా ఆధునిక యంత్రాల వినియోగంతో సాగర్ కొత్తందాలు సంతరించుకోనుంది. విషరసాయన వర్థాలతో హుస్సేన్ సాగర్ జలాలు కలుషితమయ్యాయి. ఈ క్రమంలో సాగర్‌లోకి వచ్చే ఫ్లోటింగ్ మెటీరియల్‌ను, గట్ల వెంట పెరిగిన గుర్రపు డెక్కను తొలగించేందుకు, ఇతర వ్యర్థాలను వెలికి తీసేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టనుంది. ఇందుకు ఆధునిక యంత్రాలను వినియోగించాలని నిర్ణయించింది. కలుషితమైన జలాలను మనుషులతో కాకుండా యంత్రాల ద్వారానే శుభ్రం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. జమ్మూ-కాశ్మీర్‌లోని ‘దాల్ లేక్’ క్లీనింగ్‌కు వినియోగిస్తున్న ఆధునిక యంత్రాలను ఇక్కడ వినియోగించేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం యాక్వటిక్ వీడ్ హార్వెస్టర్ కం ట్రాష్ కలెక్టర్, యాంఫీబియస్ ఎస్కవేటర్ తదితర యంత్రాలను కొనుగోలు చేసేందుకు రూ.11.5కోట్ల వ్యయ అంచనాలతో తాజాగా టెండర్లు ఆహ్వానించారు. జర్మనీ, అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ ఆధునిక యంత్రాలను సరఫరా చేయడంతో పాటు వచ్చే 5 ఏళ్లపాటు వారే వాటిని నిర్వహించే విధంగా టెండర్లో నిబంధన విధించారు. హుస్సేన్‌సాగర్ శుద్ధికి అనువుగా ఆ యంత్రాలను రూపొందించి 6నెలల వ్యవధిలోగా వాటిని తమకు అప్పగించాలని నిర్దేశించారు. రూ.370కోట్ల వ్యయంతో చేపట్టిన సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టులో భాగంగా ఈ యంత్రాలను కొనుగోలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాజెక్టుకు రుణ దాత అయినా ‘జైకా’ కూడా ఇందుకు పచ్చజెండా ఊపడంతో హెచ్ఎండీఏ అధికారులు పనులు వేగవంతం చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. సాగర్ ప్రక్షాళన పనులు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నందున ఆధునిక యంత్రాల సాయంతో జలాశయాన్ని మరింత శుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. జలాల శుద్ధి ఇలా ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వస్తే హుస్సేన్‌సాగర్ క్లీనింగ్ పనులు మరింత సులువు కావడంతో పాటు ఖర్చు కూడా త గ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాకాలం వస్తే చాలు నాలా ముఖద్వారాల వద్ద గుర్రపుడెక్క, ఇతర జలాధారిత మొక్కలు విస్తృతంగా పెరిగి మురుగునీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో విపరీతమైన దుర్వాసన కూడా వెదజల్లుతోంది. ప్రధానంగా పికెట్‌నాలా, కూకట్పల్లి నాలా, బంజారా, బల్కాపూర్ నాలాలు సాగర్‌లో కలిసే చోట దట్టంగా పెరిగిన గుర్రపుడెక్కను, మేట వేసిన వ్యర్థాలను తొలిగించేందుకు ఈ ఆధునిక యంత్రాలు ఎంతో ఉపకరిస్తాయని అధికారులు చెబుతున్నారు. యాంఫీబియస్ ఎస్కలేటర్ సాయంతో నాలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెలికితీసి నేరుగా లారీల్లో నింపడం ద్వారా బయటకు తరలించ వచ్చంటున్నారు. ఇప్పటివరకూ వినాయక విగ్రహాలను గట్టుకు చేర్చి నాలుగైదు రోజులు ఎండినతర్వాత ఇతర ప్రాంతాలకు తరలించేవారు. ఇప్పుడు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వస్తుండడంతో ఏరోజు వ్యర్థాలను ఆరోజే బయటకు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. తగిన రీతిలో మార్పులు... సాగర్ క్లీనింగ్‌కు కొనుగోలు చేస్తున్న యంత్రాలు 6 నెలల్లో వినియోగంలోకి వ చ్చే అవకాశం ఉంది. వినాయక చవితి నాటికే వాటిని తెప్పించాలని భావించినా... సాగర్ జలాల్లో పనులు నిర్వహించేందుకు అనువుగా ఆ యంత్రాల్లో కొన్ని మార్పులు తప్పనిసరైంది. ఈమేరకు టెండర్లో పక్కాగా సూచనలు చేశాం. యంత్రాల్లో కొన్ని మార్పులు చేసేందుకు కనీసం 5నెలలు పట్టే అవకాశం ఉంది. ఈసారికి ‘పాంటూన్ మౌంటెడ్ ఎస్కలేటర్’ను తెప్పించి గణేష్ విగ్రహాలను సాగర్ నుంచి వెలికి తీయాలని నిర్ణయించాం. కొత్తగా కొనుగోలు చేస్తున్న ‘యాక్వటిక్ వీడ్ హార్వెస్టర్ కం ట్రాష్ కలెక్టర్, యాంఫీబియస్ ఎస్కవేటర్’లను సాగర్‌లోనే కాకుండా మిగతా జలాశయాల క్లీనింగ్‌కు కూడా వినియోగించుకొనే వెసులుబాటు ఉంటుంది. వీటి వినియోగం వల్ల సాగర్ మరింత పరిశుభ్రం కానుంది. - బి.ఎల్.ఎన్.రెడ్డి, ఎస్ఈ