panchayat officers
-
ఇంటి కుళాయికి బిరడా
మంగపేట: రోడ్డువెంట మొక్కల్ని పశువులు ధ్వంసం చేస్తున్నాయంటూ పశువుల కాపరికి రూ.7,500 జరిమానా విధించిన అధికారులు.. తాజాగా సదరు కాపరి ఇంటి కుళాయికి బిరడా బిగించడం వివాదాస్పదమైంది. ములుగు జిల్లా మంగపేటలో అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను పశువులు ధ్వంసం చేయడానికి కారకుడంటూ పశువుల కాపరి గంపోనిగూడెంకు చెందిన బోయిన యాకయ్యకు పంచాయతీ అధికారులు రూ.7500 జరిమానా విధించడం తెలిసిందే. తాజాగా యాకయ్య ఇంటి కుళాయి (నల్లా)ను సైతం పంచాయతీ అధికారులు సీజ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బుధవారం కలెక్టర్ కృష్ణ ఆదిత్య వాహనానికి పశువులు అడ్డం వచ్చాయి. ఎంత హారన్ కొట్టినా వాటిని పక్కకు అదిలించకుండా పశువుల కాపరి యాకయ్య ఫోన్ మాట్లాడుతుండడంతో కలెక్టర్ అసహనానికి గురయ్యారు. దీంతో తన గన్‌మెన్‌ను పంపి కాపరి ఫోన్‌ను లాక్కున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీనికి పశువులు మొక్కలను ధ్వంసం చేస్తున్నాయన్న సాకుతో జరిమానా విధించినట్లు చెబుతున్నారు. నల్లాకు బిరడా బిగింపుపై పశువుల కాపరి యాకయ్య మాట్లాడుతూ రూ.7,500 జరిమానాను మూడు నెలల్లో చెల్లించాలని చెప్పి ఫోన్ ఇచ్చారని తెలిపాడు. ఇంటికి వచ్చి చూడగా పంచాయతీ సిబ్బంది తన ఇంటి నల్లాకు బిరడా వేసి సీజ్ చేశారని పేర్కొన్నాడు. సాయంత్రం ఎంపీడీవో ఫోన్ చేసి నల్లా బిరడా తొలగించుకోమన్నారని, తనకు తెలియదని చెబి తే.. పంచాయతీ సిబ్బంది వచ్చి తొలగించి వెళ్లారని వివరించాడు. తనకు విధించిన జరిమానాపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశాడు. నిర్లక్ష్యానికే జరిమానా: ఎంపీడీవో మండలంలోని ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుకిరువైపులా నాటిన అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను పశువులు ధ్వంసం చేస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకే పశువుల కాపరికి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జరిమానా విధించామని ఎంపీడీవో శ్రీధర్ ఓ వీడియోలో వివ రణ ఇచ్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమా ల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై వివరణ కోరేందుకు ఎంపీడీవోకు ఫోన్ చేయగా స్విచాఫ్ అని వస్తోంది. -
అందని గౌరవం!
సర్పంచ్ల పదవీ కాలం ముగిసినా.. వీరికి చెల్లించాల్సిన 13 నెలల గౌరవ వేతనాలు అందలేదు. నెలకు రూ.5 వేల చొప్పున ఒక్కొక్కరికి రూ.65 వేలు రావాలి. ఇలా జిల్లాలోని 367 మందికి సంబంధించి రూ.2.38 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. ధనిక రాష్ట్రంగా చెప్పుకొంటున్న తెలంగాణ ఖజానాలో తమకు ఇవ్వాల్సిన డబ్బులకు తావు లేకుండా పోతోందని తాజామాజీ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్ స్పందించి బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు. సాక్షి, వికారాబాద్: ‘గ్రామానికి ప్రథమ పౌరులైన సర్పంచులకు ఇంత తక్కువ గౌరవ వేతనాలు ఇవ్వడమేంటీ?. గత ప్రభుత్వాలు వీరిని నిర్లక్ష్యం చేశాయి. గ్రామస్థాయిలో పరిపాలన సక్రమంగా, నిజాయతీగా ఉండాలంటే సర్పంచులకు గౌరవ వేతనాలు పెంచాల్సిందే. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు గౌరవవేతనం పెంచాలని నిర్ణయం తీసుకుంది’ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో చెప్పిన మాటలివి. ఈ మేరకు సర్పంచ్‌లకు గౌరవ వేతనాలను పెంచుతూ 2015 ఏప్రిల్ 1వ తేదీన ప్రభుత్వం జీవోనెం.53 జారీచేసింది. నెలకోసారి వేతనాలిస్తామని ప్రకటించింది. కానీ ఏప్పుడూ ఎప్పుడూ సక్రమంగా ఇవ్వలేదు. ప్రస్తుతం జిల్లాలోని 367 జీపీల సర్పంచ్‌లకు రూ.2,38,55,000 బకాయి ఉన్నాయి. ఒక్కో సర్పంచ్‌కు నెలకు రూ.5 వేల చొప్పున 13 నెలలకుగాను రూ.65 వేలు రావాల్సి ఉంది. గౌరవ వేతనాలను విడుదల చేయడంలో సర్కారు మీనమేషాలు లెక్కిస్తోందని జిల్లాలోని తాజామాజీ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. భారీగా పెరిగిన జీతాలు... జిల్లాలోని 18 మండలాల్లో 367 పంచాయతీలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు ఉమ్మడి ఏపీలో సర్పంచులకు అతి తక్కువ వేతనాలుండేవి. జిల్లా పరిషత్చైర్మన్కు రూ.7,500, జెడ్పీటీసీ సభ్యుడికి రూ.2,250, మండల పరిషత్ అధ్యక్షునికి రూ.1,500, ఎంపీటీసీకి రూ.750 అందజేసేవారు. ఇక సర్పంచుల విషయానికొస్తే మేజర్ పంచాయతీలకు రూ.1,500, మైనర్ జీపీల సర్పంచులకు రూ.1,000 ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అతితక్కువ గౌరవ వేతనం ఉండటాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ వీరి వేతనాలను పెంచాలని నిర్ణయించారు. ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన 1.4.2015న వేతనాల పెంపును సవరించే విధంగా జీవోనెం.53ను విడుదల చేశారు. దీంతో వారి వేతనాలను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్‌కు రూ.లక్ష, జెడ్పీటీసీ, ఎంపీపీకి రూ.10 వేల చొప్పున, ఎంపీటీసీలు, సర్పంచులకు రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం వెలువర్చింది. గ్రామపంచాయతీల అకౌంట్లో జమచేస్తే తీసుకునే అవకాశాన్ని సర్పంచులకు కల్పించారు. ఈ వేతనాలను నెలనెలా ఇస్తామని అప్పట్లో ప్రకటించిన సర్కారు మొదట్లో నాలుగైదు నెలలకోసారి ఇచ్చేవారు. కాగా ప్రస్తుతం గతనెలాఖరు వరకు 13నెలల బకాయలు తమకు రావాల్సి ఉందని సర్పంచులు పేర్కొంటున్నారు. 2017 సంవత్సరం జూన్ నెలవరకు వరకు వేతనాలిచ్చారు. 2017 జూలై నుంచి ఈనెల (జూలై) 2018 వరకు 13 నెలల బకాయలు ఉన్నాయి. జిల్లాలో 367 గ్రామపంచాయతీల సర్పంచులకు నెలకు రూ.5 వేల చొప్పున ఈనెలాఖరు వరకు బకాయలు జిల్లా వ్యాప్తంగా తాజా మాజీ సర్పంచులకు 2,38,55,000 ఇవ్వాల్సి ఉంది. తమ పదవీ కాలం ముగిసినప్పటికీ వేతనాలు మాత్రం ఇవ్వలేదని సర్కారుపై అసంతప్తితో ఉన్నారు. ఇటు పర్సన్ ఇన్చార్జులుగా నియమించలేక అటు గౌరవ వేతనాలు ఇవ్వక తమను అవమానపరిచారని వారు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. తాజా మాజీ సర్పంచులలో అధికశాతం మంది పేద, మధ్య తరగతివారే ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని జిల్లా సర్పంచుల సంఘం విజ్ఞప్తిచేస్తోంది. -
చనిపోయిన వారినీ వదలలేదు..
అట్లూరు: అధికారపార్టీ నాయకుల కబ్జాలు, కుంభకోణాలు, తదితర ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోవడం ఒక ఎత్తయితే.. వారి అండదండలతో మేమేం తక్కువ అంటూ చనిపోయినవారి, కువైటుకు వెళ్లినవారిపేర్లమీద వృద్ధాప్య, వితంతు పింఛన్లు లక్షల రూపాయల్లో పంచాయితీ కార్యదర్శులు స్వాహా చేసిన ఉదంతం అట్లూరు మండలంలో చోటుచేçసుకుంది. ఈవిషయం సామాజిక తనికీ బృంధం వెల్లడించినప్పటికీ తమ పలుకు బడిని ఉపయోగించుకుని బయటికి పొక్కకుండా చేతివాటం ప్రదర్శించారు. మండల పరిదిలోని తంభళ్లగొంది, కుంభగిరి, కొం డూరు, మాడపూరు పంచాయితీలలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.తంభళ్లగొంది పంచాయతీ పరిధిలోని యర్రబల్లి గ్రామానికి చెందిన కె, వెంకటమ్మ ఐడీ నెంబరు 111450179తో వృద్ధాప్య పించన్ ప్రతినెలా రూ.1000 తీసుకుంటూ ఉండేది. ఆమె 24–3–2015 లో మృతి చెందింది. ఆమె బ్రతికి ఉన్నట్లు ప్రతి నెలా తన వేలిగుర్తుతో పంచాయతీ కార్యదర్శి రూ,27వేలు స్వాహా చేశాడు. ఎరుకుల కాలనీకి చెందిన నామాల లక్ష్మిదేవి కి భర్త చనిపోవడంతో ఐడీ నెంబరు 111545324తో వితంతు పింఛన్ ప్రతి నెలా రూ.100 తీసుకుంటూ ఉండేది. 2014లో జీవనోపాధికోసం కువైట్ వెళ్లింది. అప్పటినుండీ ప్రతినెలా ఆమె పేరున సంబంధిత పంచాయతీ కార్యదర్శి స్వాహా చేయడం జరగింది. ఈమె కువైటు నుంచి ఈనెల 15వ తేదీన వచ్చింది. పింఛన్ గురించి అడగగా నాకు తెలియదు అన్నారు. యర్రబల్లి ఎస్సీకాలనీకి చెందిన కొట్టూరు నరసమ్మ రెండు సంవత్సరాల క్రితం మృతి చెందింది. ఈమె పేరున ప్రతినెలా రూ.1000 చొప్పున ఇంతవరకు రూ,29వేలు స్వాహాచేయడం జరిగింది. అలాగే మాడపూరు పంచాయితీ పరిదిలో ఎం. లక్షుమ్మ, సుబ్బమ్మ, గురమ్మ, చిన్నక్క వీరు గ్రామంలో లేనప్పటికీ వారి పేర్ల మీద సంబందిత పంచాయతీ కార్యదర్శి రూ,18వేలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ చేస్తాం: సుమారు మూడు లక్షల రూపాయలకు పైగా చనిపోయిన వారిపేర్ల మీద, కువైటుకు వెళ్లిన వారిపేర్లపై పింఛన్ సొమ్ము స్వాహా చేసిన ఉధంతంపై సాక్షి ఎంపీడీఓ రెడ్డెయ్యనాయుడును వివరణ అడుగగా విచారించి చర్యలు తీసుంటామని తెలిపారు. -
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
-
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
- నిజాంపేట, భండారి లేఔట్లో అక్రమ కట్టడాల కూల్చివేత మొదలు - హెచ్ఎండీఏ పరిధిలో 1,750 అక్రమ నిర్మాణాలున్నట్టుగా గుర్తింపు - ఇప్పటికే అందరికీ నోటీసులు జారీ.. దశలవారీగా కూల్చివేత షురూ - నాలుగు రోజుల్లో 252 భవనాలు, 43 లేఔట్ల కూల్చివేత సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలు, అనధికారిక లేఔట్లపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎం డీఏ) ఉక్కుపాదం మోపుతోంది. నెలరోజుల క్రితం నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి 15 రోజుల పాటు ముంపులో చిక్కుకున్న నిజాంపేటలోని బండారి లేఔట్‌లోని అక్రమ నిర్మాణాలను హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూకటివేళ్లతో పెకిలిస్తున్నారు. తొలుత నాలా పరీవాహక ప్రాంతాల్లోని ఐదు అంతస్తుల ఏడు భవనాలు, 20 గేటెడ్ కమ్యూనిటీ విల్లాలను మంగళవారం కూల్చివేశారు. మరో 20 రోజుల్లో ఇక్కడ ఉన్న వందకుపైగా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని అధికారులు చెబుతున్నారు. 252 భవనాలు, 43 లేఔట్ల కూల్చివేత.. పటాన్చెరువు మండలం కిష్టారెడ్డిపేట గ్రామం, మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామం, అబ్దుల్లాపూర్‌మెట్, ఘట్కేసర్ మండలంలోని కొర్రెముల, పోచారం, నిజాంపేట, బడంగ్పేట్, ఇబ్రహీంపట్నంలోని 42 అక్రమ నిర్మాణాలు, 11 అనధికారిక లేఔట్లను అధికారులు కూల్చివేశారు. స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతున్నా పోలీసుల సహకారంతో జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలను హెచ్ఎండీఏ సిబ్బంది కూల్చివేస్తోంది. నెలరోజుల స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకూ నాలుగు రోజుల్లో 252 భవనాలు, 43 లేఔట్ల నిర్మాణాలను ధ్వంసం చేశారు. శని, ఆది, సోమవారాలు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో తాత్కాలికంగా విరామం ఇచ్చినా, మంగళవారం నుంచి మళ్లీ స్పెషల్ డ్రైవ్ మొదలుకావడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో 1,759 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టుగా గుర్తించి.. వారందరికీ హెచ్ఎండీఏ నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఇవ్వకున్నా.. అపార్ట్‌మెంట్‌కు వచ్చి తనిఖీలు చేసే సమయంలో అనుమతులు లేవని తెలిసినా కూల్చివేసే ఆస్కారముంది. దీంతో అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆదిబట్ల, కుందుకూరు, పెద్దఅంబర్‌పేట, బాచుపల్లి, బీబీనగర్, అన్నంపట్ల, బ్రాహ్మణపల్లి, చెంగిచెర్ల, ఇబ్రహీంపట్నం, కొత్తూరు, ప్రగతినగర్, తూప్రాన్, కేతిరెడ్డి పల్లి, భూదాన్ పోచంపల్లిలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. గ్రామ పంచాయతీ అనుమతి పేరిట వెలసిన పటాన్చెరువు, అమీన్పూర్, ఘట్కేసర్, మొయినాబాద్, చిలుకూరు, ప్రగతినగర్, బాచుపల్లిల్లో అక్రమ నిర్మాణాలపై సైతం కొరడా ఝళిపించారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు.. వరద ముంపునకు గురైన బండారి లేఔట్లో మళ్లీ అక్రమ నిర్మాణాలు ఊపందుకోవడం.. దీనిపై పంచాయతీ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం.. ఈ నేపథ్యంలో స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో నిజాంపేటలోని అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ దృష్టి కేంద్రీకరించింది. నిజాంపేటలోని శ్రీనివాస్‌నగర్‌లో 12 విల్లాలను అధికారులు కూల్చివేశారు. అయితే ప్రతి అపార్ట్మెంట్ వద్దకు వెళ్లి అనుమతులు తనిఖీ చేసి, నోటీసు ఇవ్వకున్నా కూల్చివేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. -
వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత
అన్నవరం : వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో పంచాయతీ సిబ్బంది ప్రొటోకాల్ పాటించకపోవడంతో వివాదం నెలకొంది. స్థానిక కొత్తపేట వద్ద రూ.23 లక్షలతో నిర్మించిన 90 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ట్యాంక్‌ను కాకినాడ ఎంపీ తోట నర్సింహం, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పంచాయతీ సిబ్బంది ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఫొటో, పేరు లేకపోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబుకు ఆహ్వానం పలుకుతూ పంచాయతీ సిబ్బంది ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కానీ ఎమ్మెల్యే వరుపులకు ఫ్లెక్సీ ఏర్పాటు చేయలేదు. పంచాయతీ అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఆ పార్టీ శ్రేణులు పంచాయతీ కార్యదర్శి రామ శ్రీనివాస్‌ను నిలదీశారు. ఒక దశలో టీడీపీ, వైఎస్సార్‌కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ పరిస్థితి వచ్చింది. ఈ విషయంపై అధికారులు సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు కార్యకర్తలు పరిస్థితి వివరించారు. దీంతో ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడమేమిటని ప్రశ్నించారు. ఒక దశలో ఆయన పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ లేని వ్యక్తులను కార్యక్రమానికి ఆహ్వానిస్తే తాను బహిష్కరిస్తానని హెచ్చరించారు. అన్నవరం ఎస్సై జగన్మోహన్, సిబ్బంది ఇరువర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో కార్యక్రమానికి వచ్చిన కాకినాడ ఎంపీ తోట నర్సింహం ముందే ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో ఆయన వారిని వారించారు. అనంతరం ఎంపీ సూచన మేరకు టీడీపీ నాయకులు వెనక్కి తగ్గారు. టీడీపీ నేత పర్వత సురేష్ స్వయంగా ఎమ్మెల్యే వరుపుల వద్దకు వెళ్లి ఆయనను కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. జరిగిన విషయాన్ని మర్చిపోవాలని కోరారు. ప్రొటోకాల్ లేని వారిని కార్యక్రమం వద్దకు అనుమతించరాదని ఎమ్మెల్యే అన్నారు. దానికి టీడీపీ నాయకులు అంగీకరించడంతో ఎమ్మెల్యే వరుపుల కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఎంపీ తోట, ఎమ్మెల్యే వరుపుల వాటర్‌ట్యాంక్‌ను ప్రారంభిం చారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, ఎంపీపీ బద్ది మణి, వైస్ ఎంపీపీ బి.సత్తిబాబు, సర్పంచ్ రాజాల గంగాభవాని పాల్గొన్నారు. మూడు రోడ్లకు శంకుస్థాపన అన్నవరంలోని జన్మభూమి రోడ్డు, సాయిబాబా ఆలయం నుంచి లోపలకు వెళ్లే రోడ్డు, కొత్తపేటలో మరో రోడ్డుకు ఎంపీ తోట నరసింహం శంకు స్థాపన చేశారు. అలాగే సత్యదేవుని నమూనా ఆలయం వరకు వాటర్ పైప్‌లైన్ పనులకు కూడా ఎంపీ తోట నరసింహం శంకుస్థాపన చేశారు. ప్రొటోకాల్ వివాదంపై స్పీకర్‌కు ఫిర్యాదు ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొంతమంది ప్రభుత్వ అధికారులు టీడీపీ తొత్తులుగా మారి ప్రొటోకాల్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు విమర్శించారు. అలాంటి వారిపై తాను శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. గురువారం ఆయన అన్నవరంలో విలేకర్లతో మాట్లాడారు. అన్నవరం వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేనైన తనను ఆహ్వానించారని, కానీ పంచాయతీ కార్యదర్శి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన పేరులేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేక పార్టీ కార్యక్రమమా అని ఆయన ప్రశ్నించారు. అధికారులు ప్రొటోకాల్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. ఎమ్మెల్యే వరుపుల వెంట పార్టీ యువజన విభాగం జాయింట్ సెక్రటరీ ముదునూరి మురళీ కృష్ణంరాజు, ఏలేశ్వరం మండల పార్టీ కన్వీనర్ గొల్లపల్లి బుజ్జి, పార్టీ నాయకులు వాసిరెడ్డి జమీలు, అన్నవరం ఎంపీటీసీ సభ్యులు బండారు సత్యగంగాభవానీ, అనుసూరి లక్ష్మి, అన్నవరం టౌన్ అధ్యక్షుడు రాయవరపు భాస్కరరావు, జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి అప్పారావు, సరమర్ల మధుబాబు, బండారు సురేష్, రాయి శ్రీనివాస్, పంచారయతీ వార్డు సభ్యులు ఈర్లు శ్రీనివాస్, నవుడు శ్రీను, వైఎస్సార్సీపీ నాయకులు బలువు రాంబాబు, దడాల సతీష్, బండారు అర్జునరావు, బొబ్బిలి వెంకన్న,పలివెల కొండలరావు, సింగంపల్లి రాము, రాజాన రామరాజు, కొల్లు చిన్నా, పూసర్ల వేంకట రత్నం, ధనలక్ష్మి, కొణతల విజయలక్ష్మి, షేక్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. -
‘గ్రామజ్యోతి’ పరుగులు..
‘గ్రామజ్యోతి’ పట్టాలెక్కనుంది. నిధుల కేటాయింపులు జరగడంతో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. అభివృద్ధి కోసం ఏర్పాటైన కమిటీలకు అవగాహన కల్పించనున్నారు. గ్రామ సభల్లో తీర్మానించిన పనులు చేపట్టేందుకు అడుగులు వేస్తున్నారు. పారదర్శకంగా పనులు సాగేలా చర్యలు చేపడుతున్నారు. ఇదే వేగాన్ని ప్రదర్శిస్తే పల్లెలు ప్రగతి బాట పట్టినట్టే... - నల్లగొండ రెండు రోజుల క్రితం జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. గ్రామజ్యోతిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలంటే ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ శిక్షణ తరగతులు జిల్లా స్థాయిలో నిర్వహిస్తారు. గ్రామజ్యోతిలో భాగంగా ప్రధానంగా ఏడు అంశాలకు సంబంధించి కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ ఏడు కమిటీలకుగాను 14,865 లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఒక్కో కమిటీ ఎంచుకున్న లక్ష్యాల ను ఏ విధంగా అమలు చేయాలి..? ఎలా ముందుకు వెళ్లాలి..? అనే దానిపై సంబంధిత శాఖల అధికారులతో అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు.. విద్యా కమిటీ అయితే ఆ గ్రామంలో వందశాతం విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలి. పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, బడి బయటి పిల్లలను బడిలో చేర్పించడం వంటి కార్యక్రమాలను ఏ విధంగా చేస్తే వందశాతం లక్ష్యాలను సాధిస్తామనే దానిపై డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓలతో అవగాహన కల్పిస్తారు. అక్షరాస్యులైన వారే విద్యాకమిటీ చైర్మన్లు ఉండాలని నిర్ణయించారు. ఈ విషయంలో విద్యావంతులే ఉండాలని మార్పు చేశారు. అభివృద్ధి పనులకు నిధులు.... 14వ ఆర్థిక సంఘం కింద పంచాయతీలకు రూ.36.19 కోట్లు మంజూరయ్యాయి. జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి పంచాయతీల ఖాతాలకు రెండు రోజుల్లో సర్దుబాటు చేయనున్నారు. ఈ నిధుల వాడకానికి సం బంధించి గతంలో మాదిరి బోర్ల మరమ్మతులు, కంటికి కనిపించని పనులు చేయడానికి వీల్లేదు. ఇప్పటివరకు వచ్చిన నిధుల్లో సర్పంచ్‌లు చాలావరకు దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. గ్రామజ్యోతిలో భాగంగా గ్రామసభల్లో తీర్మానం చేసిన వివిధ రకాల అభివృద్ధి పనులకే ఈ నిధులు వినియోగించాలి. గ్రామసేవ కేంద్రాల ఏర్పాటు... మీ సేవ కేంద్రాల తరహాలో గ్రామాల్లో అన్ని రకాల సేవలను ప్రజలకు అందుబాటులో తె చ్చేందుకు వీలుగా పల్లె సమగ్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది తొలి విడత 75 పంచాయతీల్లో పల్లె సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచాయతీ భవనాలు, కంప్యూటర్లు, బీఎస్ఎన్ఎల్ బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ కలిగిన గ్రామాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. వచ్చే ఏడాది రెండో విడత కింద మరిన్ని గ్రామాల్లో వీటిని విస్తరిస్తారు. ఈ కేంద్రాల ద్వారా ముందుగా పంచాయతీల పన్ను వసూలు, ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లింపు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు వంటి సేవలందిస్తారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2నుంచి పల్లె సమగ్ర సేవా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామజ్యోతి కమిటీల వివరాలు, నిర్దేశించిన లక్ష్యాలు జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలు 1,176 గ్రామజ్యోతి కమిటీలు 8,190 నిర్దేశించిన లక్ష్యాల సంఖ్య 14,865 గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా.. ‘గ్రామజ్యోతి’లో తీర్మానం చేసిన అభివృద్ధి పనులు అమలు చేసేందుకు కమిటీలకు శిక్షణ త రగతులు నిర్వహించాలని నిర్ణయించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామసభల్లో తీర్మా నం చేసిన పనులకే వెచ్చించాలి. దుర్వినియోగం చేయడానికి వీళ్లేదు. ఈ నిధుల వినియోగంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. - పి.ప్రభాకర్ రెడ్డి, డీపీఓ -
కుక్కల దాడి
ఐదు కుక్కలు.. ఒక బాలుడు.. ఒక్కసారిగా అన్ని కుక్కలు చుట్టుముట్టి మీదపడి కొరికేస్తుంటే ఆ బాలుడేం చేస్తాడు పాపం. అమ్మా అంటూ ఏడుస్తూ గట్టిగా అరవడం తప్ప. అవును.. దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామ శివారులో ఆదివారం ఇదే జరిగింది. ప్రొద్దుటూరు క్రైం : ముజమ్మిల్ (8) అనే పసి బాలుడిని ఐదు కుక్కలు చుట్టుముట్టి కసితీరా కరిచాయి. కుక్కల దాడిలో బాలుడికి ఒళ్లంతా గాయాలు కావడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎర్రబల్లెకు చెందిన ముల్లా జమాల్‌వల్లి బేల్దార్ పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. అతని కుమారుడు ముజమ్మిల్ మూడో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో అతను ఇంటి వద్దనే ఉన్నాడు. బాలుడ్ని కుటుంబ సభ్యులు దండించడంతో అతను ఇంట్లో నుంచి పరుగెత్తుకుంటూ బయటికి వచ్చాడు. చాలా సేపు ఏడుస్తూ ఇంటి బయట నిలుచున్నాడు. ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని కొత్తపల్లె గ్రామంలో బాలుడి అవ్వా తాతలు ఉన్నారు. వారి వద్దకు వెళ్లేందుకు ముజమ్మిల్ నడుచుకుంటూ బయలుదేరాడు. చుట్టుముట్టిన ఐదు కుక్కలు.. ఎర్రబల్లె గ్రామ శివారులోకి రాగానే ఐదు కుక్కలు బాలుడ్ని చుట్టు ముట్టాయి. భయ పడిన ముజమ్మిల్ పరుగులు తీశాడు. అయినప్పటికీ కుక్కలు వదలకుండా వెంబడించాయి. కొద్ది దూరం పరుగెత్తిన బాలుడు తర్వాత అలసిపోయి కింద పడిపోయాడు. ఐదు కుక్కలు ఒక్కసారిగా బాలుడిని కరిచాయి. అదే దారి వెంట వెళ్తున్న వంశీ అనే బాలుడు పడిపోయిన ముజమ్మిల్‌ను చూసి దగ్గరికి వెళ్లబోయాడు. ఓ కుక్క వంశీని కూడా వెంటాడింది. దీంతో వంశీ గ్రామంలోకి వెళ్లి వరప్రసాద్, వీరయ్య అనే వ్యక్తులకు పిలుచుకొని వచ్చాడు. వారు వచ్చే సరికి బాలుడు తీవ్ర రక్త గాయాలతో పడిపోయి ఉన్నాడు. వరప్రసాద్, వీరయ్యలు వెంటనే మోటర్ బైక్‌లో బాలుడ్ని ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకొని వచ్చారు. ఒళ్లంతా కుక్క కాట్లు ఉండటమేగాక పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వైద్యుడి సూచన మేరకు కడప రిమ్స్‌కు తరలించారు. బాలుడ్ని చూడటానికి ఎర్రబల్లె గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. గ్రామంలో కుక్కల బెడద.. ఎర్రబల్లె గ్రామంలో కుక్కలు ఎక్కువగా ఉండటంతో చిన్న పిల్లలు బయటికి రావాలంటేనే భయ పడుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. పాఠశాల, దుకాణాలకు వెళ్లాలంటే పిల్లలు ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి ఉందని అంటున్నారు. పంచాయతీ అధికారులు చర్యలు తీసుకొని కుక్కల బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని.. పాదచారులు, వాహనదారులను కుక్కలు వెంటాడి మరీ కరుస్తున్నాయని పత్రికల్లో అనేక కథనాలు వచ్చినా అధికారుల్లో చలనం లే దు. ఆ కుక్కల్ని చంపమని ఎవరూ అడగలేదు.. వాటిని తీసుకెళ్లి ఏ అడవిలోనో.. జన సంచారం లేని ప్రాంతంలోనో వదిలేసి రమ్మని వేడుకుంటున్నా ఆలకించే నాథుడు కరువయ్యాడు. పగటిపూట ఒక ఎత్తయితే రాత్రి సమయాల్లో ద్విచక్రవాహనాల్లో వెళ్లే వారిని కుక్కలు వెంటపడుతుండటంతో వాటి నుంచి తప్పించుకునేందుకు వాహనాన్ని వేగంగా నడిపి అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడిన వారు ఎంతో మంది ఉన్నారు. కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, రైల్వేకోడూరు, జమ్మలమడుగు ఇలా ప్రతి చోటా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కకాటుకు గురైన వారికి చికిత్స చేసేందుకు అవసరమైన మందు కూడా చాలా చోట్ల ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో లేదు. ఇకనైనా అధికారులు స్పందించి జిల్లాలో కుక్కల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
‘స్థానిక’ నగారా!
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని రెండు ఎంపీటీసీ, పది సర్పంచ్ స్థానాలతో పాటు వంద పంచాయతీ వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అనారోగ్య కారణాలతో ఇద్దరు ఎంపీటీసీలతో పాటు తొమ్మిది మంది సర్పంచ్‌లు మృతి చెందగా ఒకరు పదవికి రాజీనామా చేశారు. అలాగే వేర్వేరు కారణాలతో వంద పంచాయతీ వార్డు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఏడాదికిగా ఖాళీగా ఉన్న ఆయా స్థానాలకు ఎన్నికల సంఘం త్వరలో ఎన్నికలు నిర్వహించనుంది. త్వరలో ఎన్నికల నోటిఫికే షన్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో పంచాయతీ అధికారులు ఆయా స్థానాల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అవుతున్నారు. ఈనెల 25న ఖాళీగా ఉన్న స్థానాల్లో ఓటర్ల జాబితాను వెలువరించనున్నారు. ఎన్నికలు నిర్వహించాల్సిన రెండు ఎంపీటీసీ స్థానాలు, పది సర్పంచ్ స్థానాలతో పాటు వంద వార్డు సభ్యుల స్థానాలున్న గ్రామాల ఓటర్ల జాబితాను పంచాయతీ అధికారులు ఎన్నికల సంఘం నుంచి తీసుకుంటున్నారు. దీన్ని పరిశీలించిన అనంతరం ఈనెల 25న తుది ఓటరు జాబితాను పంచాయతీల్లో ప్రకటిస్తారు. ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో 24వ తేదీ వరకు ఓటరు సవరణ చేపట్టే అవకాశం ఉంటుంది. ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఈవీఎంల సేకరణ వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ఇద్దరు ఎంపీటీసీల మృతితో ఎన్నికలు సదాశివపేట మండలం పెద్దాపూర్ ఎంపీటీసీ రవీందర్‌యాదవ్ అనారోగ్యంతో ఐదు నెలల క్రితం మృతి చెందారు. ఇది బీసీ జనరల్ రిజర్వు స్థానం. అలాగే దుబ్బాక మండలం రాజక్కపేట ఎంపీటీసీ అక్కల లావణ్య ఆరు నెలల క్రితం మృతి చెందారు. ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పది సర్పంచ్ స్థానాలకు.. సంగారెడ్డి మండలం చింతలపల్లి సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వుకాగా అక్కడ ఎస్టీ అభ్యర్థులు లేరు. దీంతో సర్పంచ్ స్థానం ఖాళీగా ఉంది. కవలంపేట సర్పంచ్ అనంతరావు అనారోగ్యంతో మృతిచెందారు. పటాన్చెరు మండలం చిన్నకంజర్ల సర్పంచ్ మల్లేపల్లి నర్సమ్మ, కౌడిపల్లి మండలం సలాబత్పూర్ సర్పంచ్ చిన్నసాయిరెడ్డి, రాయికోడ్మండలం ఔరంగానగర్ సర్పంచ్ రాంచందర్‌గౌడ్, మునిపల్లి మండలం పొల్కంపల్లి సర్పంచ్ ఎం.అంజన్న, సదాశివపేట మండలం మద్దికుంట సర్పంచ్ బావోద్దీన్, పుల్కల్మండలం శివ్వంపేట సర్పంచ్ మిర్యాల మంజుల, సిద్దిపేట మండలం పొన్నాల సర్పంచ్ టి.ఎల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఎనిమిది మంది సర్పంచ్ల మృతితో ఖాళీగా ఉన్న ఆయా గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే న్యాల్కల్ మండలం మిర్జాపూర్(ఎన్) సర్పంచ్‌గా ఎన్నికైన శారదారెడ్డి తన పదవికి రాజీనామా చేసి జెడ్పీటీసీగా గెలుపొందారు. ఖాళీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరపనున్నారు. వంద వార్డు సభ్యుల స్థానాలకు... వేర్వేరు కారణాలతో ఖాళీగా ఉన్న వంద గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల స్థానాలకు అధికారులు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 59 పంచాయతీల పరిధిలో వంద వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికలు నిర్వహణకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. -
బదిలీల బెంగ!
ఎంపీడీవో, తహసీల్దార్లలో కలవరం తాజాగా సెక్షన్ సూపరింటెండెంట్లకూ వర్తింపు కోరుకున్న చోటకు బదిలీకి ఉన్నతస్థాయిలో లాబీయింగ్ కాసులు కురిపించే మండలాలపై ఇతర జిల్లాల అధికారుల కన్ను మరో నాలుగైదు రోజుల్లో బదిలీల పర్వానికి తె ర సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికారులకు బదిలీల బెంగ పట్టుకుంది. మూడేళ్ల పైబడి జిల్లాలో పనిచేస్తున్న పంచాయతీ, రెవెన్యూ అధికారులను కదపాలనే ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు.. వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రెండు రోజులుగా విధులకు డుమ్మా కొడుతున్న అధికారులు... మంత్రుల పేషీలు, కలెక్టరేట్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎన్నికలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్న 21మంది ఎంపీడీవోలు, తహసీల్దార్లను బదిలీ చేయడానికి జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను అటు సీసీఎల్ఏ, ఇటు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు పంపింది. దీంతో సీను ఆయా కార్యాలయాలకు మారింది. కోరుకున్న చోట పోస్టింగ్ దక్కించుకునేందుకు తహసీల్దార్లు, ఎంపీడీఓలు లాబీయింగ్ నెరుపుతున్నారు. జోన్‌లోని ఏవేని మూడు జిల్లాలను ఆప్షన్‌గా ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ నిర్దేశించింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో అనువైన మండలాల వె తుకులాటలో పడ్డారు. కమిషనరేట్ కేవలం సంబంధిత జిల్లాకు మాత్రం అధికారులను కేటాయిస్తుంది. సదరు జిల్లా కలెక్టర్ తన విచక్షణాధికారం మేరకు మండలాలకుబదిలీ చేస్తారు. ఈ క్రమంలోనే సచివాలయంలో పైరవీలకు తెరలేచింది. తమకు అనువుగా ఉండే మండలానికి వెళ్లేందుకు తమ పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో బదిలీల ప్రక్రియకు తెరపడే అవకాశమున్న నేపథ్యంలో...తహసీల్దార్లు, ఎంపీడీ వో లు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరోవైపు జిల్లాలో ‘హాట్‌సీట్’లుగా పేరున్న పోస్టులను దక్కిం చుకునేందుకు మన జిల్లాను ఆప్షన్‌గా ఎంచుకు న్న ఇత ర జిల్లాల అధికారులు లాబీయింగ్ జరుపుతున్నారు. గాడ్ఫాదర్ల సహకారంతో లాభసాటి మండలానికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కలెక్టర్ పోస్టు కోసం సచివాలయ స్థాయిలో పైరవీలు సాగుతున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడి సిఫార్సుతో సీటు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే సరూర్‌నగర్ ఆర్డీవో, శంషాబాద్, మహేశ్వరం, కీసర, మేడ్చల్ మండలాల తహసీల్దార్ల పోస్టులు మంచి రేటు పలుకుతున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుండగా.. సుదీర్ఘకాలంగా జిల్లాలో పనిచేస్తున్న ఎంపీడీవోలు తొలిసారి ఎన్నికల నేపథ్యంలో బదిలీలు అనివార్యం కావడంతో రాజధానికి చేరువలోని జిల్లాల్లో తమకు అనుకూలమైన మండలాల అన్వేషణలో పడ్డారు. కాగా, రెవెన్యూ శాఖలో పనిచేసే సెక్షన్ ఆఫీసర్లను కూడా బదిలీ చేయాలని ఈసీ నిర్దేశించడంతో ఆయా సెక్షన్ల సూపరింటెండెంట్లు లబోదిబోమంటున్నారు. తమను బదిలీల నుంచి మినహాయించేలా ఈసీకి విన్నవించాలని శనివారం జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్‌ను కలిసి వేడుకున్నారు. ఒకవేళ బదిలీలు అనివార్యమైతే తహసీల్దార్లతో పాటే తమను కూడా ట్రాన్స్ఫర్ చేయాలని కోరారు. ఏకకాలంలో బదిలీలు చేయకపోతే పట్టణ, అనువైన మండలాలు వారి నియామకంతో భర్తీ అవుతాయని, తమకు మారుమూల మండలాలే మిగులుతాయనే ఆవేదనను వ్యక్తం చేశారు. ఏది ఏమైనా అధికారయంత్రాంగానికి బదిలీల జ్వరం పట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బదిలీలు తప్పవని తెలిసినప్పటికీ,ఈ సారి ఈసీ మార్గదర్శకాలు కఠినంగా ఉండడం.. కొత్త అధికారులకు వర్తింపజేయడమే యం త్రాంగంలో కలవరానికి దారితీసిందని చెప్పవచ్చు. -
పల్లె ఖజానాఖాళీ
ఇందూరు, న్యూస్‌లైన్: పల్లెసీమల అభివృద్ధికి మూలమైన గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులను సమకూర్చడంలో పంచాయతీ అధికారులు విఫలమవుతున్నారు. పంచాయతీలలో సకాలంలో పన్నులను వసూలు చేయడంలో గ్రామ కార్యదర్శులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల ఆదాయాలను లెక్కించిన ప్రభుత్వం 2013-14 సంవత్సరానికి గాను రూ. 47.24 కోట్లు పన్నుల రూపంలో వసూలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆగస్టులోగా 60 శాతం పన్నుల వసూళ్లు పూర్తికావాల ని సూచించింది. అయితే, అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో లక్ష్యం నీరుగారిపోయింది, గ్రామ కార్యదర్శులు సైతం పన్నుల వసూలును తీవ్రంగా పరిగణించడం లేదు. దీంతో ఇప్పటి వరకు రూ. 9.23 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.38.01 కోట్లు వసూలు కావాల్సి ఉంది. జిల్లాలోని 74 మేజర్ గ్రామ పంచాయతీలలోనూ పన్నులను 30 శాతం మాత్రమే వసూలు చేశారు. ఇంటి పన్ను, నల్లా బిల్లులు, మార్కెట్ సెస్సు, లెసైన్సు ఫీజు, సెల్‌టవర్ స్థలాల అద్దెలను సిబ్బంది నెలనెలా కచ్చితంగా వసూలుచేయాలి. కానీ, ఎక్కడా ఇది సక్రమంగా సాగడం లేదు. దీంతో పంచాయతీలకు నిధులు సమకూరక ప్రజలకు సౌకర్యాలు అందడం లేదని అంటున్నారు. మరోవైపు పంచాయతీ కార్యదర్శుల కొరత సైతం పన్నుల వసూళ్లకు ఆటంకంగా మారింది. జిల్లాలో 718 పంచాయతీలు ఉంటే 200 మంది కార్యదర్శులు మాత్రమే పని చేస్తున్నారు. నోటీసులు జారీ గ్రామాలలో పన్నుల వసూళ్లు కుంటుపడడంతో అధికారులు స్పందించారు. బకాయి పడిన రూ.38.01 కోట్ల పన్నులను రాబట్టేందుకు చర్యలు చేపట్టారు. బకాయిలు చెల్లించని వారికి డిమాండ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. దీంతో కార్యదర్శులు పన్ను బకాయి దారులకు నోటీసులు జారీ చేయడం మొదలు పెట్టారు. గడువులోగా బకాయిలును చెల్లించకుంటే చట్టపరమైన తీసుకుంటామని హెచ్చరికలు చేస్తున్నారు. రాష్ట్ర అధికారులు కూడా జిల్లాలో పన్నుల వసూలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రేక్షక పాత్ర గ్రామ పంచాయతీ కార్యదర్శులు డీఎల్పీఓలు, ఈఓపీఆర్డీల ఆధీనంలో పని చేస్తారు. వీరు కార్యదర్శులకు పన్ను వసూళ్ల విషయంలో ఏనాడు సమావేశాలు నిర్వ హించి మార్గదర్శకాలు జారీ చేసిన సందర్భాలు లేవని సంబంధితలే వర్గాలు పేర్కొంటున్నాయి. చర్యలు తీసుకుంటున్నాం.. -సురేశ్‌బాబు, జిల్లా పంచాయతీ అధికారి జిల్లాలో బకాయి పడిన పన్నులను రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. లక్ష్యం మేరకు 38.01 కోట్లు వసూలు చేయాలని జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులను ఆదే శించాం. పన్నులు కట్టని వారికి నోటీసులు ఇవ్వాలని సూచించాం.