‘గ్రామజ్యోతి’ పరుగులు..
‘గ్రామజ్యోతి’ పట్టాలెక్కనుంది. నిధుల కేటాయింపులు జరగడంతో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. అభివృద్ధి కోసం ఏర్పాటైన కమిటీలకు అవగాహన కల్పించనున్నారు. గ్రామ సభల్లో తీర్మానించిన పనులు చేపట్టేందుకు అడుగులు వేస్తున్నారు. పారదర్శకంగా పనులు సాగేలా చర్యలు చేపడుతున్నారు. ఇదే వేగాన్ని ప్రదర్శిస్తే పల్లెలు ప్రగతి బాట పట్టినట్టే...
- నల్లగొండ
రెండు రోజుల క్రితం జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. గ్రామజ్యోతిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలంటే ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ శిక్షణ తరగతులు జిల్లా స్థాయిలో నిర్వహిస్తారు. గ్రామజ్యోతిలో భాగంగా ప్రధానంగా ఏడు అంశాలకు సంబంధించి కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ ఏడు కమిటీలకుగాను 14,865 లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఒక్కో కమిటీ ఎంచుకున్న లక్ష్యాల ను ఏ విధంగా అమలు చేయాలి..? ఎలా ముందుకు వెళ్లాలి..? అనే దానిపై సంబంధిత శాఖల అధికారులతో అవగాహన కల్పిస్తారు.
ఉదాహరణకు..
విద్యా కమిటీ అయితే ఆ గ్రామంలో వందశాతం విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలి. పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, బడి బయటి పిల్లలను బడిలో చేర్పించడం వంటి కార్యక్రమాలను ఏ విధంగా చేస్తే వందశాతం లక్ష్యాలను సాధిస్తామనే దానిపై డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓలతో అవగాహన కల్పిస్తారు. అక్షరాస్యులైన వారే విద్యాకమిటీ చైర్మన్లు ఉండాలని నిర్ణయించారు. ఈ విషయంలో విద్యావంతులే ఉండాలని మార్పు చేశారు.
అభివృద్ధి పనులకు నిధులు....
14వ ఆర్థిక సంఘం కింద పంచాయతీలకు రూ.36.19 కోట్లు మంజూరయ్యాయి. జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి పంచాయతీల ఖాతాలకు రెండు రోజుల్లో సర్దుబాటు చేయనున్నారు. ఈ నిధుల వాడకానికి సం బంధించి గతంలో మాదిరి బోర్ల మరమ్మతులు, కంటికి కనిపించని పనులు చేయడానికి వీల్లేదు. ఇప్పటివరకు వచ్చిన నిధుల్లో సర్పంచ్‌లు చాలావరకు దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. గ్రామజ్యోతిలో భాగంగా గ్రామసభల్లో తీర్మానం చేసిన వివిధ రకాల అభివృద్ధి పనులకే ఈ నిధులు వినియోగించాలి.
గ్రామసేవ కేంద్రాల ఏర్పాటు...
మీ సేవ కేంద్రాల తరహాలో గ్రామాల్లో అన్ని రకాల సేవలను ప్రజలకు అందుబాటులో తె చ్చేందుకు వీలుగా పల్లె సమగ్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది తొలి విడత 75 పంచాయతీల్లో పల్లె సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచాయతీ భవనాలు, కంప్యూటర్లు, బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ కలిగిన గ్రామాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. వచ్చే ఏడాది రెండో విడత కింద మరిన్ని గ్రామాల్లో వీటిని విస్తరిస్తారు. ఈ కేంద్రాల ద్వారా ముందుగా పంచాయతీల పన్ను వసూలు, ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లింపు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు వంటి సేవలందిస్తారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2నుంచి పల్లె సమగ్ర సేవా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.
గ్రామజ్యోతి కమిటీల వివరాలు, నిర్దేశించిన లక్ష్యాలు
జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలు 1,176
గ్రామజ్యోతి కమిటీలు 8,190
నిర్దేశించిన లక్ష్యాల సంఖ్య 14,865
గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా..
‘గ్రామజ్యోతి’లో తీర్మానం చేసిన అభివృద్ధి పనులు అమలు చేసేందుకు కమిటీలకు శిక్షణ త రగతులు నిర్వహించాలని నిర్ణయించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామసభల్లో తీర్మా నం చేసిన పనులకే వెచ్చించాలి. దుర్వినియోగం చేయడానికి వీళ్లేదు. ఈ నిధుల వినియోగంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.
- పి.ప్రభాకర్ రెడ్డి, డీపీఓ