National Rural Employment
-
పట్టణ ఉపాధికి హామీ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తరహాలో దేశంలోని పట్టణ ప్రాంత పేదల కోసం ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకాన్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజల జీవన స్థితిగతుల మార్పునకు చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ కేటీఆర్.. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశం అందుకు మినహాయింపు కాదని పేర్కొన్నారు. మెరుగైన ఉపాధి, మంచి జీవనప్రమాణాల కోసం గ్రామీణ ప్రజలు పట్టణాలవైపు తరలుతున్న విషయాన్ని గుర్తు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 31 శాతం జనాభా పట్టణాల్లో నివాసం ఉందని, 2030 నాటికి అది 40 శాతానికి పైగా పెరగనుందని వివరించారు. తెలంగాణ వంటి వేగంగా అభివద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఇది 50 శాతాన్ని దాటే అవకాశం ఉన్నదన్నారు. పెరిగే పట్టణ పేదరికంపై దృష్టి పెట్టాలి.. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ పెరిగే పేదరికంపై కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. పట్టణ పేదలకు గృహవసతి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత, జీవనోపాధి వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. దురదృష్టవశాత్తు పట్టణ పేదలు అత్యధిక శాతం అసంఘటిత రంగంలో కార్మికులుగా, చిరు వ్యాపారులుగా, కూలీలుగా పని చేస్తున్నారని, ఒక్కరోజు ఉపాధి దొరకక పోయినా వారి బతుకు దుర్భరంగా మారే పరిస్థితి ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో పట్టణ పేదల ఉపాధికి, ఆదాయానికి మరింత హామీ అందించేలా కేంద్రం ముందుకు రావాలన్నారు. కరోనా సంక్షోభం వల్ల పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిందన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లెక్కల ప్రకారం 2019 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్యలో గరిష్టంగా 21 శాతం నిరుద్యోగం నెలకొని ఉందన్నారు. పార్లమెంటరీ కమిటీ ఇదే చెప్పింది.. గతంలో పార్లమెంట్ సభ్యుడు భర్తృహరి మహతాబ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సీఐఐ వంటి సంస్థలు పట్టణ ప్రాంతాల్లోని ప్రజల సామాజిక భద్రతను పెంచేందుకు పట్టణ ఉపాధిహామీ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా సూచించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. అసంఘటిత రంగంలో ఉన్న పేదలకు నైపుణ్య అభివృద్ధి, ఆర్థిక తోడ్పాటు, సామాజిక భద్రత, సంక్షేమం వంటి అంశాలను ఈ ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమంలో చేర్చాలని సూచించారు. లాక్డౌన్ సమయంలో దేశం చూసిన హృదయవిదారకమైన పట్టణ పేద ప్రజల వలస సంఘటనలు పునరావృతం కాకుండా అసంఘటిత రంగాన్ని మరింత బలోపేతం చేయాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పురపాలికలకు బాధ్యత ఉండాలి.. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు చేయూతనందించాల్సిన బాధ్యత కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగర, పురపాలికలపై కూడా ఉండాలని కేటీఆర్ అన్నారు. పట్టణాల్లో చేపట్టే ఫుట్‌పాత్‌లు, డ్రైనేజీల నిర్మాణం, మొక్కల పెంపకం వంటి మౌలిక వసతుల నిర్వహణ వంటి కార్యక్రమాల్లో పట్టణ పేదలకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. పట్టణ పేద ప్రజలు నాణ్యమైన జీవన ప్రమాణాలను అందుకోవాలంటే, వారి ఉపాధికి మరింత హామీ కల్పించడం మాత్రమే ఏకైక పరిష్కార మార్గమని పేర్కొన్నారు. -
కూలి రాక.. ఉపాధి లేక!
జిల్లాలో కూలీలకు అందని డబ్బులు వేసవిలో పనుల్లేక పస్తులు సర్వర్ బిజీతో ఆపరేటర్ల ఇబ్బందులు లక్ష్యానికి సవాలుగా మారిన చెల్లింపులు మహబూబ్‌నగర్ న్యూటౌన్: కరువుకాలంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులు ముందుకుసాగడం లేదు. కూలిల చెల్లింపులు ఆలస్యమవడంతో ‘లక్ష్య సాధన’ కు అడుగుపడడం లేదు. దీంతో సకాలంలో కూలిడబ్బులు అందక పేదకుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. జిల్లాలో 9,12,220 కుటుంబాలకు ఉపాధి జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 10,39,162 మంది కూలీలు 53,658 శ్రమశక్తి సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలో 1.47లక్షలమంది కూలీలు పనులు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా కూలీలకు 16.88 శాతం అంటే 28.18లక్షల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. నెలరోజులుగా కూలీ డబ్బులు అందకపోవడం, ఎండల తీవ్రతతో భూమి గట్టిపడి కూలిరేట్లు గిట్టుబాటుకాకపోవడం వంటి సమస్యలతో ఉపాధి పనులు ముందుకు సాగడం లేదు. దీంతో మాగనూర్, మల్దకల్, ఇటిక్యాల, ధరూర్, దౌల్తాబాద్, గట్టు, అయిజ మండలాలు పనుల నిర్వహణలో 50శాతం లక్ష్యం కూడా చేరుకోలేదు. వారం రోజుల్లో డబ్బులు చెల్లించేందుకు పే ఆర్డర్లు తయారుచేసి చెల్లింపు సంస్థలకు పంపించాలనే నిబంధన ఉంది. ఆన్లైన్లో చెల్లించాల్సి ఉండడంతో సాఫ్ట్వేర్ పనిచేయడం లేదు. సర్వర్బిజీతో కంప్యూటర్ ఆపరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. వారం పదిరోజులైనా ఆన్లైన్లో పేఆర్డర్లు తయారు కావడం లేదు. ఉన్నతాధికారులు కారణాలను అన్వేషించకుండా కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆసక్తిచూపని కూలీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిస్తోంది.. ఇంకా సగం చెల్లింపులు అందలేదు. కూలి డబ్బులను నెలకోమారు, మూడు వారాలకు ఒకమారు ఇసుతండడంతో పనులపై కూలీలు ఆసక్తిచూపడం లేదు. జిల్లాలో ఉపాధి కూలీలకు రూ.7.55కోట్లు చెల్లించాల్సి ఉంది. 1,97,603 మంది కూలీలు చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారు. మండలాల్లో కూలీలు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కడం లేదు. ఈ ఏడాది ఏర్పడిన వర్షాభావం కారణంగా వ్యవసాయరంగం పూర్తిగా దెబ్బతినడంతో రైతులు, రైతు కూలీలు ఉపాధి హామీ పథకం వైపు ఆశగా చూస్తున్నారు. పనులకు డిమాండ్ బాగానే ఉన్నా నిర్వహణలో లోపాల కారణంగా వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించి కూలీ కుటుంబాలకు కల్పిస్తున్న 100రోజుల పనిదినాలను 150కు పెంచింది. ఫిబ్రవరి నుంచి దినసరి కూలిరేటును రూ.161 నుంచి రూ.189కు ప్రభుత్వం పెంచింది. ఫిబ్రవరి నెలకు 20 శాతం, మార్చికు 25 శాతం పారితోషికాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. పారితోషికాలు, కూలిరేట్లు, పనిదినాల పెంపుపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఉపాధి పనుల్లో కూలీలు అధికసంఖ్యలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
ఉపాధి పనుల పరిశీలన తప్పనిసరి
బేస్తవారిపేట : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహిస్తున్న పనులను నెలలో రెండుసార్లు తప్పనిసరిగా పరిశీలించాలని డ్వామా పీడీ ఎన్.పోలప్ప టెక్నికల్ అసిస్టెంట్లకు సూచించారు. గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల టెక్నికల్ అసిస్టెంట్లతో స్థానిక ఐడబ్ల్యూఎంపీ కార్యాలయంలో శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఉద్యానవన పనులను వేగవంతం చేయాలని సూచించారు. వాటర్‌షెడ్ కమిటీ సభ్యులు, రైతులతో సమావేశాలు నిర్వహించి హార్టీకల్చర్‌పై అవగాహన కల్పించాలన్నారు. నాటిన మొక్కలు చనిపోకుండా రైతులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నారు. తరచూ తనిఖీలు చేయాలని సూచించారు. హార్టీకల్చర్ పనుల అనంతరం బిల్లులిప్పించే బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పంచాయతీల వారీగా ప్లాంటేషన్‌పై సిబ్బందితో సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా హార్టీకల్చర్ ప్లాంటేషన్ అధికారిణి ఎస్.వెంకటరత్న, ఐడబ్ల్యూఎంపీ ప్రాజెక్ట్ అధికారి ఎం.రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. గిట్టుబాటు కూలి కల్పించాలి... ఉపాధి కూలీలకు గిట్టుబాటు కూలి కల్పించే బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లపైనే ఉందని డ్వామా పీడీ పోలప్ప పేర్కొన్నారు. బేస్తవారిపేటలోని ప్రాంతీయ జీవనోపాధుల వనరుల కేంద్రంలో క్లస్టర్ పరిధిలోని ఏపీవో, టీఏలు, ఎఫ్ఏలతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి పంచాయతీలో పనిదినాలు పూర్తిచేయాలని, కచ్చితమైన కొలతలు ఇచ్చిన కూలీలకు రోజుకు రూ.150 కూలి పడేలా చూడాలని సూచించారు. బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానా విధిస్తామని సిబ్బందిని హెచ్చరించారు. పనిచేసిన 15 రోజుల్లోపే కూలీలకు కూలి మంజూరు చేయాలన్నారు. సమావేశంలో హార్టీకల్చర్ జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ ఎస్.వెంకటరత్న, ఏపీడీ హరికృష్ణ, ఏపీఓ, టీఏ, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు. -
72 మందిపై క్రిమినల్ కేసులు
కర్నూలు(అగ్రికల్చర్) : జాతీయ గ్రామీణ ఉపాధి అక్రమాలపై జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ కొరడా ఝుళిపించారు. ఏకంగా 72 మందిపై వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలని సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు. క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని పర్యవేక్షించాలని డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్లకు సూచించారు. ఇటీవలనే జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉపాధి అక్రమాలపై ధ్వజమెత్తారు. అక్రమాలకు బాధ్యులైన వారిపై తీసుకున్న చర్యలపై నిలదీశారు. బాధ్యులపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. త్వరలోనే అక్రమాలకు బాధ్యులైనవారిపై క్రిమినల్ కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటామని ఆ రోజున కలెక్టర్ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా 72 మందిపై వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్లలో క్రిమినల్ కేసులు పెట్టాలని కలెక్టర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ముగ్గురు ఏపీఓలు ఉండగా, 21 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు మేట్లు, ఆరుగురు ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఉండగా, మిగిలిన వారందరూ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరు దాదాపు రూ.2.93 కోట్లు దుర్వినియోగం చేసినట్లు సామాజిక తనిఖీల ద్వారా నిర్ధారణ అయింది. ఇందులో రూ.37.06 లక్షలు రికవరీ అయింది. ఇంకా రూ.2.53 కోట్లకు పైగా రికవరీ కావాల్సి ఉంది. వీరిలో చాలామందిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించగా, కొందరిని ఇంకా కొనసాగిస్తున్నారు. వీరి నుంచి స్వాహా చేసిన సొమ్ము రికవరీ కాకపోవడంతో క్రిమినల్ చర్యలకు ఆదేశాలిచ్చారు. వీరిపైనే క్రిమినల్ కేసులు... సంజామల మండలంలో కె.మధుసూదన్(టీఏ) కౌతాలం మండలంలో వెంకన్నబాబు(టీఏ), పి.చాంద్‌బాషా(ఎఫ్ఏ), వీరన్నగౌడు(ఎఫ్ఏ), వెల్దుర్తి మండలంలో జె.భాస్కర్(టీఏ), సులోచన(ఎఫ్ఏ), లింగన్న(ఎఫ్ఏ), రాంభూపాల్‌రెడ్డి(ఎఫ్ఏ), మద్దికెర మండలంలో రంగస్వామి(టీఏ), సుబ్బరాయుడు(టీఏ), శ్రీనివాసులు(ఎఫ్ఏ), వెలుగోడు మండలంలో చంద్రశేఖర్‌గౌడ్(టీఏ), విజయభాస్కర్(ఏపీఓ), ఈడిగ వెంకట కుమార్(ఈసీ), కె.నాగరాజు ఆచారి(టీఏ), రామకృష్ణారెడ్డి(టీఏ), వెంకటేశ్వరరెడ్డి(ఎఫ్ఏ), రవికుమార్(ఎఫ్ఏ), జూపాడుబంగ్లా మండలంలో మిద్దె రత్నాకర్‌రావు(టీఏ), కొలిమిగుండ్ల మండలంలో సీపీ స్వాములు(టీఏ), పత్తికొండ మండలంలో పి.స్వాములు(టీఏ), గిరి నాయక్(టీఏ), ఎం.శంకర్(ఎఫ్ఏ), హారిఫ్ బాషా(టీఏ), ఆళ్లగడ్డ మండలంలో పుల్లారెడ్డి(ఈసీ), రుద్రవరం మండలంలో టి.పుల్లయ్య(టీఏ), వి.నాగేశ్వరరావు(టీఏ), పగిడ్యాల ఏపీఓ బి.గౌరీబాయి, గోనెగండ్ల మండలంలో బాలకృష్ణ(ఈసీ), హరినాథ్(టీఏ), దస్తగిరి(ఎఫ్ఏ), రంగరాజు(ఎఫ్ఏ), షేక్షావలి(ఎఫ్ఏ), వీరప్ప(ఎఫ్ఏ), ఆస్పరి మండలంలో రామచంద్ర(టీఏ), బతుకన్న(ఎఫ్ఏ), క్రిష్ణగిరి మండలంలో మద్దిలేటి(ఏపీఓ), మహేష్‌రెడ్డి(ఈసీ), ఆనందకుమార్(టీఏ), జి.విజయభాస్కర్(టీఏ), తులసీనాథ్ గౌడు(ఎఫ్ఏ), పోతురెడ్డి(ఎఫ్ఏ), సురేష్‌నాయుడు(ఎఫ్ఏ), వెంకటేశ్వర్లు(ఎఫ్ఏ), హేసేనమ్మ(ఎఫ్ఏ), మదనేశ్వరి(ఎఫ్ఏ), లక్ష్మీదేవి(ఎఫ్ఏ), బేతంచెర్ల మండలంలో ఎల్లస్వామి(ఎఫ్ఏ), దేవనకొండ మండలంలో ఎం.ఓబులేసు, తులసిరాముడు, గూడూరు మండలంలో తిమ్మన్న, కల్లూరు మండలంలో బి.మనోహర్, కోడుమూరు మండలంలో మాధవి, కోవెలకుంట్ల మండలంలో ప్రభావతమ్మ, మహానంది మండలంలో డి.శ్రీనివాసులు, మిడుతూరు మండలంలో కె.వెంకటేశ్వర్లు, అవుకు మండలంలో డి.సురేష్‌బాబు, పెద్దకడుబూరు మండలంలో హేమంత్‌రెడ్డి, బి.రామాంజనేయులు, కె .లక్ష్మన్న, ఎం.రామాంజనేయులు, తుగ్గలి మండలంలో జె.రాజు, వైకుంఠం, భీమలింగప్ప, రామకృష్ణ, ఎమ్మిగనూరు మండలం నబిరసూల్, ఆత్మకూరు మండలంలో పి.నాగరాజు(వీరందరూ ఎఫ్‌ఏలే), గోనెగండ్ల బాలమద్దయ్య టిఏ, బాలక్రిష్ణ(ఈసీ), నందవరం మండలంలో ఎల్లారెడ్డి(మేట్), దావీదు(మేట్), కౌతాళం మండలంలో బసవరాజు(ఎఫ్ఏ)లు ఉన్నారు. తక్షణం వీరందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని ఈ మేరకు ఎంపీడీఓలకు ప్రొసీడింగ్ పంపామని డ్వామా విజిలెన్స్ ఆఫీసర్ చలపతిరావు తెలిపారు. -
కదం తొక్కిన ఉపాధి కూలీలు
జఫర్‌గఢ్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సవరణల పేరుతో కుదించాలని చూస్తే మోడీ సర్కారుకు గోరికట్టడం ఖాయమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రంగయ్య హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది ఉపాధి కూలీలు, మేట్లు ఉపాధి పథకాన్ని కుదించొద్దని, యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రం లోని స్థానిక రామాలయం నుంచి పెద్ద ఎత్తున భారీ నిరసన ప్రదర్శన బుధవారం చేపట్టారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి మహాధర్నా నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీహెచ్ రంగయ్య మాట్లాడుతూ దేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకాన్ని నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు పూనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహయ కార్యదర్శి రాపర్తి రాజు, ఆర్ సోమయ్య, కాట సుధాకర్, మర్రి రమేష్, గుండెబోయిన రాజు, శిరంశేట్టి రవి, సిద్దం లింగయ్య, ప్రభాకర్, టి.రమేష్, కుమార్, డి.సంపత్, యాకనాథం, శ్రీను, ఎల్లస్వామి, అనిల్, పిరోజ్‌ఖాన్, బల్లెపు రవి, రాంకుమార్తోపాటు ఆయా గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలు, మహిళలు, మేట్లు వందలాదిగా పాల్గొన్నారు. -
ఉపాధి కరువు
అఇకపై వెనుకబడిన మండలాలకే పరిమితం కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జిల్లాలో 17 మండలాల్లోనే పనులు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు లక్షలాది మంది కూలీలపై ప్రభావం మరోసారి సర్వేకు అధికారుల నిర్ణయం సాక్షి, కర్నూలు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వీర్యమవుతోంది. మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులతో కూలీలకు ఉపాధి కరువవుతోంది. 2004లో యూపీఏ ప్రభుత్వం ‘అడిగిన వారందరికీ పని కల్పిస్తాం.. పనుల్లేక ఏ ఒక్కరూ ఆకలితో పస్తులుండకూడదు’ అనే నిర్ణయంతో ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టింది. తాజాగా బీజేపీ సర్కారు నిర్ణయాలతో పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితే దాపురిస్తోంది. జిల్లాలో మొత్తం 54 మండలాలు ఉండగా.. వెనుకబడిన ప్రాంతాలు 17 మాత్రమేనని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1, 2015 నుంచి ఆయా మండలాల్లో ఉపాధి మృగ్యం కానుంది. లక్షలాది మంది కూలీలపై ఈ ప్రభావం కనిపించనుంది. పథకంలో భాగంగా విడుదలయ్యే కోట్లాది రూపాయాల్లో దుర్వినియోగం అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా పథకాన్ని దశల వారీగా ఎత్తేసే ఆలోచనలో భాగంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 3223 ఉత్తర్వులో వెనుకబడిన ప్రాంతాలకు మాత్రమే ఉపాధి పథకాన్ని పరిమితం చేయాలని స్పష్టం చేయడం గమనార్హం. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 655 మండలాలు ఉండగా.. 146 మండలాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించారు. ఆ మేరకు జిల్లాలోని దేవనకొండ, గోనెగండ్ల, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, నందవరం, పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, కోడుమూరు, సి.బెళగల్, గూడూరు, చాగలమర్రి, గడివేముల మండలాలు మాత్రమే ఉపాధి పనులకు ఎంపికయ్యాయి. ఈ నిర్ణయం మెట్ట ప్రాంతంలో ఉపాధి పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నకూలీలకు శాపంగా పరిణమించిం ది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. జిల్లాలోని 886 గ్రామ పంచాయతీల పరిధిలో 7.26 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు ఉండగా.. 15.60 లక్షల మంది కూలీలుగా నమోదయ్యారు. ఇకపై వీరిలో 75 శాతం మందికి ఉపాధి కల్పించే పరిస్థితి లేదని తెలుస్తోంది. జాబ్ కార్డులున్న వారిలో ఇప్పటి వరకు ఎక్కువగా ఉపాధి పనులకు హాజరైన వారికి మాత్రమే రాబోయే రోజుల్లో పని కల్పించేందుకు సర్వే కొనసాగుతోంది. అత్యం త వెనుకబడిన, ఎస్సీ జనాభా అధికంగా ఉన్న నందికొట్కూరు, ఆత్మకూరు మండలాలను సైతం అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా గుర్తించ డం సర్వే తీరుకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని మండలాల్లో మరోసారి సర్వే నిర్వహించి.. ఆ తర్వాత గ్రామ సభల ద్వారా ఏ నెలలో పనులు నిర్వహించాలో అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. నిధుల వ్యయంలోనూ మార్పు ఉపాధి హామీ పథకం అమలుకు ఇప్పటి వరకు విడుదల చేసిన నిధుల్లో 60 శాతం వేతనాలకు, 40 శాతం సామగ్రి కొనుగోలు, పనుల నిర్వహణకు ఖర్చు చేస్తున్నారు. ఈ విధానాన్నీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. నిధుల్లో 60 శాతం నిధులను సామగ్రి కొనుగోలు, పనుల నిర్వహణకు.. 40 శాతం నిధులను వేతనాల చెల్లింపునకు ఖర్చు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో కూలీలకు తగిన సొమ్ము చెల్లించే పరిస్థితి కరువవుతోంది. ‘ఉపాధి’ తొలగించొద్దు నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఏకంగా ఉపాధి పథకాన్నే తొలగించడం సరికాదు. మేధావులు, ఆర్థికవేత్తలు సైతం ఈ పథకాన్ని కొనసాగించాలని, కూలీలకు అన్యాయం చేయొద్దని కోరుతూ ప్రధానిమంత్రి నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీల పనిదినాలు యేటా తగ్గిపోతున్నాయి. ఆధునిక యంత్రాలు రావడమే ఇందుకు కారణం. పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు.. రైతుల పట్ల ప్రేమ ఉంటే పథకం పనిదినాలను 200 రోజులకు పెంచాలి. పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టబోతున్నాం. త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తాం. - ఎం.నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అవసరమైన ప్రాంతాల్లోనే పనులు ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో మాత్రమే పనులునిర్వహిస్తాం. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తున్నాం. మన జిల్లాలో వెనుకబడిన మండలాలేవీ లేవని ప్రభుత్వం నిర్ధారించిన మాట వాస్తవమే. అయితే ఉపాధి హామీ పథకం జిల్లాలో రద్దవడం వంటి చర్యలేమీ ఉండవు. అవసరమైన వారికి మాత్రమే ఉపాధి పనులు కేటాయిస్తాం. - ఠాగూర్ నాయక్, డ్వామా ఇన్చార్జి పీడీ -
పెంపు సరే...? దక్కేదెంత...?
విజయనగరం మున్సిపాలిటీ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా లో వేతనదారులకు కనీస వేతనాలు దక్కడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపమో...దిగువ స్థాయి సిబ్బంది నిర్లక్ష్య వైఖరో... కూలీల్లో అవగాహన లేకో.. తెలియదు కానీ రోజంతా కాయకష్టం చేస్తున్నా వేతనదారులకు కనీస సరైన వేతనం లభించడంలేదు. వలసలను నిరోధించి, ఉన్న ఊళ్లో పనికల్పించాలని అమలు చేస్తున్న ఈ పథకం లక్ష్యం నెరవేరడంలేదు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఉపాధి పనుల వేతనదారులకు సగటున రూ.102 వేతనం మాత్రమే అందుతోంది. వేతనానికి తగ్గ పనులు కల్పించడంలో అధికారులు విఫలమవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ పథకంలో పని చేస్తున్న వేతనదారులకు ఇప్పటి వరకు అందిస్తున్న సగటు వేతనాన్ని రూ.149నుంచి రూ.169 వరకు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఇది వేతనదారులకు పెద్దగా ఆనందం కలిగించలేదు. తాము చేసిన పనికి కిట్టుబాటు కూలి రానప్పుడు వేతనం ఎంతపెంచితే ఏం లాభమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకం అమలులోపాలను సరిచేస్తేనే ప్రయోజనం ఉంటుందని వారు కోరుతున్నారు. జిల్లాలో పరిస్థితి ఇదీ.... జిల్లాలో ఐదు లక్షల 31వేల మందికి జాబ్‌కార్డులు జారీ చేయగా.. అందులో వేసవి కాలంలోగరిష్టంగా మూడు లక్షల వరకు వేతనదారులు పనులకు హాజరువుతుంటారు. ప్రస్తుతం వర్షాకాలం కావడం, కాసిన్ని వ్యవసాయ పనులు అందుబాటులో ఉండడంతో 25వేల మంది వరకు వేతనదారులు పనులకు వస్తున్నారు. పనులకు వస్తున్న వేతనదారులకు సగటున రూ.102 నుంచి రూ.103 వరకు వేతనం లభిస్తోంది. ఇందులో గరిష్టంగా ఇప్పటి వరకు అమలైన రూ.149 వేతనం 10 శాతం మంది వేతనదారులకు అందుతుండగా.. రూ.60 నుంచి రూ.70 వేతనం తీసుకునే వేతనదారులు 40 శాతం వరకు ఉంటారు. అంతేకాకుండా రూ.30 నుంచి రూ.40 వేతనం అందుకునే వేతనదారులు 15 శాతం వరకు ఉంటారని అంచనా. ఈ లెక్కల మేరకు ప్రభుత్వం నిర్దేశిస్తున్న వేతనం అతి తక్కువ మందికే దక్కుతోంది. ఇందుకు అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది మధ్య సమన్వయలోపమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. వేతనానికి సరిపడా పని కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా నిర్దిష్ట పని గంటల విషయంలో అధికారుల నుంచి స్పష్టతలేకపోవడం మరో లోపం. దీంతో వేతనదారులు పనులకు వెళుతున్నా నిర్దేశించిన మొత్తాన్ని అందుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని పలు గ్రామాలకు చెందిన వేతనదారులు జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. అరకొర వేతనంతో బతుకులు వెళ్లదీయవలసిన దుస్థితి నెలకొంది. దీంతో చాలా మంది వేతనదారులు వలసబాటపడుతున్నారు. క్యూబిక్ మీటర్ చొప్పున అధికారులు చెల్లించే రేట్లు ఇలా... జిల్లాలో నిర్వహిస్తున్న వివిధ రకాల పనులకు అధికారులు ఇస్తున్న వేతనం క్యూబిక్ మీటర్ చొప్పున ఇలా ఉన్నాయి. కాల్వల్లో పూడికల తొలగింపునకు మెత్తటి నేలలో రూ.59, గట్టి నేలలో రూ.68 చెల్లిస్తున్నారు. భూ అభివృద్ధి పనులకు క్యూబిక్ మీటర్ మెత్తటి నేలలో అయితే రూ.116, గట్టి నేలలో అ యితే రూ.126, చెరువు పనులకు దూరాన్ని బట్టి క్యూబిక్ మీటర్‌కు రూ. 106, రూ.126,రూ.145 చెల్లిస్తున్నారు. ఇదిలా ఉండగా మొక్కలు పెంపకం లో భాగంగా అధికారులు నిర్దేశించిన మేరకు ఒక గుంత తవ్వేందుకు మె త్తటి నేలలో అయితే రూ.104, గట్టి నేలలో అయితే రూ.109 చెల్లిస్తున్నారు. -
కూలీల సొమ్ము వడ్డీకి..
‘ఉపాధి’ డబ్బుతో ఏజెన్సీల అక్రమ వ్యాపారం 4 నెలలుగా కూలీలకు అందని వేతనాలు బ్యాంకులతో నిర్వాహకుల కుమ్మక్కు డ్వామా అధికారుల విచారణలో వెల్లడి 28 ఏపీజీవీబీ శాఖలకు నోటీసులు జీరోమాస్ సంస్థకు కళ్లెం త్వరలో పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులు రాష్ర్ట కార్యాలయానికి నివేదిక అందజేత హన్మకొండ :జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మరో బాగోతం బట్టబయలైంది. కూలీలకు చెల్లించాల్సిన వేతనాలను సకాలంలో ఇవ్వకుండా... వాటిపై వచ్చే వడ్డీతో జేబులు నింపుకుంటున్నారు. ప్రతి నెలా రూ.10 లక్షలకు పైగా మిత్తిని తమ ఖాతాలో జమ చేసుకుంటున్నారు. వడ్డీ వ్యాపారంలో ఏజెన్సీలు ప్రధాన పాత్ర పోషించగా... బ్యాంకర్లు, మండలస్థాయి అధికారులు తమ వంతు సహకారం అందించారు. ఫలితంగా కూలీలకు నెలల తరబడి వేతనాలు పెండింగ్లోరూ.50 లక్షలకు పైగా మిత్తి స్వాహా జిల్లాలో ఉపాధి హామీ కింద పనులు చేసిన కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడం... ఏజెన్సీల ఖాతాల్లో ఈ నిధులు భద్రంగా ఉండడాన్ని డ్వామా అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. అనుమానంతో మూడు ఏజెన్సీల పని తీరుపై విచారణ చేపట్టారు. కూలీల సొమ్మును నెలల తరబడి బ్యాంకుల్లో నిల్వచేసినట్లు గుర్తించారు. ఆ సొమ్ముకు సంబంధించి సంస్థ నిర్వాహకులు వడ్డీ తీసుకున్నట్లు, ప్రతి నెలా ఆలస్యంగా వేతనాలు ఇస్తున్నట్లు తేటతెల్లమైంది. ప్రధానంగా ఏపీజీవీబీ బ్యాంక్ నుంచి రావాల్సిన సుమారు రూ. 14 కోట్లు ఇప్పటికీ జీరోమాస్ సంస్థ ఖాతాల్లోనే ఉన్నట్లు గ్రహించారు. రెండు నెలల కిందటే నిధులు విడుదల చేసినా.. పలు కారణాలను సాకుగా చూపిస్తూ ఆ సంస్థ తమ ఖాతాల్లోనే పెట్టుకున్నట్లు... బ్యాంకర్లు కూడా వారికి సహకరిస్తూ వడ్డీ జమ చేసినట్లు వారి విచారణలో బహిర్గతమైంది. అదేవిధంగా ఎనిమిది మండలాల్లో ఫిమో, ఒక్క మండలంలో మణిపాల్ ఏజెన్సీలు కూడా కూలీ డబ్బును చెల్లించలేదు. నాలుగు నెలల వ్యవధిలో 50 మండలాల పరిధిలోని మూడు ఏజెన్సీలు కూలీల వేతనాలపై సుమారుగా రూ. 50 లక్షలకు పైగా వడ్డీని పొందినట్లు తేలింది. దీంతో ఎక్కువ మండలాల్లో ఏపీజీవీబీ నుంచి వేతనాలు చెల్లిస్తున్న జీరోమాస్ సంస్థకు కళ్లెం వేశారు. చెల్లింపు అధికారాలను నిలిపివేశారు. ప్రస్తుతం 28 మండలాల్లో చెల్లింపులన్నీ నేరుగా రాష్ట్ర కార్యాలయం నుంచి పోస్టాఫీసు ఖాతాలకు మారుస్తూ డ్వామా పీడీ ఆదేశాలిచ్చారు. పడగా... వారి కుటుంబాలు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారుు. ఎట్టకేలకు ఈ బాగోతాన్ని గ్రహించిన డ్వామా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఏజెన్సీలకు కళ్లెం వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏజెన్సీల పాత్ర లేకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ (డీఓపీ) విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. కూలీలకు ఏజెన్సీలతో సంబంధం లేకుండా నేరుగా చెల్లింపులు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర కార్యాలయానికి నివేదించారు. అంతేకాదు... కూలీ డబ్బులతో వడ్డీ వ్యాపారం చేస్తున్న మూడు ఏజెన్సీలు, 28 బ్యాంకులకు నోటీసులు జారీ చేశారు. జిల్లాలో 3 ఏజెన్సీలు... ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించేందుకు అప్పటి సర్కారు ఏజెన్సీలకు అధికారాన్ని కట్టబెట్టింది. కూలీలు చేసిన పని దినాలను క్షేత్రస్థాయి సిబ్బంది నమోదు చేసిన తర్వాత... వారి కూలి డబ్బులు ఏజెన్సీల ఖాతాల్లో జమ అవుతాయి. అక్కడ నుంచి కూలీలకు చెల్లింపులు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో మూడు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించారు. ఎనిమిది మండలాల పరిధిలో యాక్సిస్ బ్యాంక్ తరఫున ఫిమో... తాడ్వాయి మండలంలో యాక్సిస్ బ్యాంక్ తరఫున మణిపాల్.... 28 మండలాల్లో ఏపీజీవీబీ తరఫున జీరోమాస్ సంస్థలు ఏజెన్సీలుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఏజెన్సీ నిర్వాహకులు అక్రమాలకు తెరలేపారు. బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై వడ్డీ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. కూలీలకు చెల్లించాల్సిన డబ్బులను వారికి ఇవ్వకుండా.. ఏజెన్సీ ఖాతాల్లో సర్కారు జమ చేసిన మొత్తాన్ని నెలల తరబడి నిల్వ ఉంచుతూ వడ్డీ దండుకుంటున్నారు. ఆ మండలాలు ఇవే... 28 మండలాలకు సంబంధించి జీరోమాస్ సంస్థ ఖాతాలో ఉన్న కూలీ డబ్బులు రూ. 14 కోట్లను కూలీల పోస్టాఫీసు ఖాతాల్లో జమ చేసేలా డ్వామా అధికారులు చర్యలు చేపట్టారు. బచ్చన్నపేట, భూపాలపల్లి, చెన్నారావుపేట, చేర్యాల, ధర్మసాగర్, డోర్నకల్, ఘన్పూర్, గూడూర్, జనగాం, కేసముద్రం, కొడకండ్ల, మద్దూర్, మహబూబాబాద్, మరిపెడ, మొగుళ్లపల్లి, నల్లబెల్లి, నర్సంపేట, నర్సింహులపేట, నెల్లికుదురు, పరకాల, రేగొండ, శాయంపేట, వెంకటాపూర్, వర్ధన్నపేట, చిట్యాల, దేవరుప్పుల, దుగ్గొండి, గీసుగొండ, స్టేషన్ ఘన్పూర్, గోవిందరావుపేట, హన్మకొండ, హసన్‌పర్తి, ఖానాపూర్, కురవి, ములుగు, నర్మెట్ట, నెక్కొండ, పాలకుర్తి, రాయపర్తి, తొరూర్, జఫర్‌గఢ్ మండలాల్లో పోస్టాఫీసుల్లో ఖాతాలు తీయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ మండలాల్లో చెల్లింపులు ఆగిపోనున్నాయి. వడ్డీ వ్యాపారం నిజమే.. బ్యాంకులు, ఏజెన్సీలు కూలీల వేతనాలు చెల్లించకుండా ఖాతాల్లోనే నిల్వ చేశారుు. కూలీలకు వేతనాలు అందకపోవడంపై విచారణ చేశాం. కూలీల వేతనాలతో ఏజెన్సీలు వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నట్లు గుర్తించాం. ముందుగా 28 మండలాల్లో ఏపీజీవీబీ ఖాతాల రద్దుతోపాటు బ్యాంకులకు నోటీసులు జారీ చేశాం. ఆ సంస్థ పరిధిలోని ఉపాధి కూలీలకు పోస్టాఫీసుల నుంచి వేతనాలు ఇస్తాం. యాక్సిస్ బ్యాంక్ ఖాతాలను కూడా వచ్చే నెల నుంచి రద్దు చేయనున్నట్లు లేఖ పంపించాం. - వాసం వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ -
ఉపాధికి ఊతమేది
ఏలూరు : జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పడకేసింది. గ్రామీణ నిరుపేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం కింద చెప్పుకోదగిన స్థాయిలో పనులు చేపట్టడం లేదు. ఏటా ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చుచేసే అవకాశం ఉన్నా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల నైరాశ్యం కారణంగా తూతూమంత్రంగా పనులు జరుగుతున్నారుు. కూలీలకు ఏటా కనీసం 100 రోజులపాటు పనులు కల్పించలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా పథకం లక్ష్యం నెరవేరకపోగా, గ్రామీణ కూలీలకు ఉపాధి అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. ఏటా కొత్త పనులు జాబితాలోకి వచ్చి చేరుతున్నా చేపట్టలేని దుస్థితిలో యంత్రాంగం కొట్టుమిట్టాడుతోంది. ప్రతిపాదనలు ఘనం.. ఫలితం శూన్యం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 16 రకాల పనులను ప్రతిపాదించాలని డ్వామాకు ఆదేశాలు అందా యి. అధికారులు పనులకు సంబంధించి కార్యాచర ణ ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో 5,218 పనులను కొత్తగా ప్రతిపాదించారు. వీటిని చేపట్టడం ద్వారా రూ.450 కోట్లను వెచ్చించాలని నిర్ణయించారు. ఏటా భారీస్థారుులో లక్ష్యాలు నిర్ధేశిస్తున్నా ఆశించిన స్థారుులో పనులు జరగటం లేదు. ఈ ఏడాదైనా లక్ష్యాన్ని సాధిస్తారా అన్నది అనుమానంగానే ఉంది. వ్యవసాయ పనుల అనుసంధానం వ్యవసాయ పనులను సైతం ఉపాధి హామీ పథకంలో చేపడతామని ప్రభుత్వం చెబుతోంది. అందుకు ప్రణాళికలు సైతం సిద్ధమయ్యూయి. గ్రామాల్లో ఉమ్మడి భూముల్లోని పొదలు, ముళ్లకంపలు, భూమి చదు ను, చేపలు, రొయ్యల చెరువుల్లో పూడి క తొలగింపు, కంపోస్టు పిట్ల తవ్వ కం, డ్రెయిన్లు, కాలువలు, ప్రాజెక్టుల్లో గుర్రపుడెక్క తొలగింపు పనులను ఉపాధి హామీ పథకంలో చేపట్టే వీలు కలిగింది. వీటితోపాటు మంచి నీటి, రజక, దూడల చెరువుల్లో పూడిక తొలగింపు, రోడ్లకు అడ్డంగా ఉండే పొదల తొలగింపు, నేలనూతల బాగుసేత, కొబ్బరిచెట్ల పెంపకం, గండ్లు పడిన చెరువుల మరమ్మతులు, చిన్న-సన్నకారు రైతుల భూముల అభివృద్ధి, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఉద్యాన క్షేత్రాల అభివృద్ది, గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు(ఆర్సీపీ) వంటి పనులు చేపట్టే అవకాశం దక్కింది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఏమేరకు లక్ష్యాలను సాధిస్తారనేది వేచి చూడాల్సిందే. 884 గ్రామాలు.. 5.95 లక్షల జాబ్‌కార్డులు ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని 884 గ్రామాల్లోనూ ఏదో ఒక పని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నా యి. మొత్తం 2,172 నివాసిత ప్రాంతాల్లో డ్వామా ఆధ్వర్యంలో 5.94 లక్షల మందికి జాబ్‌కార్డులు ఇచ్చారు. అరుుతే, వీరిలో 2లక్షల మందికి కూడా పని కల్పించే పరిస్థితి కానరావడం లేదు. వారికైనా పది రోజులు కూడా పనులు కల్పించలేకపోతున్నారు.