ఉపాధి కరువు | Employment drought | Sakshi
Sakshi News home page

ఉపాధి కరువు

Published Mon, Nov 10 2014 2:14 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

Employment drought

  • అఇకపై వెనుకబడిన మండలాలకే పరిమితం
  •  కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
  •  జిల్లాలో 17 మండలాల్లోనే పనులు
  •  వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు
  •  లక్షలాది మంది కూలీలపై ప్రభావం
  •  మరోసారి సర్వేకు అధికారుల నిర్ణయం
  • సాక్షి, కర్నూలు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వీర్యమవుతోంది. మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులతో కూలీలకు ఉపాధి కరువవుతోంది. 2004లో యూపీఏ ప్రభుత్వం ‘అడిగిన వారందరికీ పని కల్పిస్తాం.. పనుల్లేక ఏ ఒక్కరూ ఆకలితో పస్తులుండకూడదు’ అనే నిర్ణయంతో ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టింది. తాజాగా బీజేపీ సర్కారు నిర్ణయాలతో పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితే దాపురిస్తోంది.

    జిల్లాలో మొత్తం 54 మండలాలు ఉండగా.. వెనుకబడిన ప్రాంతాలు 17 మాత్రమేనని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1, 2015 నుంచి ఆయా మండలాల్లో ఉపాధి మృగ్యం కానుంది. లక్షలాది మంది కూలీలపై ఈ ప్రభావం కనిపించనుంది. పథకంలో భాగంగా విడుదలయ్యే కోట్లాది రూపాయాల్లో దుర్వినియోగం అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా పథకాన్ని దశల వారీగా ఎత్తేసే ఆలోచనలో భాగంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 3223 ఉత్తర్వులో వెనుకబడిన ప్రాంతాలకు మాత్రమే ఉపాధి పథకాన్ని పరిమితం చేయాలని స్పష్టం చేయడం గమనార్హం. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 655 మండలాలు ఉండగా.. 146 మండలాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించారు. ఆ మేరకు జిల్లాలోని దేవనకొండ, గోనెగండ్ల, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, నందవరం, పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, కోడుమూరు, సి.బెళగల్, గూడూరు, చాగలమర్రి, గడివేముల మండలాలు మాత్రమే ఉపాధి పనులకు ఎంపికయ్యాయి.

    ఈ నిర్ణయం మెట్ట ప్రాంతంలో ఉపాధి పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నకూలీలకు శాపంగా పరిణమించిం ది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. జిల్లాలోని 886 గ్రామ పంచాయతీల పరిధిలో 7.26 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు ఉండగా.. 15.60 లక్షల మంది కూలీలుగా నమోదయ్యారు. ఇకపై వీరిలో 75 శాతం మందికి ఉపాధి కల్పించే పరిస్థితి లేదని తెలుస్తోంది.

    జాబ్ కార్డులున్న వారిలో ఇప్పటి వరకు ఎక్కువగా ఉపాధి పనులకు హాజరైన వారికి మాత్రమే రాబోయే రోజుల్లో పని కల్పించేందుకు సర్వే కొనసాగుతోంది. అత్యం త వెనుకబడిన, ఎస్సీ జనాభా అధికంగా ఉన్న నందికొట్కూరు, ఆత్మకూరు మండలాలను సైతం అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా గుర్తించ డం సర్వే తీరుకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని మండలాల్లో మరోసారి సర్వే నిర్వహించి.. ఆ తర్వాత గ్రామ సభల ద్వారా ఏ నెలలో పనులు నిర్వహించాలో అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది.
     
    నిధుల వ్యయంలోనూ మార్పు

    ఉపాధి హామీ పథకం అమలుకు ఇప్పటి వరకు విడుదల చేసిన నిధుల్లో 60 శాతం వేతనాలకు, 40 శాతం సామగ్రి కొనుగోలు, పనుల నిర్వహణకు ఖర్చు చేస్తున్నారు. ఈ విధానాన్నీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. నిధుల్లో 60 శాతం నిధులను సామగ్రి కొనుగోలు, పనుల నిర్వహణకు.. 40 శాతం నిధులను వేతనాల చెల్లింపునకు ఖర్చు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో కూలీలకు తగిన సొమ్ము చెల్లించే పరిస్థితి కరువవుతోంది.
     
    ‘ఉపాధి’ తొలగించొద్దు

    నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఏకంగా ఉపాధి పథకాన్నే తొలగించడం సరికాదు. మేధావులు, ఆర్థికవేత్తలు సైతం ఈ పథకాన్ని కొనసాగించాలని, కూలీలకు అన్యాయం చేయొద్దని కోరుతూ ప్రధానిమంత్రి నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీల పనిదినాలు యేటా తగ్గిపోతున్నాయి. ఆధునిక యంత్రాలు రావడమే ఇందుకు కారణం. పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు.. రైతుల పట్ల ప్రేమ ఉంటే పథకం పనిదినాలను 200 రోజులకు పెంచాలి. పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టబోతున్నాం. త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తాం.
     - ఎం.నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి
     
     అవసరమైన ప్రాంతాల్లోనే పనులు

     ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో మాత్రమే పనులునిర్వహిస్తాం. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తున్నాం. మన జిల్లాలో వెనుకబడిన మండలాలేవీ లేవని ప్రభుత్వం నిర్ధారించిన మాట  వాస్తవమే. అయితే ఉపాధి హామీ పథకం జిల్లాలో రద్దవడం వంటి చర్యలేమీ ఉండవు. అవసరమైన వారికి మాత్రమే ఉపాధి పనులు కేటాయిస్తాం.  
    - ఠాగూర్ నాయక్, డ్వామా ఇన్‌చార్జి పీడీ
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement