Modern machines
-
పురుగులమందు పిచికారీకి ఆధునిక యంత్రం
మఠంపల్లి (హుజూర్నగర్) : పత్తి, మిర్చి తోటల్లో పురుగుల మందు పిచికారీ చేసే ఆధునిక యంత్రం మఠంపల్లిలో కనిపించింది. ఆ యంత్రాన్ని శుక్రవారం వైఎస్సార్ సీపీ రైతుసంఘం జిల్లా నాయకులు కర్నె వెంకటేశ్వర్లు పరిశీలించి మాట్లాడారు. ట్రాక్టర్‌ను పోలిన ఈ యంత్రం పత్తి, మిర్చి తోటల్లో పురుగుల మందులు పిచికారీకి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. రెండువైపులా రెక్కలు విప్పుకుని సుమారు ఇరువైపులా ఒకేసారి 20 మీటర్ల వెడల్పులో పురుగుల మందులను పిచికా రీ చేస్తుందని పేర్కొన్నారు. ఆరు నిమిషాల వ్యవధిలోనే ఎకరం తోటలో పురుగుల మందు పిచికారి చేస్తుందని చెప్పారు. ఈ యంత్రంతో సమయం ఆదాతో పాటు పురుగుల మందును పిచికారీ చేసే రైతులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉండదని పేర్కొన్నారు. కాగా ఆధునిక యంత్రాన్ని పలువురు రైతులు ఆసక్తిగా తిలకరించారు. -
ఉపాధి కరువు
అఇకపై వెనుకబడిన మండలాలకే పరిమితం కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జిల్లాలో 17 మండలాల్లోనే పనులు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు లక్షలాది మంది కూలీలపై ప్రభావం మరోసారి సర్వేకు అధికారుల నిర్ణయం సాక్షి, కర్నూలు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వీర్యమవుతోంది. మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులతో కూలీలకు ఉపాధి కరువవుతోంది. 2004లో యూపీఏ ప్రభుత్వం ‘అడిగిన వారందరికీ పని కల్పిస్తాం.. పనుల్లేక ఏ ఒక్కరూ ఆకలితో పస్తులుండకూడదు’ అనే నిర్ణయంతో ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టింది. తాజాగా బీజేపీ సర్కారు నిర్ణయాలతో పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితే దాపురిస్తోంది. జిల్లాలో మొత్తం 54 మండలాలు ఉండగా.. వెనుకబడిన ప్రాంతాలు 17 మాత్రమేనని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1, 2015 నుంచి ఆయా మండలాల్లో ఉపాధి మృగ్యం కానుంది. లక్షలాది మంది కూలీలపై ఈ ప్రభావం కనిపించనుంది. పథకంలో భాగంగా విడుదలయ్యే కోట్లాది రూపాయాల్లో దుర్వినియోగం అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా పథకాన్ని దశల వారీగా ఎత్తేసే ఆలోచనలో భాగంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 3223 ఉత్తర్వులో వెనుకబడిన ప్రాంతాలకు మాత్రమే ఉపాధి పథకాన్ని పరిమితం చేయాలని స్పష్టం చేయడం గమనార్హం. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 655 మండలాలు ఉండగా.. 146 మండలాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించారు. ఆ మేరకు జిల్లాలోని దేవనకొండ, గోనెగండ్ల, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, నందవరం, పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, కోడుమూరు, సి.బెళగల్, గూడూరు, చాగలమర్రి, గడివేముల మండలాలు మాత్రమే ఉపాధి పనులకు ఎంపికయ్యాయి. ఈ నిర్ణయం మెట్ట ప్రాంతంలో ఉపాధి పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నకూలీలకు శాపంగా పరిణమించిం ది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. జిల్లాలోని 886 గ్రామ పంచాయతీల పరిధిలో 7.26 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు ఉండగా.. 15.60 లక్షల మంది కూలీలుగా నమోదయ్యారు. ఇకపై వీరిలో 75 శాతం మందికి ఉపాధి కల్పించే పరిస్థితి లేదని తెలుస్తోంది. జాబ్ కార్డులున్న వారిలో ఇప్పటి వరకు ఎక్కువగా ఉపాధి పనులకు హాజరైన వారికి మాత్రమే రాబోయే రోజుల్లో పని కల్పించేందుకు సర్వే కొనసాగుతోంది. అత్యం త వెనుకబడిన, ఎస్సీ జనాభా అధికంగా ఉన్న నందికొట్కూరు, ఆత్మకూరు మండలాలను సైతం అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా గుర్తించ డం సర్వే తీరుకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని మండలాల్లో మరోసారి సర్వే నిర్వహించి.. ఆ తర్వాత గ్రామ సభల ద్వారా ఏ నెలలో పనులు నిర్వహించాలో అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. నిధుల వ్యయంలోనూ మార్పు ఉపాధి హామీ పథకం అమలుకు ఇప్పటి వరకు విడుదల చేసిన నిధుల్లో 60 శాతం వేతనాలకు, 40 శాతం సామగ్రి కొనుగోలు, పనుల నిర్వహణకు ఖర్చు చేస్తున్నారు. ఈ విధానాన్నీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. నిధుల్లో 60 శాతం నిధులను సామగ్రి కొనుగోలు, పనుల నిర్వహణకు.. 40 శాతం నిధులను వేతనాల చెల్లింపునకు ఖర్చు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో కూలీలకు తగిన సొమ్ము చెల్లించే పరిస్థితి కరువవుతోంది. ‘ఉపాధి’ తొలగించొద్దు నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఏకంగా ఉపాధి పథకాన్నే తొలగించడం సరికాదు. మేధావులు, ఆర్థికవేత్తలు సైతం ఈ పథకాన్ని కొనసాగించాలని, కూలీలకు అన్యాయం చేయొద్దని కోరుతూ ప్రధానిమంత్రి నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీల పనిదినాలు యేటా తగ్గిపోతున్నాయి. ఆధునిక యంత్రాలు రావడమే ఇందుకు కారణం. పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు.. రైతుల పట్ల ప్రేమ ఉంటే పథకం పనిదినాలను 200 రోజులకు పెంచాలి. పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టబోతున్నాం. త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తాం. - ఎం.నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అవసరమైన ప్రాంతాల్లోనే పనులు ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో మాత్రమే పనులునిర్వహిస్తాం. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తున్నాం. మన జిల్లాలో వెనుకబడిన మండలాలేవీ లేవని ప్రభుత్వం నిర్ధారించిన మాట వాస్తవమే. అయితే ఉపాధి హామీ పథకం జిల్లాలో రద్దవడం వంటి చర్యలేమీ ఉండవు. అవసరమైన వారికి మాత్రమే ఉపాధి పనులు కేటాయిస్తాం. - ఠాగూర్ నాయక్, డ్వామా ఇన్చార్జి పీడీ -
ఇక స్వచ్ఛమైన సాగర్!
కలుషిత జలాలు, రసాయనాలతో కాలుష్యకాసారంగా మారిపోయిన హుస్సేన్ సాగర్‌కు మంచి రోజులు రానున్నాయి. సాగర్ జలాలను శుద్ధి చేసి నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించే దిశగా మహానగరాభివృద్ధి సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. జలాశయాన్ని పరిశుభ్రం చేసేందుకు జర్మనీ, అమెరికా దేశాల్లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గల యంత్రాలను వినియోగించనుంది. ఒకపక్క సాగర్ ప్రక్షాళన.. మరోవైపు తాజాగా ఆధునిక యంత్రాల వినియోగంతో సాగర్ కొత్తందాలు సంతరించుకోనుంది. విషరసాయన వర్థాలతో హుస్సేన్ సాగర్ జలాలు కలుషితమయ్యాయి. ఈ క్రమంలో సాగర్‌లోకి వచ్చే ఫ్లోటింగ్ మెటీరియల్‌ను, గట్ల వెంట పెరిగిన గుర్రపు డెక్కను తొలగించేందుకు, ఇతర వ్యర్థాలను వెలికి తీసేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టనుంది. ఇందుకు ఆధునిక యంత్రాలను వినియోగించాలని నిర్ణయించింది. కలుషితమైన జలాలను మనుషులతో కాకుండా యంత్రాల ద్వారానే శుభ్రం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. జమ్మూ-కాశ్మీర్‌లోని ‘దాల్ లేక్’ క్లీనింగ్‌కు వినియోగిస్తున్న ఆధునిక యంత్రాలను ఇక్కడ వినియోగించేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం యాక్వటిక్ వీడ్ హార్వెస్టర్ కం ట్రాష్ కలెక్టర్, యాంఫీబియస్ ఎస్కవేటర్ తదితర యంత్రాలను కొనుగోలు చేసేందుకు రూ.11.5కోట్ల వ్యయ అంచనాలతో తాజాగా టెండర్లు ఆహ్వానించారు. జర్మనీ, అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ ఆధునిక యంత్రాలను సరఫరా చేయడంతో పాటు వచ్చే 5 ఏళ్లపాటు వారే వాటిని నిర్వహించే విధంగా టెండర్లో నిబంధన విధించారు. హుస్సేన్‌సాగర్ శుద్ధికి అనువుగా ఆ యంత్రాలను రూపొందించి 6నెలల వ్యవధిలోగా వాటిని తమకు అప్పగించాలని నిర్దేశించారు. రూ.370కోట్ల వ్యయంతో చేపట్టిన సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టులో భాగంగా ఈ యంత్రాలను కొనుగోలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాజెక్టుకు రుణ దాత అయినా ‘జైకా’ కూడా ఇందుకు పచ్చజెండా ఊపడంతో హెచ్ఎండీఏ అధికారులు పనులు వేగవంతం చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. సాగర్ ప్రక్షాళన పనులు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నందున ఆధునిక యంత్రాల సాయంతో జలాశయాన్ని మరింత శుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. జలాల శుద్ధి ఇలా ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వస్తే హుస్సేన్‌సాగర్ క్లీనింగ్ పనులు మరింత సులువు కావడంతో పాటు ఖర్చు కూడా త గ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాకాలం వస్తే చాలు నాలా ముఖద్వారాల వద్ద గుర్రపుడెక్క, ఇతర జలాధారిత మొక్కలు విస్తృతంగా పెరిగి మురుగునీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో విపరీతమైన దుర్వాసన కూడా వెదజల్లుతోంది. ప్రధానంగా పికెట్‌నాలా, కూకట్పల్లి నాలా, బంజారా, బల్కాపూర్ నాలాలు సాగర్‌లో కలిసే చోట దట్టంగా పెరిగిన గుర్రపుడెక్కను, మేట వేసిన వ్యర్థాలను తొలిగించేందుకు ఈ ఆధునిక యంత్రాలు ఎంతో ఉపకరిస్తాయని అధికారులు చెబుతున్నారు. యాంఫీబియస్ ఎస్కలేటర్ సాయంతో నాలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెలికితీసి నేరుగా లారీల్లో నింపడం ద్వారా బయటకు తరలించ వచ్చంటున్నారు. ఇప్పటివరకూ వినాయక విగ్రహాలను గట్టుకు చేర్చి నాలుగైదు రోజులు ఎండినతర్వాత ఇతర ప్రాంతాలకు తరలించేవారు. ఇప్పుడు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వస్తుండడంతో ఏరోజు వ్యర్థాలను ఆరోజే బయటకు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. తగిన రీతిలో మార్పులు... సాగర్ క్లీనింగ్‌కు కొనుగోలు చేస్తున్న యంత్రాలు 6 నెలల్లో వినియోగంలోకి వ చ్చే అవకాశం ఉంది. వినాయక చవితి నాటికే వాటిని తెప్పించాలని భావించినా... సాగర్ జలాల్లో పనులు నిర్వహించేందుకు అనువుగా ఆ యంత్రాల్లో కొన్ని మార్పులు తప్పనిసరైంది. ఈమేరకు టెండర్లో పక్కాగా సూచనలు చేశాం. యంత్రాల్లో కొన్ని మార్పులు చేసేందుకు కనీసం 5నెలలు పట్టే అవకాశం ఉంది. ఈసారికి ‘పాంటూన్ మౌంటెడ్ ఎస్కలేటర్’ను తెప్పించి గణేష్ విగ్రహాలను సాగర్ నుంచి వెలికి తీయాలని నిర్ణయించాం. కొత్తగా కొనుగోలు చేస్తున్న ‘యాక్వటిక్ వీడ్ హార్వెస్టర్ కం ట్రాష్ కలెక్టర్, యాంఫీబియస్ ఎస్కవేటర్’లను సాగర్‌లోనే కాకుండా మిగతా జలాశయాల క్లీనింగ్‌కు కూడా వినియోగించుకొనే వెసులుబాటు ఉంటుంది. వీటి వినియోగం వల్ల సాగర్ మరింత పరిశుభ్రం కానుంది. - బి.ఎల్.ఎన్.రెడ్డి, ఎస్ఈ