కూలి రాక.. ఉపాధి లేక!
జిల్లాలో కూలీలకు అందని డబ్బులు
వేసవిలో పనుల్లేక పస్తులు
సర్వర్ బిజీతో ఆపరేటర్ల ఇబ్బందులు
లక్ష్యానికి సవాలుగా మారిన చెల్లింపులు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కరువుకాలంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులు ముందుకుసాగడం లేదు. కూలిల చెల్లింపులు ఆలస్యమవడంతో ‘లక్ష్య సాధన’ కు అడుగుపడడం లేదు. దీంతో సకాలంలో కూలిడబ్బులు అందక పేదకుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. జిల్లాలో 9,12,220 కుటుంబాలకు ఉపాధి జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 10,39,162 మంది కూలీలు 53,658 శ్రమశక్తి సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలో 1.47లక్షలమంది కూలీలు పనులు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా కూలీలకు 16.88 శాతం అంటే 28.18లక్షల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. నెలరోజులుగా కూలీ డబ్బులు అందకపోవడం, ఎండల తీవ్రతతో భూమి గట్టిపడి కూలిరేట్లు గిట్టుబాటుకాకపోవడం వంటి సమస్యలతో ఉపాధి పనులు ముందుకు సాగడం లేదు. దీంతో మాగనూర్, మల్దకల్, ఇటిక్యాల, ధరూర్, దౌల్తాబాద్, గట్టు, అయిజ మండలాలు పనుల నిర్వహణలో 50శాతం లక్ష్యం కూడా చేరుకోలేదు. వారం రోజుల్లో డబ్బులు చెల్లించేందుకు పే ఆర్డర్లు తయారుచేసి చెల్లింపు సంస్థలకు పంపించాలనే నిబంధన ఉంది.
ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉండడంతో సాఫ్ట్‌వేర్ పనిచేయడం లేదు. సర్వర్‌బిజీతో కంప్యూటర్ ఆపరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. వారం పదిరోజులైనా ఆన్‌లైన్‌లో పేఆర్డర్‌లు తయారు కావడం లేదు. ఉన్నతాధికారులు కారణాలను అన్వేషించకుండా కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు.
ఆసక్తిచూపని కూలీలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిస్తోంది.. ఇంకా సగం చెల్లింపులు అందలేదు. కూలి డబ్బులను నెలకోమారు, మూడు వారాలకు ఒకమారు ఇసుతండడంతో పనులపై కూలీలు ఆసక్తిచూపడం లేదు. జిల్లాలో ఉపాధి కూలీలకు రూ.7.55కోట్లు చెల్లించాల్సి ఉంది. 1,97,603 మంది కూలీలు చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారు. మండలాల్లో కూలీలు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కడం లేదు. ఈ ఏడాది ఏర్పడిన వర్షాభావం కారణంగా వ్యవసాయరంగం పూర్తిగా దెబ్బతినడంతో రైతులు, రైతు కూలీలు ఉపాధి హామీ పథకం వైపు ఆశగా చూస్తున్నారు. పనులకు డిమాండ్ బాగానే ఉన్నా నిర్వహణలో లోపాల కారణంగా వెనకడుగు వేస్తున్నారు.
ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించి కూలీ కుటుంబాలకు కల్పిస్తున్న 100రోజుల పనిదినాలను 150కు పెంచింది. ఫిబ్రవరి నుంచి దినసరి కూలిరేటును రూ.161 నుంచి రూ.189కు ప్రభుత్వం పెంచింది. ఫిబ్రవరి నెలకు 20 శాతం, మార్చికు 25 శాతం పారితోషికాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. పారితోషికాలు, కూలిరేట్లు, పనిదినాల పెంపుపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఉపాధి పనుల్లో కూలీలు అధికసంఖ్యలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.