బదిలీల బెంగ! | transfer order to officers | Sakshi
Sakshi News home page

బదిలీల బెంగ!

Published Sat, Feb 1 2014 11:33 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

transfer order to officers

 ఎంపీడీవో, తహసీల్దార్లలో కలవరం తాజాగా సెక్షన్ సూపరింటెండెంట్లకూ వర్తింపు కోరుకున్న చోటకు బదిలీకి ఉన్నతస్థాయిలో లాబీయింగ్ కాసులు కురిపించే మండలాలపై ఇతర జిల్లాల అధికారుల కన్ను
 మరో నాలుగైదు రోజుల్లో బదిలీల పర్వానికి తె ర
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
 అధికారులకు బదిలీల బెంగ పట్టుకుంది. మూడేళ్ల పైబడి జిల్లాలో పనిచేస్తున్న పంచాయతీ, రెవెన్యూ అధికారులను కదపాలనే ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు.. వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రెండు రోజులుగా విధులకు డుమ్మా కొడుతున్న అధికారులు... మంత్రుల పేషీలు, కలెక్టరేట్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎన్నికలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్న 21మంది ఎంపీడీవోలు, తహసీల్దార్లను బదిలీ చేయడానికి జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను అటు సీసీఎల్‌ఏ, ఇటు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు పంపింది. దీంతో సీను ఆయా కార్యాలయాలకు మారింది. కోరుకున్న చోట పోస్టింగ్ దక్కించుకునేందుకు తహసీల్దార్లు, ఎంపీడీఓలు లాబీయింగ్ నెరుపుతున్నారు. జోన్‌లోని ఏవేని మూడు జిల్లాలను ఆప్షన్‌గా ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ నిర్దేశించింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో అనువైన మండలాల వె తుకులాటలో పడ్డారు. కమిషనరేట్ కేవలం సంబంధిత జిల్లాకు మాత్రం అధికారులను కేటాయిస్తుంది. సదరు జిల్లా  కలెక్టర్ తన విచక్షణాధికారం మేరకు మండలాలకుబదిలీ చేస్తారు. ఈ క్రమంలోనే సచివాలయంలో పైరవీలకు తెరలేచింది. తమకు అనువుగా ఉండే మండలానికి వెళ్లేందుకు తమ పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో బదిలీల ప్రక్రియకు తెరపడే అవకాశమున్న నేపథ్యంలో...తహసీల్దార్లు, ఎంపీడీ వో లు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరోవైపు జిల్లాలో ‘హాట్‌సీట్’లుగా పేరున్న పోస్టులను దక్కిం చుకునేందుకు మన జిల్లాను ఆప్షన్‌గా ఎంచుకు న్న ఇత ర జిల్లాల అధికారులు లాబీయింగ్ జరుపుతున్నారు. గాడ్‌ఫాదర్‌ల సహకారంతో లాభసాటి మండలానికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కలెక్టర్ పోస్టు కోసం సచివాలయ స్థాయిలో పైరవీలు సాగుతున్నాయి.
 
 నల్లగొండ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడి సిఫార్సుతో సీటు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే సరూర్‌నగర్ ఆర్డీవో, శంషాబాద్, మహేశ్వరం, కీసర, మేడ్చల్ మండలాల  తహసీల్దార్ల పోస్టులు మంచి రేటు పలుకుతున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుండగా.. సుదీర్ఘకాలంగా జిల్లాలో పనిచేస్తున్న ఎంపీడీవోలు తొలిసారి ఎన్నికల నేపథ్యంలో బదిలీలు అనివార్యం కావడంతో రాజధానికి చేరువలోని జిల్లాల్లో తమకు అనుకూలమైన మండలాల అన్వేషణలో పడ్డారు. కాగా, రెవెన్యూ శాఖలో పనిచేసే సెక్షన్ ఆఫీసర్లను కూడా బదిలీ చేయాలని ఈసీ నిర్దేశించడంతో ఆయా సెక్షన్ల సూపరింటెండెంట్లు లబోదిబోమంటున్నారు. తమను బదిలీల నుంచి మినహాయించేలా ఈసీకి  విన్నవించాలని శనివారం జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్‌ను కలిసి వేడుకున్నారు. ఒకవేళ బదిలీలు అనివార్యమైతే తహసీల్దార్లతో పాటే తమను కూడా ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరారు. ఏకకాలంలో బదిలీలు చేయకపోతే పట్టణ, అనువైన మండలాలు వారి నియామకంతో భర్తీ అవుతాయని, తమకు మారుమూల మండలాలే మిగులుతాయనే ఆవేదనను వ్యక్తం చేశారు.
 
 ఏది ఏమైనా అధికారయంత్రాంగానికి బదిలీల జ్వరం పట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బదిలీలు తప్పవని తెలిసినప్పటికీ,ఈ సారి ఈసీ మార్గదర్శకాలు కఠినంగా ఉండడం.. కొత్త అధికారులకు వర్తింపజేయడమే యం త్రాంగంలో కలవరానికి దారితీసిందని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement