నిరసనల మధ్య ‘గ్రామజ్యోతి’
- ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ప్రాధాన్యత కల్పించలేదని ఆందోళన
- స్థానికంగా సర్పంచ్‌లు ఉండటం లేదంటూ ఫిర్యాదులు
- ముందస్తు సమాచారం ఇవ్వలేదని గ్రామస్తుల ఆందోళన
- చౌటుప్పుల్‌లో రసాభాసాగా మారిన కార్యక్రమం
నల్లగొండ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. సోమవారం నుంచి ఈ నెల 27 తేదీ వరకు జరగాల్సిన కార్యక్రమ తొలి రోజునే స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. గ్రామ కమిటీల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు ప్రాధాన్యత కల్పించకపోవడాన్ని నిరసిస్తూ పలుచోట్ల గ్రామజ్యోతి కార్యక్రమాన్ని బహిష్కరించారు. చౌటుప్పుల్‌లో గ్రామజ్యోతి కార్యక్రమం రసాభాసాగా మారింది. స్థానిక ఎమ్మెల్యే కూసుకంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలోనే ఎంపీపీలు, విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను అరెస్టు చేశారు. చిలుకూరు, నడిగూడెం, కోదాడ మండలాలకు చెందిన ఎంపీపీలు, ఎంపీటీసీలు ఏకమై కోదాడ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కార్యక్రమంలో తమను భాగస్వాముల్ని చేయాలని డిమాం డ్ చేస్తూ ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పాశం రాంరెడ్డి ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో ఎంపీటీసీలు ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
మఠంపల్లిలో టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. సూర్యాపేట మం డలం ఇమాంపేట గ్రామంలో సర్పంచ్ అందుబాటులో ఉండడం లేదని గ్రామస్తులు గ్రామ జ్యోతిని బహిష్కరించారు. ఈ మేరకు గ్రామస్తులు తీర్మానం చేసి అధికారులకు అందజేశారు. టేకుమట్లలో గ్రామజ్యోతి గురించి ముందస్తు సమాచారం ఇవ్వలేదని గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగా రు. ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మల పెన్‌పహా డ్ గ్రామ కమిటీలో ఒకే వర్గం వారిని తీసుకోవడం పై వాగ్వాదం జరిగింది. మక్తా కొత్తగూడెంలో గ్రామస్తులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో గ్రా మజ్యోతి వాయిదా పడింది. రాజాపేట మండలం పాముకుంట గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు కార్యక్రమాన్ని బహిష్కరించారు. మిర్యాలగూడ మండలం తుంగపాడులో వార్డుసభ్యులు నిరసన తెలిపారు.