గ్రామజ్యోతిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి
మంత్రి హరీశ్‌రావు
పటాన్‌చెరు : గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన పటాన్‌చెరు మండలం లక్డారంలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామజ్యోతి కార్యక్రమం విశిష్టతను వివరించారు. కాగా మంత్రి గ్రామ ప్రజలను ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. వేదికపై ఆయన నిలబడి ఉన్నంత సేపు గ్రామ ప్రజలను నవ్వించారు. గ్రామజ్యోతి విశిష్టతను సూటిగా అర్థమయ్యేలా వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన గంగదేవిపల్లి ఎలా ఆదర్శ గ్రామంగా మారిందో ఆ విధంగానే తెలంగాణలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు. పారిశుద్ధ్య సమస్యలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామాభివృద్ధి ప్రణాళికలకు ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. అందుకోసమే ఏడు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.
డంప్ యార్డుకు స్థలం కేటాయించండి
అన్ని గ్రామాల్లో చెత్త డంపింగ్ యార్డు కోసం స్థలాన్ని వెంటనే కేటాయించాలని తహశీల్దార్లకు మంత్రి సూచించారు. లక్డారంలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలం కేటాయించక పోవడంపై మంత్రి స్థానిక తహశీల్దార్ ఫర్హీన్ షేక్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. గ్రామజ్యోతి ప్రారంభించి మూడు రోజులైనా డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించక పోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. గ్రామంలో అంగన్‌వాడీ, వైద్యం, ఆరోగ్యం పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రాంలో కలెక్టర్ రొనాల్డ్ రాస్, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎంపీపీ శ్రీశైలం యాదవ్, జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.