రేషన్..ఆన్‌లైన్ | Online information system to ration the distribution of goods | Sakshi
Sakshi News home page

రేషన్..ఆన్‌లైన్

Published Fri, Jul 24 2015 12:23 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

రేషన్..ఆన్‌లైన్ - Sakshi

రేషన్..ఆన్‌లైన్

- జిల్లాలో రేషన్ దుకాణాలు: 1,852
- గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవి: 1,164
- జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి : 688
సాక్షి, రంగారెడ్డి జిల్లా:
ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు సర్కారు మరో అడుగు ముందుకేసింది. ఇటీవల మండలస్థాయిలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. తాజాగా రేషన్ డీలర్లకు నెలవారీ సరుకుల పంపిణీకి సంబంధించి సమాచారాన్ని ఆన్‌లైన్ పద్ధతితో అనుసంధానం చేసింది. గతంలో నిర్దేశిత కోటాకు సంబంధించి డీలర్లు బ్యాంకు చలానా ఇచ్చి మండలస్థాయి స్టాక్ పాయింట్ల నుంచి సరుకులు పొందేవారు.

ఈ వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన పౌరసరఫరాల శాఖ.. చలానా పద్ధతికి చెల్లుచీటీ పలికింది. కొత్తగా మీ సేవ కేంద్రాల ద్వారా కోటా విడుదల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం జిల్లాలో 1,852 రేషన్ దుకాణాలున్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 1,164, జీహెచ్‌ఎంసీ పరిధిలో 688 దుకాణాలు కొనసాగుతున్నాయి.
 
మీ సేవ కేంద్రాల్లో చెల్లింపులు..
చలానా పద్ధతికి స్వస్తి పలికిన పౌరసరఫరాల శాఖ.. ఇకపై మీ సేవ కేంద్రాల్లో డబ్బులు చెల్లించి రసీదు పొందిన డీలర్లకు మాత్రమే సరుకులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకుగాను మీ సేవ కేంద్రాలకు ఆన్‌లైన్‌లో లింకు కలిపింది. కోటాకు సంబంధించి డబ్బులు మీసేవ కేంద్రాల్లో చెల్లిస్తే.. ఆ మేరకు మీ సేవ నిర్వాహకుడు రసీదు ఇస్తాడు. చెల్లింపు సమాచారాన్ని స్థానిక తహసీల్దారుకు ‘ఈ మెయిల్’ ద్వారా చేరవేస్తాడు.
 
దశలవారీగా పరిశీలన..
మీ సేవ కేంద్రం నుంచి ‘ఈ మెయిల్’ అందుకున్న తహసీల్దారు... కోటాకు సంబంధించిన వివరాలను పరిశీలించిన అనంతరం నిర్ధారించుకుని కోటా మంజూరుకు అంగీకారం తెలుపుతారు. అనంతరం ఆ సమాచారాన్ని ఆన్‌లైన్లో మండలస్థాయి స్టాక్ పాయింట్‌కు చేరవేస్తారు. అలా కోటా సమాచారాన్ని నిర్ధారించుకున్న ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జి ఆ మేరకు స్టాకును తరలిస్తారు. సరుకులు తీసుకున్న డీలర్.. తిరిగి నెల పూర్తయిన తర్వాత కార్డుదారులకు పంపిణీ.. మిగులు స్టాకు వివరాలు ఆన్‌లైన్లో నిక్షిప్తం చేస్తారు.

దీంతో తదుపరి నెలలో గత మిగులును పరిగణిస్తూ తక్కిన కోటాను విడుదల చేస్తారు. ఇలా దశలవారీగా పర్యవేక్షణ నిర్వహించడంతో సరుకుల పంపిణీలో మరింత పారదర్శకత ఉంటుందని పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తెస్తున్నామని, ఆగస్ట్ నెలకు సంబంధించి మీ సేవ కేంద్రాల నుంచి రసీదులు సమర్పిస్తే చాలని జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement