ఈ నీరు తాగలేం!
కలుషిత జలాలపై ఫిర్యాదుల వెల్లువ
సాక్షి,సిటీబ్యూరో: కలుషిత జలాలపై జలమండలికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 1 నుంచి 9 వరకు ఈ సమస్యపై నగర వ్యాప్తంగా 261 మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఇందులో 106 సమస్యలను అధికారులు పరిష్కరించగా.. మరో 155 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. సింగూరు, మంజీర, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు వట్టిపోవడంతో ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకు గోదావరి జలాలను సరఫరా చేస్తున్నారు.
బురదతో, రంగుమారిన జలాలు సరఫరా అవుతున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు గోదావరి పైపులైన్లలో పేరుకుపోయిన మట్టి, చెత్త నీటితో కలిసి సరఫరా అవుతుండడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలను శుద్ధి చేస్తున్న మల్లారం నీటి శుద్ధి కేంద్రం వద్ద మొత్తం 52 ఫిల్టర్‌బెడ్స్‌కుగాను ప్రస్తుతానికి 17 ఫిల్టర్‌బెడ్లు మాత్రమే పని చేస్తుండడంతోఈ పరిస్థితి తలెత్తిందని సమాచారం.
మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీటిని సరఫరా చేసే పైపులైన్లకు చిల్లులు పడుతుండడంతో డ్రైనేజి నీరు, చెత్త అందులో కలిసి కలుషిత జలాల సమస్య ఉత్పన్నమవుతోంది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లలో నీరుఅడుగంటడంతో పాత నగరంలోని వివిధ ప్రాంతాలకు బురద, మట్టి కలిసిన జలాలు సరఫరా అవుతున్నాయి.
కలుషిత జలాలతో సతమతమవుతున్న ప్రాంతాలివే..
బంజారాహిల్స్: ఎన్‌బీటీనగర్, సింగాడికుంట, ఉదయ్ నగర్, చింతలబస్తీ, ప్రేమ్‌నగర్
సనత్‌నగర్: ఫతేనగర్, ఎస్.ఆర్.నగర్, ఎస్‌ఆర్‌టీ కాలనీ, జెక్ కాలనీ, రాజరాజేశ్వరీనగర్, సుందర్‌నగర్.
కూకట్‌పల్లి: ఆల్విన్‌కాలనీ, బాలానగర్, మూసాపేట్, బాలాజీనగర్, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్
ముషీరాబాద్: గాంధీనగర్, జవహర్‌నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్.
చార్మినార్: అమితానగర్, పటేల్‌నగర్, హబీబ్‌నగర్, ఘన్సీబజార్, చందూలాల్ బారాదరి, రియాసత్‌నగర్, పురానాపూల్.