సాక్షి, సంగారెడ్డి : జిల్లాలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని రెండు ఎంపీటీసీ, పది సర్పంచ్ స్థానాలతో పాటు వంద పంచాయతీ వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అనారోగ్య కారణాలతో ఇద్దరు ఎంపీటీసీలతో పాటు తొమ్మిది మంది సర్పంచ్‌లు మృతి చెందగా ఒకరు పదవికి రాజీనామా చేశారు. అలాగే వేర్వేరు కారణాలతో వంద పంచాయతీ వార్డు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఏడాదికిగా ఖాళీగా ఉన్న ఆయా స్థానాలకు ఎన్నికల సంఘం త్వరలో ఎన్నికలు నిర్వహించనుంది. త్వరలో ఎన్నికల నోటిఫికే షన్ వెలువడే అవకాశం ఉంది.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో పంచాయతీ అధికారులు ఆయా స్థానాల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అవుతున్నారు. ఈనెల 25న ఖాళీగా ఉన్న స్థానాల్లో ఓటర్ల జాబితాను వెలువరించనున్నారు. ఎన్నికలు నిర్వహించాల్సిన రెండు ఎంపీటీసీ స్థానాలు, పది సర్పంచ్ స్థానాలతో పాటు వంద వార్డు సభ్యుల స్థానాలున్న గ్రామాల ఓటర్ల జాబితాను పంచాయతీ అధికారులు ఎన్నికల సంఘం నుంచి తీసుకుంటున్నారు.
దీన్ని పరిశీలించిన అనంతరం ఈనెల 25న తుది ఓటరు జాబితాను పంచాయతీల్లో ప్రకటిస్తారు. ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో 24వ తేదీ వరకు ఓటరు సవరణ చేపట్టే అవకాశం ఉంటుంది. ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఈవీఎంల సేకరణ వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించారు.
ఇద్దరు ఎంపీటీసీల మృతితో ఎన్నికలు
సదాశివపేట మండలం పెద్దాపూర్ ఎంపీటీసీ రవీందర్‌యాదవ్ అనారోగ్యంతో ఐదు నెలల క్రితం మృతి చెందారు. ఇది బీసీ జనరల్ రిజర్వు స్థానం. అలాగే దుబ్బాక మండలం రాజక్కపేట ఎంపీటీసీ అక్కల లావణ్య ఆరు నెలల క్రితం మృతి చెందారు. ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
పది సర్పంచ్ స్థానాలకు..
సంగారెడ్డి మండలం చింతలపల్లి సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వుకాగా అక్కడ ఎస్టీ అభ్యర్థులు లేరు. దీంతో సర్పంచ్ స్థానం ఖాళీగా ఉంది. కవలంపేట సర్పంచ్ అనంతరావు అనారోగ్యంతో మృతిచెందారు. పటాన్‌చెరు మండలం చిన్నకంజర్ల సర్పంచ్ మల్లేపల్లి నర్సమ్మ, కౌడిపల్లి మండలం సలాబత్‌పూర్ సర్పంచ్ చిన్నసాయిరెడ్డి, రాయికోడ్‌మండలం ఔరంగానగర్ సర్పంచ్ రాంచందర్‌గౌడ్, మునిపల్లి మండలం పొల్కంపల్లి సర్పంచ్ ఎం.అంజన్న, సదాశివపేట మండలం మద్దికుంట సర్పంచ్ బావోద్దీన్, పుల్కల్‌మండలం శివ్వంపేట సర్పంచ్ మిర్యాల మంజుల, సిద్దిపేట మండలం పొన్నాల సర్పంచ్ టి.ఎల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
ఎనిమిది మంది సర్పంచ్‌ల మృతితో ఖాళీగా ఉన్న ఆయా గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే న్యాల్‌కల్ మండలం మిర్జాపూర్(ఎన్) సర్పంచ్‌గా ఎన్నికైన శారదారెడ్డి తన పదవికి రాజీనామా చేసి జెడ్పీటీసీగా గెలుపొందారు. ఖాళీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరపనున్నారు.
వంద వార్డు సభ్యుల స్థానాలకు...
వేర్వేరు కారణాలతో ఖాళీగా ఉన్న వంద గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల స్థానాలకు అధికారులు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 59 పంచాయతీల పరిధిలో వంద వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికలు నిర్వహణకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది.
‘స్థానిక’ నగారా!
Published Fri, May 15 2015 11:34 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
Advertisement
Advertisement