Gramajyoti program
-
స్వచ్ఛ పల్లెలుగా తీర్చిదిద్దుదాం
► గ్రామజ్యోతి స్ఫూర్తితో బంగారు తెలంగాణ ► బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా బక్కలింగాయపల్లి ► నల్లమలలో కలెక్టర్ శ్రీదేవి విస్తృత పర్యటన ► పుష్కరఘాట్ల పనుల పరిశీలన అచ్చంపేట రూరల్: మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు నిర్మించుకొని స్వచ్ఛపల్లెలుగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. బుధవారం అచ్చంపేట మండలం ఏజెన్సీ గ్రామమైన బక్కలింగాయపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామానికి చెందిన ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నవీన్ చొరవతో గ్రామంలో 100శాతం మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలను నిర్మించుకోవడం అభినందించ విషయమన్నారు. మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలో బక్కలింగాయపల్లిని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా ప్రకటించారు. ఆలోచన చేయకనే వెనకబాటుతనానికి గురవుతున్నామని, నవీన్‌లా ఆలోచించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. విద్యతో వెనకబాటుతనాన్ని దూరం చేయవచ్చన్నారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టారని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. జిల్లాలో ఇప్పటికే 53గ్రామాలను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించామని చెప్పారు. ఇంకా 1500 గ్రామాలను టార్గెట్‌గా పెట్టుకున్నామని తెలిపారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి: గువ్వల అంతకుముందు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ నవీన్‌లా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలన్నారు. నవీన్‌ను ఆదర్శంగా తీసుకుని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసుకోవాలన్నారు. అచ్చంపేటను టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. పుష్కరఘాట్ల వద్ద గ్రామానికి చెందిన యువకులు వలంటీర్లుగా స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మధుసూదన్‌నాయక్, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ పద్మనాభరావు, డీఈఓ విజయలక్ష్మి, సీఈఓ లక్ష్మినారాయణ, ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి, డీపీఓ వెంకటేశ్వర్లు, ఎంపీపీ పర్వతాలు, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, ఎస్పీహెచ్ఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీఓ సుధాకర్, ఎంఈఓ గోవర్ధన్‌రెడ్డి, సీడీపీఓ దమయంతి, గ్రామ సర్పంచు కమల, టీఆర్ఎస్ నాయకులు మనోహర్, నర్సింహగౌడ్, సీఎంరెడ్డి, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. . పుష్కరఘాట్ పనులను పరిశీలన మండల పరిధిలోని బక్కలింగాయపల్లి సమీపంలో జరుగుతున్న పుష్కరఘాట్ పనులను కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎమ్మెల్యే బాలరాజు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా పనులు చేపట్టాలని కోరారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వతాలు, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ సేవ్యానాయక్, సర్పంచు కమల, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. పుస్తకాలను అమ్ముకుంటే చర్యలు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను వారికే పంపిణీ చేయాలని, ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలు అమ్ముకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ టీకే శ్రీదేవి హెచ్చరించారు. బుధవారం బక్కలింగాయపల్లిలోని ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. పక్క స్కూల్ నుంచి విద్యార్థులను తీసుకరావాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని, సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. 14 సంవత్సరాల లోపు పిల్లల వివరాలు చెప్పాలని డీఈఓ, ఎంఈఓలను అడిగారు. సరైన సమాధానం రాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో పద్యాలు చదివించారు. -
‘గ్రామజ్యోతి’ పరుగులు..
‘గ్రామజ్యోతి’ పట్టాలెక్కనుంది. నిధుల కేటాయింపులు జరగడంతో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. అభివృద్ధి కోసం ఏర్పాటైన కమిటీలకు అవగాహన కల్పించనున్నారు. గ్రామ సభల్లో తీర్మానించిన పనులు చేపట్టేందుకు అడుగులు వేస్తున్నారు. పారదర్శకంగా పనులు సాగేలా చర్యలు చేపడుతున్నారు. ఇదే వేగాన్ని ప్రదర్శిస్తే పల్లెలు ప్రగతి బాట పట్టినట్టే... - నల్లగొండ రెండు రోజుల క్రితం జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. గ్రామజ్యోతిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలంటే ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ శిక్షణ తరగతులు జిల్లా స్థాయిలో నిర్వహిస్తారు. గ్రామజ్యోతిలో భాగంగా ప్రధానంగా ఏడు అంశాలకు సంబంధించి కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ ఏడు కమిటీలకుగాను 14,865 లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఒక్కో కమిటీ ఎంచుకున్న లక్ష్యాల ను ఏ విధంగా అమలు చేయాలి..? ఎలా ముందుకు వెళ్లాలి..? అనే దానిపై సంబంధిత శాఖల అధికారులతో అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు.. విద్యా కమిటీ అయితే ఆ గ్రామంలో వందశాతం విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలి. పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, బడి బయటి పిల్లలను బడిలో చేర్పించడం వంటి కార్యక్రమాలను ఏ విధంగా చేస్తే వందశాతం లక్ష్యాలను సాధిస్తామనే దానిపై డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓలతో అవగాహన కల్పిస్తారు. అక్షరాస్యులైన వారే విద్యాకమిటీ చైర్మన్లు ఉండాలని నిర్ణయించారు. ఈ విషయంలో విద్యావంతులే ఉండాలని మార్పు చేశారు. అభివృద్ధి పనులకు నిధులు.... 14వ ఆర్థిక సంఘం కింద పంచాయతీలకు రూ.36.19 కోట్లు మంజూరయ్యాయి. జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి పంచాయతీల ఖాతాలకు రెండు రోజుల్లో సర్దుబాటు చేయనున్నారు. ఈ నిధుల వాడకానికి సం బంధించి గతంలో మాదిరి బోర్ల మరమ్మతులు, కంటికి కనిపించని పనులు చేయడానికి వీల్లేదు. ఇప్పటివరకు వచ్చిన నిధుల్లో సర్పంచ్‌లు చాలావరకు దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. గ్రామజ్యోతిలో భాగంగా గ్రామసభల్లో తీర్మానం చేసిన వివిధ రకాల అభివృద్ధి పనులకే ఈ నిధులు వినియోగించాలి. గ్రామసేవ కేంద్రాల ఏర్పాటు... మీ సేవ కేంద్రాల తరహాలో గ్రామాల్లో అన్ని రకాల సేవలను ప్రజలకు అందుబాటులో తె చ్చేందుకు వీలుగా పల్లె సమగ్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది తొలి విడత 75 పంచాయతీల్లో పల్లె సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచాయతీ భవనాలు, కంప్యూటర్లు, బీఎస్ఎన్ఎల్ బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ కలిగిన గ్రామాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. వచ్చే ఏడాది రెండో విడత కింద మరిన్ని గ్రామాల్లో వీటిని విస్తరిస్తారు. ఈ కేంద్రాల ద్వారా ముందుగా పంచాయతీల పన్ను వసూలు, ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లింపు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు వంటి సేవలందిస్తారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2నుంచి పల్లె సమగ్ర సేవా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామజ్యోతి కమిటీల వివరాలు, నిర్దేశించిన లక్ష్యాలు జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలు 1,176 గ్రామజ్యోతి కమిటీలు 8,190 నిర్దేశించిన లక్ష్యాల సంఖ్య 14,865 గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా.. ‘గ్రామజ్యోతి’లో తీర్మానం చేసిన అభివృద్ధి పనులు అమలు చేసేందుకు కమిటీలకు శిక్షణ త రగతులు నిర్వహించాలని నిర్ణయించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామసభల్లో తీర్మా నం చేసిన పనులకే వెచ్చించాలి. దుర్వినియోగం చేయడానికి వీళ్లేదు. ఈ నిధుల వినియోగంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. - పి.ప్రభాకర్ రెడ్డి, డీపీఓ -
మంత్రి హరీశ్‌రావు నెక్కొండ ‘శ్రీమంతుడు’
నెక్కొండ : గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగం గా వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ప్రకటిం చా రు. ఎంపీపీ గటిక అజయ్‌కుమార్ విజ్ఞప్తి మేర కు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. నెక్కొండ బ్రిడ్జి పనుల వేగవంతానికి, వట్టె వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి చెప్పారు. సంగెం మండలం ఎలుగూరు వాగుపై లిఫ్ట్ ఇరిగేషన్ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టాలని రైతులు కోరగా నివేదికలు రూపొం దించాలని అధికారులను ఆదేశించారు. -
ముందు జోరు.. ఆపై బేజారు..!
- మారుమూల గ్రామాలు గాలికి.. - చాలాచోట్ల మొక్కుబడిగా సాగిన కార్యక్రమం - ఎంపీపీ, ఎంపీటీసీలు కార్యక్రమానికి దూరం - గ్రామాభివృద్ధి ప్రణాళికలు ఆన్లైన్లో.. - జిల్లాలో ముగిసిన ‘గ్రామజ్యోతి’ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా సర్కారు చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం ముగిసింది. ఈనెల 17న అట్టహాసంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం చివరి వరకు ఆ జోరు కొనసాగలేదు. ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు వెళ్లిన, దత్తత తీసుకున్న గ్రామాల్లో మినహా, మిగిలిన దాదాపు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని మమ అనిపించారు. గ్రామజ్యోతిలో భాగంగా గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సర్కారు నిర్దేశించింది. గతేడాది నిర్వహించిన ‘మన ఊరు.. మన ప్రణాళిక’లో పొందుపరిచిన పనులకు పెద్ద మోక్షం కలిగిన దాఖలాల్లేవు. అయినప్పటికీ.. గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన జోరుగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 866 గ్రామపంచాయతీల్లో ఈ ప్రణాళికలు తయారు చేశారు. వీటిని ప్రత్యేక వెబ్సైట్లో పొందుపరచాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇప్పటి వరకు 15 గ్రామాల ప్రణాళికలను అప్లోడ్ చేశారు. మన ఊరు.. మన ప్రణాళికలో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో కలిపి 2,736 కోట్ల అంచనా వ్యయంతో 8,912 పనులు ప్రతిపాదించారు. ఏడాది కాలంగా ఈ ప్రణాళిక పనులు పెద్దగా కార్యరూపం దాల్చలేదు. దూరంగా ఎంపీటీసీలు.. ‘గ్రామజ్యోతి’లో తమకు ఏమాత్రం ప్రాధాన్యత కల్పించలేదంటూ ఎంపీటీసీలు, ఎంపీపీలు చాలా మట్టుకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాలేదు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు నుంచే నిరసన గళం వినిపించారు. జిల్లా కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సులో ఎంపీపీలందరూ బహిష్కరించి బయట బైఠాయించారు. జిల్లా మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి సముదాయించినా.. వారు తమ నిరసనను విరమించుకోలేదు. గ్రామసభలకు కూడా దూరంగా ఉన్నారు. కుంటాలలో మండల సమావేశాన్ని సైతం బహిష్కరించారు. గ్రామాల్లో అన్ని వర్గాలను భాగస్వామలుగా చేసేందుకు ప్రభుత్వం ఏడు కమిటీలను నియమించాలని నిర్ణయించినా.. ఈ కమిటీ సభ్యుల భాగస్వామ్యం అంతంత మాత్రంగానే సాగింది. గ్రామపంచాయతీల సిబ్బంది మాత్రం డ్రెయినేజీల్లో పూడికతీత, తాగునీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ వంటి పనులు చేపట్టారు. దగ్గర గ్రామాలే దత్తత.. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధికి బాటలు వేయడం ద్వారా మిగిలిన గ్రామాలకు మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలని నిర్దేశించారు. ఇందులో భాగంగా జిల్లాలో 866 గ్రామపంచాయతీలకు గాను 338 గ్రామాలను ఎంపిక చేశారు. అయితే జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా ఉన్నతాధికారులు సైతం సమీప పట్టణాలకు, తాముండే ప్రాంతానికి అత్యంత సమీప గ్రామపంచాయతీలను దత్తత గ్రామాలుగా ఎంపిక చేసుకున్నారు. జిల్లాలో అనేక సమస్యలతో సహజీవనం చేస్తున్న మారుమూల గ్రామాలను విస్మరించారనే తీవ్ర విమర్శలు వచ్చాయి. మొదట్లో ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున దత్తత తీసుకోగా, తర్వాత మండలానికి ఒక గ్రామాన్ని దత్తత గ్రామాలుగా ఎంపిక చేశారు. గ్రామజ్యోతి కార్యక్రమం ముగిసినప్పటికీ, ఎవరెవరు.. ఏయే గ్రామాలను దత్తత తీసుకున్నారో వివరాలను అధికారులు వెల్లడించలేదు. -
‘అనుబంధం’లో ‘జ్యోతి’ లేదు!
తండాల వైపు దృష్టి సారించని యంత్రాంగం కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన సమస్యలు కమిటీల్లో పేర్ల వరకే పరిమితమైన అధికారులు అభివృద్ధి పనులు ఇంకెప్పుడని ప్రశ్నిస్తున్న ప్రజలు తాండూరు రూరల్ : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గ్రామజ్యోతి’ కార్యక్రమం అనుబంధ గ్రామాల్లో కొనసాగడంలేదు. ఎన్నాళ్లుగా తిష్టవేసిన సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని ఆశపడిన ప్రజలు నిరాశ కు గురవుతున్నారు. కమిటీల్లో పలువురి పేర్లను నామమాత్రంగా చేర్చిన నోడల్ అధికారులు ఆ పిదప పట్టించుకోవడంలేదంటున్నారు. గ్రామాలపై వివక్ష కనబరుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వారంరోజులవుతున్నా ఇటువైపు చూసిన నాథుడే కరువయ్యాడని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాండూరు మండలంలోని 25 గ్రామ పంచాయతీల పరిధిలో గోపన్‌పల్లి, చిట్టిఘనాపూర్, గుంతబాసుపల్లి, చింతమణిపట్నం, బోంకూర్, రాంపూర్, రాంపూర్చిన్నతండా, పెద్దతంవీర్శెట్టిపల్లి, సంకిరెడ్డిపల్లి, గుండ్లమడుగుతండా, జినుగుర్తితండా, ఉద్దాండపూర్ తండాలు అనుబంధ గ్రామాలున్నాయి. ఈ నెల 17న ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి వారం రోజులవుతున్నా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కాల్వల్లో మురుగు ఎక్కడికక్కడే పేరుకుపోయింది. తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయడంలేదు. పైపులైన్ల లీకేజీలతో పాటు పలు సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. అయితే.. నోడల్ అధికారులు మాత్రం అనుబంధ గ్రామాల నుంచి వార్డు సభ్యులను, మరికొందరిని గ్రామకమిటీలో చేర్చుకున్నారు. అధికారులు కమిటీలలో పేర్లు చేర్చుకోవడం వరకే పరిమితమయ్యారు. తమ గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కోరినా స్పందించడంలేదని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అనుబంధ గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక అధికారుల్ని ఆదేశించాం గ్రామజ్యోతి పథకం కింద ముందుగా పంచాయతీలకు ప్రాధాన్యమిస్తున్నాం. అనుబంధ గ్రామాల్లోని వార్డు సభ్యులు, యువకులు కమిటీలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని అనుబంధ గ్రామాల్లో పనులు చేశాం. గ్రామజ్యోతి పథకం ద్వారా వచ్చిన నిధులు కూడా అనుబంధ గ్రామాలకు కేటాయించాం. ఆయా గ్రామాల్లో గ్రామజ్యోతి పనులు చేపట్టాలని స్థానిక అధికారులకు ఆదే శాలిచ్చాం. - జయరాజ్, గ్రామజ్యోతి మండల చేంజ్ అధికారి -
భేష్
గజ్వేల్/జగదేవ్‌పూర్ : ‘నేను నిన్న ఒక్క మాట చెప్పాను. అందరూ ముందుకొచ్చారు. ఎక్కడెక్కడో స్థిరపడిన గ్రామానికి చెందిన వారు కూడా స్పందించి ఊరి అభివృద్ధికి భూములు, పైసలు ఇస్తామంటున్నారు. ఇటువంటి ఐక్యతే కావాలి. నేను కోరుకున్నది ఇదే..’ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఎర్రవల్లి గ్రామస్తులను ప్రశంసించారు. రెండో రోజు శుక్రవారం కూడా ఆయన జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలో గ్రామజ్యోతిలో భాగంగా నిర్వహించిన శ్రమదానం పనుల్లో పాల్గొన్నారు. పనులను తాను స్వయంగా పర్యవేక్షిస్తూ, సలహా సూచనలు ఇస్తూ సందడి సృష్టించారు. ‘ఇంతటితో ఆగేది లేదు. ఇంకా ముందుకు వెళ్దాం...’ అంటూ ఉత్సాహపరిచారు. గ్రామంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో శ్రమదానం పనుల్ని సీఎం ప్రారంభించారు. సాయంత్రం వరకు పనులు కొనసాగగా స్వయంగా పర్యవేక్షించారు. సాయంత్రం జరిగిన సభలో మాట్లాడుతూ గ్రామస్తుల స్పందనపై హర్షం వ్యక్తం చేశారు. గంగదేవిపల్లిని మించిపోవాలి.. ఐదారు నెలల్లో ఎర్రవల్లి స్వరూపాన్నే మార్చేద్దామని కేసీఆర్ అన్నారు. ‘ముందుగా సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్ర మం అనుకున్నాం. అది మొదలుపెట్టి విజయం సాధిం చాం. మునుముందూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ గ్రామాన్నంతటినీ పరిశుభ్రంగా తీర్చిదిద్దుకుందాం’ అని ఆయన పిలుపునిచ్చారు. తన సొంత డబ్బులతో ఇంటిం టికీ ప్లాస్టిక్ డబ్బాలను పంపిస్తానని, వాటితో చెత్తను సేకరించాలని, వాటిలో తడి-పొడి చెత్తలను వేర్వేరుగా వేయాలని గ్రామస్తులకు సూచించారు. అంకాపూర్, గంగదేవిపల్లి గ్రామాలను ఎర్రవల్లి మించిపోవాలన్నారు. ఎర్రవ ల్లి అభివృద్ధిని చూసేందుకు అందరూ ఇక్కడికి రావాల న్నారు. గ్రామంలో పాడుబడ్డ ఇళ్లన్నిటినీ కూల్చేద్దామని, నివాసయోగ్యంగా లేని ఇళ్లనూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తే కూల్చేద్దామని సీఎం అన్నారు. ఈ క్రమం లో ఎవరికీ నష్టం జరగకుండా చూస్తామన్నారు. త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. ఐదారు నెలల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి అప్పగిస్తామని కేసీఆర్ గ్రామస్తుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రభుత్వం తరపున ప్రతి ఇంటికీ ఉచితంగా నల్లా కనెక్షన్ బిగిస్తామని చెప్పారు. ‘ఇవన్నీ అయినంక.. మల్లొక్కసారి మంచిగ దావత్ చేసుకుందాం’ అంటూ నవ్వులు పూయించారు. ఊరు స్వరూపం మారడం ఒక్క టే కాదు.. అందరూ మంచిగా బతకాలని, ఒక్కరు ఒక్క పూట కూడా పస్తు ఉండొద్దని కేసీఆర్ అన్నారు. ఇదంతా జరగాలంటే అందరికీ పని కల్పించాలని, ఇందుకోసం ఆలోచన చేస్తున్నామన్నారు. ‘నేను మీకు నిన్ననే జెప్పిన.. కచ్చితంగా ఇది జరిగి తీరతది. గ్రామంలో సంపూర్ణ పారి శుద్ధ్యం సాధించే వరకు శ్రమదానం పనులు ఆపొద్దు. నేను మళ్లీ వస్త. గ్రామాభివృద్ధికి ఎజెండా ఖరారు చేద్దాం’ అన్నారు. ఆ ఎజెండా ప్రకారమే ముందుకు వెళ్దామన్నా రు. ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపునకు హైదరాబాద్, అమెరికాలో ఉంటున్న ఈ గ్రామస్తులు స్పందించి అభివృద్ధిలో తామూ భాగస్వాములమవుతామని ముందుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ రేణుక, జడ్పీటీసీ రాంచంద్రం, గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, ఎంపీటీసీ భాగ్యమ్మ, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూంరెడ్డి, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, ఎర్రవల్లి గ్రామ టీఆర్ఎస్ నాయకులు కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం సహపంక్తి భోజనం జగదేవ్‌పూర్: సీఎం అన్నమాట ప్రకారమే శుక్రవారం గ్రామస్తులతో కలిసి సహంపక్తి భోజనాలు చేశారు. ఉదయం గ్రామంలో పర్యటించిన సీఎం కేసీఆర్ మధ్యాహ్నం గ్రామస్తులతో కలిసి సహంపక్తి భోజనంలో పాల్గొన్నారు. 10 క్వింటాళ్ల బియ్యం, 7 క్వింటాళ్ల చికెన్, 3 క్వింటాళ్ల మటన్, పప్పు కూరగాయల వండారు. 500 మంది భోజనాలు చేశారు. సీఎంతో కలిసి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ భాగ్య, ఎంపీటీసీ భాగ్యమ్మ, కలెక్టర్ రోనాల్డ్‌రాస్ కూడా భోజనం చేశారు. సీఎం తను భోజనం చేసిన తరువాత మిగతా అందరినీ తిన్నారా అని పలకరించారు. వంటలు బాగున్నాయని మెచ్చుకున్నారు. -
అందరూ భాగస్వాములు కావాలి
మంత్రి, కలెక్టర్ పల్లెనిద్ర ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని వాఘాపూర్, ఖండాల, చిచ్‌ధరి ఖానాపూర్‌లో నిర్వహించిన పల్లెనిద్రలో పాల్గొన్నారు. అంకోలి గ్రామ పంచాయతీ పరిధి కొలాంగూడలో కలెక్టర్ జగన్మోహన్ పల్లెనిద్రలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రామన్న మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దీని ద్వారా గ్రామాల్లో కల్పించాల్సిన మౌలిక వసతులపై, ప్రణాళికలు రూపొందించి దశల వారీగా పరిష్కరించనున్నట్లు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. కలెక్టర్ జగన్మోహన్ అంకోలి గ్రామంలో వార్డు వార్డుకు తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడుతూ గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం కానున్నాయని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు మల, మూత్రవిసర్జన బహిరంగా ప్రదేశాల్లో చేయకుండా ప్రతి ఇంట్లో మరుగుదొడ్లను నిర్మించుకోవాలన్నారు. దీని నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.12వేలు అందిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత తప్పని సరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. -
గ్రామజ్యోతిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి
మంత్రి హరీశ్‌రావు పటాన్చెరు : గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన పటాన్చెరు మండలం లక్డారంలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామజ్యోతి కార్యక్రమం విశిష్టతను వివరించారు. కాగా మంత్రి గ్రామ ప్రజలను ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. వేదికపై ఆయన నిలబడి ఉన్నంత సేపు గ్రామ ప్రజలను నవ్వించారు. గ్రామజ్యోతి విశిష్టతను సూటిగా అర్థమయ్యేలా వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన గంగదేవిపల్లి ఎలా ఆదర్శ గ్రామంగా మారిందో ఆ విధంగానే తెలంగాణలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు. పారిశుద్ధ్య సమస్యలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామాభివృద్ధి ప్రణాళికలకు ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. అందుకోసమే ఏడు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. డంప్ యార్డుకు స్థలం కేటాయించండి అన్ని గ్రామాల్లో చెత్త డంపింగ్ యార్డు కోసం స్థలాన్ని వెంటనే కేటాయించాలని తహశీల్దార్లకు మంత్రి సూచించారు. లక్డారంలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలం కేటాయించక పోవడంపై మంత్రి స్థానిక తహశీల్దార్ ఫర్హీన్ షేక్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. గ్రామజ్యోతి ప్రారంభించి మూడు రోజులైనా డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించక పోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. గ్రామంలో అంగన్వాడీ, వైద్యం, ఆరోగ్యం పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రాంలో కలెక్టర్ రొనాల్డ్ రాస్, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎంపీపీ శ్రీశైలం యాదవ్, జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నన్ను ఎవరూ ఆహ్వానించలేదు
- గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ప్రాతినిధ్యమే లేదు - ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండ : ప్రభుత్వ ఆర్భాటంగా ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. 14 తేదీన మంత్రి జగదీశ్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో తాము ఇచ్చిన సలహాలు, సూచనలను ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఆగమేఘాల మీద జీఓలు జారీ చేసి కార్యక్రమాన్ని అమలు చేస్తుందని ఆ రోపించారు. సోమవారం నల్లగొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి సమీక్షలో కేవలం గ్రామాలను దత్తత తీసుకోవాలని చెప్పారే తప్పా నిధులు, విధుల విషయం లో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. ఎంపీ హోదాలో గతంలోనే తాను ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నానని కాబట్టి దాని అభివృద్ధి పైనే దృష్టి సారిస్తానని చెప్పారు. గ్రామజ్యోతి కార్యక్రమానికి తనను ఎవ రూ ఆహ్వానించలేదు కాబట్టి ఎక్కడా తాను పాల్గొనలేదని ఓ ప్రశ్నకు ఎంపీ బదులిచ్చారు. పార్టీలకతీతంగా చేపట్టాల్సిన గ్రామజ్యోతిని అందుకు భిన్నంగా నిర్వహిస్తున్నారన్నారు. గ్రామ కమిటీ ల్లో టీఆర్ఎస్ నాయకులనే సభ్యులుగా నియమిస్తున్నారని చెప్పారు.గ్రామజ్యో తి కార్యక్రమానికి నయాపైసా విడుదల చేయలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టకుండా ప్రభుత్వం కళ్లు తెరిచి వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ పాశం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిరసనల మధ్య ‘గ్రామజ్యోతి’
- ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ప్రాధాన్యత కల్పించలేదని ఆందోళన - స్థానికంగా సర్పంచ్‌లు ఉండటం లేదంటూ ఫిర్యాదులు - ముందస్తు సమాచారం ఇవ్వలేదని గ్రామస్తుల ఆందోళన - చౌటుప్పుల్‌లో రసాభాసాగా మారిన కార్యక్రమం నల్లగొండ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. సోమవారం నుంచి ఈ నెల 27 తేదీ వరకు జరగాల్సిన కార్యక్రమ తొలి రోజునే స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. గ్రామ కమిటీల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు ప్రాధాన్యత కల్పించకపోవడాన్ని నిరసిస్తూ పలుచోట్ల గ్రామజ్యోతి కార్యక్రమాన్ని బహిష్కరించారు. చౌటుప్పుల్‌లో గ్రామజ్యోతి కార్యక్రమం రసాభాసాగా మారింది. స్థానిక ఎమ్మెల్యే కూసుకంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలోనే ఎంపీపీలు, విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను అరెస్టు చేశారు. చిలుకూరు, నడిగూడెం, కోదాడ మండలాలకు చెందిన ఎంపీపీలు, ఎంపీటీసీలు ఏకమై కోదాడ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కార్యక్రమంలో తమను భాగస్వాముల్ని చేయాలని డిమాం డ్ చేస్తూ ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పాశం రాంరెడ్డి ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో ఎంపీటీసీలు ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. మఠంపల్లిలో టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. సూర్యాపేట మం డలం ఇమాంపేట గ్రామంలో సర్పంచ్ అందుబాటులో ఉండడం లేదని గ్రామస్తులు గ్రామ జ్యోతిని బహిష్కరించారు. ఈ మేరకు గ్రామస్తులు తీర్మానం చేసి అధికారులకు అందజేశారు. టేకుమట్లలో గ్రామజ్యోతి గురించి ముందస్తు సమాచారం ఇవ్వలేదని గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగా రు. ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మల పెన్‌పహా డ్ గ్రామ కమిటీలో ఒకే వర్గం వారిని తీసుకోవడం పై వాగ్వాదం జరిగింది. మక్తా కొత్తగూడెంలో గ్రామస్తులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో గ్రా మజ్యోతి వాయిదా పడింది. రాజాపేట మండలం పాముకుంట గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు కార్యక్రమాన్ని బహిష్కరించారు. మిర్యాలగూడ మండలం తుంగపాడులో వార్డుసభ్యులు నిరసన తెలిపారు. -
నేటి నుంచి ‘గ్రామజ్యోతి’
- మెయినాబాద్ మండలం అజీజ్ నగర్లో ప్రారంభం - హాజరుకానున్న మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా : గ్రామాల సమగ్ర అభివృద్ధితో పాటు పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘గ్రామజ్యోతి’ నేడు కార్యరూపం దాల్చనుంది. సోమవారం జిల్లాలోని మెయినాబాద్ మండలం అజీజ్‌నగర్ గ్రామ పంచాయతీలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రజలే ‘ప్రణాళికా’కర్తలు.. గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రజాసమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు సర్కారు సరికొత్త మార్గాన్ని అనుసరిస్తోంది. ఇప్పటివరకు ప్రజాసమస్యలను గుర్తించి పరిష్కారంచేసే పనంతా అధికారులు, ప్రజాప్రతినిధులు చూసుకునేవారు. తాజా కార్యక్రమంలో ఈ బాధ్యత ప్రజలకే అప్పగించింది. పంచాయతీ స్థాయిలో ప్రత్యేకంగా గ్రామసదస్సు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ప్రజలు లేవనెత్తే సమస్యలను పరిగణించి ప్రణాళిక తయారు చేస్తారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో పంచాయతీ స్థాయిలో ప్రధానంగా ఐదు కేటగిరీల్లో కమిటీలు ఏర్పాటు చేస్తారు. పారిశుద్ధ్యం- తాగునీరు, ఆరోగ్యం- పౌష్టికాహారం, విద్య, సామాజిక భద్రత- పేదరిక నిర్మూలన, సహజవనరుల నిర్వహణ, వ్యవసాయ కమిటీలుగా విభజించి గ్రామంలోని అన్ని వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేస్తూ సభ్యులను ఎన్నుకుంటారు. ఒక్కో కమిటీలో ఐదుగురు చొప్పున సభ్యులుంటారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించాల్సి ఉంటుంది. క్లీన్ ‘విలేజ్’ రోజుకు కనిష్టంగా రెండు పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలి. ఇందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను ప్రభుత్వం నియమించింది. ఉదయం 8గంటల కల్లా అధికారుల బృందం గ్రామానికి చేరుకుని దళితవాడలు, తండాలు, అన్ని వార్డులను కాలినడకన పర్యటించిన తర్వాత గ్రామసభ నిర్వహించాలి. గ్రామజ్యోతిలో భాగంగా కేవలం ఒక గ్రామసభ నిర్వహణ కాకుండా.. వరుసగా వారం రోజులపాటు పలు కార్యక్రమాలు చేపడతారు. 17న: గ్రామసభ నిర్వహణ, కమిటీల ఏర్పాటు, ప్రణాళికపై చర్చ 18న: వీధులను శుభ్రం చేయడం, చెత్త, పొదల తొలగింపు, మురుగుకాల్వలను శుభ్రపర్చడం 19న: కమిటీల ప్రత్యేక సమావేశాలు, గ్రామంలో పర్యటన, సమస్యల గుర్తింపు 20న: క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, ప్రణాళిక తయారు 21 నుంచి 29వరకు: ఆయా కమిటీలకు గుర్తించిన సమస్యలు పరిష్కరించడం -
బాధ్యతతో పనిచేద్దాం
అందుబాటులో నిధులున్నా పనులు మాత్రం జరగడం లేదు. కొన్ని పంచాయతీలకు ఆదాయం బాగా ఉన్నా.. వాటి వినియోగం సక్రమంగా లేకపోవడంతో కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో మురుగుతుండగా.. ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. వీటన్నింటినీ అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామజ్యోతి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. - గ్రామజ్యోతి అవగాహన సదస్సులో మంత్రి మహేందర్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా: క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని, ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా బాధ్యతతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా పరిషత్‌లో చైర్పర్సన్ సునీతారెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామజ్యోతి అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. సోమవారం నుంచి వరుసగా పదిరోజుల పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తారన్నారు. అభివృద్ధిపై రాజకీయాలెందుకు..? గ్రామాల అభివృద్ధి విషయంలో రాజకీయాలు వద్దని మంత్రి మహేందర్‌రెడ్డి హితవు పలికారు. ఆదివారం నాటి గ్రామజ్యోతి అవగాహన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు గైర్హాజరయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. అభివృద్ధి కంటే రాజకీయాలే ఆ పార్టీ వారికి ముఖ్యమని, అందువల్లే సమావేశానికి రాలేదని పరోక్షంగా చురకలంటించారు. గ్రామజ్యోతితో పల్లెకు వస్తున్న నిధులు.. వాటి ఖర్చు.. చేపట్టే పనులు.. ఇలా సర్వస్వం ప్రజలకు తెలుస్తుందని, అవకతవకలపైన, ఆలస్యంపైనా అధికారులను నిలదీయవచ్చని అన్నారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. విద్యపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని, బడీడు, బడిబయటి పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. మహిళల్లో అక్ష్యరాస్యత పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా సభ్యులకు గ్రామజ్యోతి మార్గదర్శకాలకు వివరించి అవగాహన కల్పించారు. అనంతరం జెడ్పీటీసీలు అభిప్రాయాలు, సలహాలు ఇచ్చారు. చేవెళ్ల జెడ్పీటీసీ సభ్యురాలు చింపుల శైలజ మాట్లాడుతూ జిల్లాలో కూడా పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు తదితర అంశాల్లో వందశాతం ప్రగతి సాధించిన గ్రామాలున్నాయని, వాటిని గుర్తించి ప్రోత్సహించాలన్నారు. మద్యపాన నిషేదంతోనే అభివృద్ధి సాధ్యమని, కానీ ప్రభుత్వం చీప్‌లిక్కర్ తెచ్చే ప్రయత్నం చేస్తే పల్లెలు ఎలా అభివృద్ధి చెందుతాయని ప్రశ్నించారు. ఇంతలో మంత్రి కలగజేసుకోవడంతో ఆమె ప్రశ్నకు సమాధానం రాలేదు. సమావేశంలో ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, సంజీవరావు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
దత్తత గ్రామాలపై చర్చ..
♦ అదనంగా మండలానికో గ్రామం ఎంపిక ♦ నేడు సిద్ధం కానున్న జాబితా సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దత్తత గ్రామాల ఎంపిక తీరుపై శుక్రవారం ‘సాక్షి’లో వచ్చిన మారు‘మూలకేనా..!’ కథనం సంబంధిత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కనీస సౌకర్యాలకు నోచుకోని వందలాది గ్రామాలను కాకుండా పట్టణాలకు, నియోజకవర్గ కేంద్రాలకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామాలను దత్తత తీసుకోవడం ఒకింత విమర్శలకు దారితీసింది. ఈ విషయమై మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులతో చర్చించినట్లు సమాచారం. ఒకరిద్దరు మినహా జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరూ మారుమూల గ్రామాలను ఎంపిక చేయలేదు. ఈ దత్తత గ్రామాలను అభివ ృద్ధిలో ముందువరుసలో నిలపడం ద్వారా ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తారనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. మండలానికొకటి చొప్పున.. గ్రామజ్యోతి కార్యక్రమంలో ఇప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున దత్తత తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా మండలానికి ఒక గ్రామం చొప్పున నియోజకవర్గంలో ఎన్ని మండలాలుంటే అన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ఎమ్మెల్యేలు గ్రామాల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈసారైనా మారుమూల ప్రాంతాలను దత్తత గ్రామాలుగా ఎంపిక చేసుకుంటే ఆయా గ్రామాల ప్రజలు త్వరితగతిన అభివ ృద్ధి బాటపట్టే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘గ్రామజ్యోతి’కి రూ.1,824 కోట్లు
బాన్సువాడ : పార్టీలకతీతంగా గ్రామజ్యోతి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి అందరూ కలిసి రావాలని, ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, పట్టింపులకు వెళ్లొద్దని సూచించారు. ఈ నెల 17 నుంచి 23 వరకు జరిగే గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా జిల్లాకు రూ.1,824 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రతి రోజూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యను పరదోలుతామన్నారు. బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ శాంతారూప్‌సింగ్ గురువారం ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన బహిరంగ సభలో మంత్రి పోచారం మాట్లాడారు. ప్రత్యేక ప్రణాళికల ద్వారా గ్రామజ్యోతి నిధులను కేటాయిస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఆసరా పింఛన్లు, బీడీ కార్మికుల భృతి తదితర పింఛన్ పథకాలకు ప్రత్యేకంగా ఒక తేదీ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే వారికి వెంటనే మంజూరు చేస్తామన్నారు. రూ.200 పింఛన్‌ను రూ.వెయ్యికి పెంచడం తమ ప్రభుత్వ ఘనత అని అన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం పంపిణీ చేయడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం లభిస్తోందని, త్వరలో పాఠశాలలకు విస్తరింపజేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకాల ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతోందన్నారు. రూ.5.05లక్షలతో 560 చదరపు అడుగుల ఏరియాలో డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. అధికారులే గ్రామాల్లో తిరిగి గుడిసెల్లో, అద్దెకు ఉంటున్న వారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా కట్టించిన ఇళ్లను అప్పగిస్తారని తెలిపారు. లబ్ధిదారులు నేరుగా ఇంటికి సున్నం వేసుకుని, గృహప్రవేశం చేయాలని, మిగతా అన్ని పనులను ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించామని తెలిపారు. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఒక్క ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి, ప్రతి ఒక్కరికి 100 లీటర్ల నీరు సరఫరా చేస్తామన్నారు. ఇందుకోసం జిల్లాకు రూ.3,470 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాలకు, ఎస్సారెస్పీ ద్వారా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, అర్బన్, కామారెడ్డి నియోజకవర్గాలకు నీరందిస్తామని మంత్రి పోచారం వివరించారు. బోర్లం గ్రామానికి అన్నివిధాలా సహకారం బోర్లం సర్పంచ్ శాంతారూప్‌సింగ్ టీఆర్ఎస్లో చేరడాన్ని ప్రశంసించిన మంత్రి, గ్రామాభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. బోర్లం క్యాంప్ వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామని, సీసీ రోడ్లు వేస్తామని, ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. బసవేశ్వర మందిర సమీపంలో రూ.40లక్షలతో వంతెన నిర్మిస్తామని చెప్పారు.సర్పంచ్ శాంతారూప్సింగ్తో పాటు మరో 400 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. బోధన్ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్, తహసీల్దార్ గోపి, ఎంపీడీఓ విజయ్‌భాస్కర్, ఎంపీపీ రే ష్మాబేగం ఎజాస్, జెడ్పీటీసీ సభ్యుడు జంగం విజయ గంగాధర్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు అలీముద్దీన్ బాబా, సింగిల్‌విండో చైర్మన్లు శ్రీనివాస్‌రెడ్డి, ఎర్వల కృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నార్ల సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తకొండ భాస్కర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, సర్పంచ్ శాంతారూప్‌సింగ్, మాజీ సర్పంచ్ నర్సింలు, సాయిలు, రఘురాం, జలీల్, సయ్యద్ అహ్మద్ పాల్గొన్నారు. ఉల్లి ధర స్థిరీకరణకు చర్యలు.. బాన్సువాడ : రాష్ట్రంలో ఉల్లి ధర విపరీతంగా పెరగడంతో ఈ ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి తన నివాసగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉల్లి ధరల స్థిరీకరణ కోసం శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో సమావేశం నిర్వహిస్తున్నామని, ఇందులో మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు పాల్గొననున్నట్లు వెల్లడించారు. రైతులు ఉల్లి సాగు చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి విత్తనాల సబ్సిడీని 50 నుంచి 75 శాతానికి పెంచినట్లు తెలిపారు. ధర ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా రూ.20కి కిలో చొప్పున విక్రరుుంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శుక్రవారం జరిగే సమావేశంలో రైతులు పాల్గొనవచ్చని సూచించారు. -
కొత్త వ్యవస్థకు గ్రామజ్యోతి పునాది
కరీంనగర్ సిటీ :రాష్ట్రంలో నూతన వ్యవస్థకు గ్రామజ్యోతి కార్యక్రమం పునాది అని రాష్ట్ర ఆర్థిక, పౌ రసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం ఉదయం గ్రామజ్యో తి నోడల్ అధికారులకు, మధ్యాహ్నం జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలకు అవగాహన స దస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరై న ఈటల మాట్లాడుతూ జన్మభూమి, ప్రజాపథం, రచ్చబండ తదితర పేర్లతో గత ప్రభుత్వాలు హడావుడి చేసినా ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. గ్రామసభలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని, కాని ఇప్పటివరకు జరిగిన గ్రామసభలు ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయాయని అన్నారు. గ్రామసభల్లో పూర్తిస్థాయిలో చర్చించి నిర్ణయాలు తీసుకున్న పాపానపోవడం లేదన్నారు. అధికారికి దగ్గరైతే, అధికార పార్టీ కార్యకర్త అయితేనో, ఎమ్మెల్యే చెబితే నో పనులు జరుగుతున్నాయనే భావన ఉందన్నారు. అలాకాకుండా గ్రామజ్యోతిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు. పా త వ్యవస్థ పోయి కొత్త విధానానికి గ్రామజ్యోతి అంకురార్పణ కావాలన్నారు. గ్రామస్థాయిలోనే సమస్యలను పరిష్కరిస్తే కలెక్టరేట్ వరకు ప్రజలు రారన్నారు. క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ధర్మం, నీతిని పాటించాలని హితవు పలికారు. శుక్రవారం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. 15న గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయూన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ నిర్వీర్యమైన గ్రామపంచాయతీలకు పునర్జీవం పోసేదే గ్రామజ్యోతి కార్యక్రమమన్నారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ బంగారు తెలంగాణ కోసం గ్రామజ్యోతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు నిలిపివేయడంతో జిల్లా పరిషత్‌లకు కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. నిధుల కోసం సీఎంకు విన్నవించినట్లు తెలిపారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ వర్షాలు పడినందున గ్రామజ్యోతిలో హరితహారం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, బొడిగె శోభ, ఏజేసీ నాగేంద్ర, జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్, డీపీఓ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఇల్లు లేకున్నా మరుగుదొడ్డి నిర్మించుకుంది
శెభాష్.. పోశవ్వ సిరిసిల్ల రూరల్: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆరెపల్లి పోశవ్వ(68) ఇల్లు లేకున్నా మరుగుదొడ్డి నిర్మించుకుని గ్రామస్తులందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ గ్రామాన్ని గ్రామజ్యోతి కార్యక్రమంలో సిరిసిల్ల పోలీసులు దత్తత తీసుకున్నారు. గురువారం ఊళ్లో గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే అందరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని డీఎస్పీ దామెర నర్సయ్య ప్రజలకు సూచించారు. కానీ, గ్రామంలో ఇప్పటికే 80 శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని చాలామంది వాటిని ఉపయోగించడం లేదు. మళ్లీ బహిరంగా మూత్ర, మల విసర్జనకే మొగ్గుచూపుతున్నారు. కొంతమంది ఆర్థికంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు మోహం చాటేశారు. కానీ ఇదే గ్రామంలో ఆరెపల్లి పోశవ్వ(68) మాత్రం లక్ష్మీపూర్ గ్రామానికి ఆదర్శంగా నిలిచింది. ఉండటానికి ఇల్లు లేకున్నా... తన రెక్కల కష్టంతో మంచి నాణ్యతతో మరుగుదొడ్డి నిర్మించుకుంది. ఇద్దరు కొడుకులు పొట్టకూటి కోసం ముంబయ్ వెళ్లగా ఒక్క తే ఓ చిన్న గుడిసెలో ఉంటోంది. ఈ విషయం డీఎస్పీ దామెర నర్సయ్య, సీఐ విజయ్‌కుమార్ దృష్టికి రావడంతో ఇంటికి వెళ్లి పోశవ్వ మరుగుదొడ్డిని పరిశీలించి ఆమెను అభినందించారు.