ఇక స్వచ్ఛమైన సాగర్! | The pure Sagar! | Sakshi
Sakshi News home page

ఇక స్వచ్ఛమైన సాగర్!

Published Fri, Jul 18 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM

ఇక స్వచ్ఛమైన సాగర్!

ఇక స్వచ్ఛమైన సాగర్!

కలుషిత జలాలు, రసాయనాలతో కాలుష్యకాసారంగా మారిపోయిన హుస్సేన్ సాగర్‌కు మంచి రోజులు రానున్నాయి. సాగర్ జలాలను శుద్ధి చేసి నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించే దిశగా మహానగరాభివృద్ధి సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. జలాశయాన్ని పరిశుభ్రం చేసేందుకు జర్మనీ, అమెరికా దేశాల్లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గల యంత్రాలను వినియోగించనుంది. ఒకపక్క సాగర్ ప్రక్షాళన.. మరోవైపు తాజాగా ఆధునిక యంత్రాల వినియోగంతో సాగర్ కొత్తందాలు సంతరించుకోనుంది.
 
విషరసాయన వర్థాలతో హుస్సేన్ సాగర్ జలాలు కలుషితమయ్యాయి. ఈ క్రమంలో సాగర్‌లోకి వచ్చే ఫ్లోటింగ్ మెటీరియల్‌ను, గట్ల వెంట పెరిగిన గుర్రపు డెక్కను తొలగించేందుకు, ఇతర వ్యర్థాలను వెలికి తీసేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టనుంది. ఇందుకు ఆధునిక యంత్రాలను వినియోగించాలని నిర్ణయించింది. కలుషితమైన జలాలను మనుషులతో కాకుండా యంత్రాల ద్వారానే శుభ్రం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. జమ్మూ-కాశ్మీర్‌లోని ‘దాల్ లేక్’ క్లీనింగ్‌కు వినియోగిస్తున్న ఆధునిక యంత్రాలను ఇక్కడ వినియోగించేందుకు అధికారులు నిర్ణయించారు.

ఇందుకోసం యాక్వటిక్ వీడ్ హార్వెస్టర్ కం ట్రాష్ కలెక్టర్, యాంఫీబియస్ ఎస్కవేటర్ తదితర యంత్రాలను కొనుగోలు చేసేందుకు  రూ.11.5కోట్ల వ్యయ అంచనాలతో తాజాగా టెండర్లు ఆహ్వానించారు. జర్మనీ, అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ ఆధునిక యంత్రాలను సరఫరా చేయడంతో పాటు వచ్చే 5 ఏళ్లపాటు వారే వాటిని నిర్వహించే విధంగా టెండర్‌లో నిబంధన విధించారు. హుస్సేన్‌సాగర్ శుద్ధికి అనువుగా ఆ యంత్రాలను రూపొందించి 6నెలల వ్యవధిలోగా వాటిని తమకు అప్పగించాలని నిర్దేశించారు.

రూ.370కోట్ల వ్యయంతో చేపట్టిన సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టులో భాగంగా ఈ యంత్రాలను కొనుగోలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాజెక్టుకు రుణ దాత అయినా ‘జైకా’ కూడా ఇందుకు పచ్చజెండా ఊపడంతో హెచ్‌ఎండీఏ అధికారులు పనులు వేగవంతం చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.  సాగర్ ప్రక్షాళన పనులు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నందున ఆధునిక యంత్రాల సాయంతో జలాశయాన్ని మరింత శుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
 
జలాల శుద్ధి ఇలా
 
ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వస్తే హుస్సేన్‌సాగర్ క్లీనింగ్ పనులు మరింత సులువు కావడంతో పాటు ఖర్చు కూడా త గ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాకాలం వస్తే చాలు నాలా ముఖద్వారాల వద్ద గుర్రపుడెక్క, ఇతర జలాధారిత మొక్కలు విస్తృతంగా పెరిగి మురుగునీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో విపరీతమైన దుర్వాసన కూడా వెదజల్లుతోంది. ప్రధానంగా పికెట్‌నాలా, కూకట్‌పల్లి నాలా, బంజారా, బల్కాపూర్ నాలాలు సాగర్‌లో కలిసే చోట  దట్టంగా పెరిగిన గుర్రపుడెక్కను, మేట వేసిన వ్యర్థాలను తొలిగించేందుకు ఈ ఆధునిక యంత్రాలు ఎంతో ఉపకరిస్తాయని అధికారులు చెబుతున్నారు.

యాంఫీబియస్ ఎస్కలేటర్ సాయంతో నాలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెలికితీసి నేరుగా లారీల్లో నింపడం ద్వారా బయటకు తరలించ వచ్చంటున్నారు.  ఇప్పటివరకూ వినాయక విగ్రహాలను గట్టుకు చేర్చి నాలుగైదు రోజులు ఎండినతర్వాత ఇతర ప్రాంతాలకు తరలించేవారు.  ఇప్పుడు  ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వస్తుండడంతో ఏరోజు వ్యర్థాలను ఆరోజే బయటకు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు.
 
తగిన రీతిలో మార్పులు...

సాగర్ క్లీనింగ్‌కు కొనుగోలు చేస్తున్న యంత్రాలు 6 నెలల్లో వినియోగంలోకి వ చ్చే అవకాశం ఉంది. వినాయక చవితి నాటికే వాటిని తెప్పించాలని భావించినా... సాగర్ జలాల్లో పనులు నిర్వహించేందుకు అనువుగా ఆ యంత్రాల్లో కొన్ని మార్పులు తప్పనిసరైంది. ఈమేరకు  టెండర్‌లో పక్కాగా సూచనలు చేశాం. యంత్రాల్లో కొన్ని మార్పులు చేసేందుకు కనీసం 5నెలలు పట్టే అవకాశం ఉంది. ఈసారికి ‘పాంటూన్ మౌంటెడ్ ఎస్కలేటర్’ను తెప్పించి గణేష్ విగ్రహాలను సాగర్ నుంచి వెలికి తీయాలని నిర్ణయించాం. కొత్తగా కొనుగోలు చేస్తున్న ‘యాక్వటిక్ వీడ్ హార్వెస్టర్ కం ట్రాష్ కలెక్టర్, యాంఫీబియస్ ఎస్కవేటర్’లను సాగర్‌లోనే కాకుండా మిగతా జలాశయాల క్లీనింగ్‌కు కూడా వినియోగించుకొనే వెసులుబాటు ఉంటుంది. వీటి వినియోగం వల్ల సాగర్ మరింత పరిశుభ్రం కానుంది.
 - బి.ఎల్.ఎన్.రెడ్డి, ఎస్‌ఈ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement