ఎక్కడి నుంచైనా ‘అంతంతే’!
► ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల'కు స్పందన కరువు
► ప్రచారం కల్పించని అధికారులు
► యథేచ్ఛగా సాగుతున్న అక్రమాలు
అనంతపురం టౌన్: ‘ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ల' చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించినప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్పందన లేదు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు విఫలమయ్యారు. దీనివల్ల ప్రజలు పెద్దగా ముందుకు రావడం లేదు. గతంలో జిల్లా పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉండేది. ఈ విధానాన్ని ఉమ్మడి రాష్ట్రంలో 2013 జులై నుంచి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా అంటే ఏ జిల్లాలోనైనా రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటును గత ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రవేశపెట్టింది. తర్వాత కొన్ని సమస్యలు రావడంతో ఈ విధానాన్ని కొన్నాళ్ల పాటు నిలుపుదల చేసింది. గత ఏడాది ఆగస్టు 10 నుంచి మళ్లీ అమల్లోకి తెచ్చింది.
ఎనీవేర్‌తో అక్రమాలకు చెక్
ప్రస్తుతం రిజిస్ట్రేషన్లకు కొంత మంది అనధికార డాక్యుమెంట్ రైటర్లు, సిబ్బంది ఎక్కువ మొత్తం డిమాండ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రజలు వారికి నచ్చిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేయడానికి వచ్చిన డాక్యుమెంట్‌ను సదరు సబ్ రిజిస్ట్రార్ స్కాన్ చేసి అక్కడికి పంపిస్తారు. అక్కడి సబ్ రిజిస్ట్రార్ ఆ ఆస్తికి సంబంధించి ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలు సేకరించి అన్నీ సక్రమంగా ఉంటే దాన్ని ఆమోదిస్తున్నట్లు సమాచారమిస్తారు. ఈ సమాచారం 48 గంటల వ్యవధిలో ఇవ్వాల్సి ఉంటుంది.
ఆ విధంగా ఇవ్వకుంటే సదరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ రిజిస్ట్రేషన్లు నిలిచిపోతాయి. ఒకవేళ తిరస్కరిస్తే ఏ కారణంతో అన్నది తెలియజేయాల్సి ఉంటుంది. తదుపరి జిల్లా రిజిస్ట్రార్‌ను సంబంధిత వ్యక్తులు సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడా నిరాకరిస్తే కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ విధానంపై అవగాహన లేక ఎక్కువ మంది ప్రజలు స్థానికంగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో అధికారులు, డాక్యుమెంట్ రైటర్లు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫీజు టు ఫీజు వసూలు చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు.
అవగాహన కల్పించని అధికారులు
జిల్లాలో 2015 ఫిబ్రవరి నుంచి 2016 జనవరి వరకు 1,12,525 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో ‘ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు’ అయినవి 2,372 మాత్రమే. వీటిలో కూడా ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టే అధికారులు ప్రజలకు ఏ మేరకు అవగాహన కల్పించారో అర్థమవుతోంది.