ముందు జోరు.. ఆపై బేజారు..! | Frist interst.. after laze | Sakshi
Sakshi News home page

ముందు జోరు.. ఆపై బేజారు..!

Published Fri, Aug 28 2015 4:24 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

ముందు జోరు.. ఆపై బేజారు..!

ముందు జోరు.. ఆపై బేజారు..!

- మారుమూల గ్రామాలు గాలికి..
- చాలాచోట్ల మొక్కుబడిగా సాగిన కార్యక్రమం
- ఎంపీపీ, ఎంపీటీసీలు కార్యక్రమానికి దూరం
- గ్రామాభివృద్ధి ప్రణాళికలు ఆన్‌లైన్‌లో..  
- జిల్లాలో ముగిసిన ‘గ్రామజ్యోతి’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా సర్కారు చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం ముగిసింది. ఈనెల 17న అట్టహాసంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం చివరి వరకు ఆ జోరు కొనసాగలేదు. ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు వెళ్లిన, దత్తత తీసుకున్న గ్రామాల్లో మినహా, మిగిలిన దాదాపు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని మమ అనిపించారు. గ్రామజ్యోతిలో భాగంగా గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సర్కారు నిర్దేశించింది. గతేడాది నిర్వహించిన ‘మన ఊరు.. మన ప్రణాళిక’లో పొందుపరిచిన పనులకు పెద్ద మోక్షం కలిగిన దాఖలాల్లేవు.

అయినప్పటికీ.. గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన జోరుగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 866 గ్రామపంచాయతీల్లో ఈ ప్రణాళికలు తయారు చేశారు. వీటిని ప్రత్యేక వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇప్పటి వరకు 15 గ్రామాల ప్రణాళికలను అప్‌లోడ్ చేశారు. మన ఊరు.. మన ప్రణాళికలో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో కలిపి 2,736 కోట్ల అంచనా వ్యయంతో 8,912 పనులు ప్రతిపాదించారు. ఏడాది కాలంగా ఈ ప్రణాళిక పనులు పెద్దగా కార్యరూపం దాల్చలేదు.
 
దూరంగా ఎంపీటీసీలు..

‘గ్రామజ్యోతి’లో తమకు ఏమాత్రం ప్రాధాన్యత కల్పించలేదంటూ ఎంపీటీసీలు, ఎంపీపీలు చాలా మట్టుకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాలేదు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు నుంచే నిరసన గళం వినిపించారు. జిల్లా కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సులో ఎంపీపీలందరూ బహిష్కరించి బయట బైఠాయించారు. జిల్లా మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి సముదాయించినా.. వారు తమ నిరసనను విరమించుకోలేదు. గ్రామసభలకు కూడా దూరంగా ఉన్నారు. కుంటాలలో మండల సమావేశాన్ని సైతం బహిష్కరించారు. గ్రామాల్లో అన్ని వర్గాలను భాగస్వామలుగా చేసేందుకు ప్రభుత్వం ఏడు కమిటీలను నియమించాలని నిర్ణయించినా.. ఈ కమిటీ సభ్యుల భాగస్వామ్యం అంతంత మాత్రంగానే సాగింది. గ్రామపంచాయతీల సిబ్బంది మాత్రం డ్రెయినేజీల్లో పూడికతీత, తాగునీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ వంటి పనులు చేపట్టారు.
 
దగ్గర గ్రామాలే దత్తత..
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధికి బాటలు వేయడం ద్వారా మిగిలిన గ్రామాలకు మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలని నిర్దేశించారు. ఇందులో భాగంగా జిల్లాలో 866 గ్రామపంచాయతీలకు గాను 338 గ్రామాలను ఎంపిక చేశారు. అయితే జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా ఉన్నతాధికారులు సైతం సమీప పట్టణాలకు, తాముండే ప్రాంతానికి అత్యంత సమీప గ్రామపంచాయతీలను దత్తత గ్రామాలుగా ఎంపిక చేసుకున్నారు. జిల్లాలో అనేక సమస్యలతో సహజీవనం చేస్తున్న మారుమూల గ్రామాలను విస్మరించారనే తీవ్ర విమర్శలు వచ్చాయి. మొదట్లో ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున దత్తత తీసుకోగా, తర్వాత మండలానికి ఒక గ్రామాన్ని దత్తత గ్రామాలుగా ఎంపిక చేశారు. గ్రామజ్యోతి కార్యక్రమం ముగిసినప్పటికీ, ఎవరెవరు.. ఏయే గ్రామాలను దత్తత తీసుకున్నారో వివరాలను అధికారులు వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement