అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
- నిజాంపేట, భండారి లేఔట్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత మొదలు
- హెచ్‌ఎండీఏ పరిధిలో 1,750 అక్రమ నిర్మాణాలున్నట్టుగా గుర్తింపు
- ఇప్పటికే అందరికీ నోటీసులు జారీ.. దశలవారీగా కూల్చివేత షురూ
- నాలుగు రోజుల్లో 252 భవనాలు, 43 లేఔట్ల కూల్చివేత
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలు, అనధికారిక లేఔట్లపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎం డీఏ) ఉక్కుపాదం మోపుతోంది. నెలరోజుల క్రితం నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి 15 రోజుల పాటు ముంపులో చిక్కుకున్న నిజాంపేటలోని బండారి లేఔట్‌లోని అక్రమ నిర్మాణాలను హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూకటివేళ్లతో పెకిలిస్తున్నారు. తొలుత నాలా పరీవాహక ప్రాంతాల్లోని ఐదు అంతస్తుల ఏడు భవనాలు, 20 గేటెడ్ కమ్యూనిటీ విల్లాలను మంగళవారం కూల్చివేశారు. మరో 20 రోజుల్లో ఇక్కడ ఉన్న వందకుపైగా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని అధికారులు చెబుతున్నారు.
252 భవనాలు, 43 లేఔట్ల కూల్చివేత..
పటాన్‌చెరువు మండలం కిష్టారెడ్డిపేట గ్రామం, మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామం, అబ్దుల్లాపూర్‌మెట్, ఘట్‌కేసర్ మండలంలోని కొర్రెముల, పోచారం, నిజాంపేట, బడంగ్‌పేట్, ఇబ్రహీంపట్నంలోని 42 అక్రమ నిర్మాణాలు, 11 అనధికారిక లేఔట్లను అధికారులు కూల్చివేశారు. స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతున్నా పోలీసుల సహకారంతో జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలను హెచ్‌ఎండీఏ సిబ్బంది కూల్చివేస్తోంది. నెలరోజుల స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకూ నాలుగు రోజుల్లో 252 భవనాలు, 43 లేఔట్‌ల నిర్మాణాలను ధ్వంసం చేశారు. శని, ఆది, సోమవారాలు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో తాత్కాలికంగా విరామం ఇచ్చినా, మంగళవారం నుంచి మళ్లీ స్పెషల్ డ్రైవ్ మొదలుకావడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
హెచ్‌ఎండీఏ పరిధిలో 1,759 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టుగా గుర్తించి.. వారందరికీ హెచ్‌ఎండీఏ నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఇవ్వకున్నా.. అపార్ట్‌మెంట్‌కు వచ్చి తనిఖీలు చేసే సమయంలో అనుమతులు లేవని తెలిసినా కూల్చివేసే ఆస్కారముంది. దీంతో అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆదిబట్ల, కుందుకూరు, పెద్దఅంబర్‌పేట, బాచుపల్లి, బీబీనగర్, అన్నంపట్ల, బ్రాహ్మణపల్లి, చెంగిచెర్ల, ఇబ్రహీంపట్నం, కొత్తూరు, ప్రగతినగర్, తూప్రాన్, కేతిరెడ్డి పల్లి, భూదాన్ పోచంపల్లిలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. గ్రామ పంచాయతీ అనుమతి పేరిట వెలసిన పటాన్‌చెరువు, అమీన్‌పూర్, ఘట్‌కేసర్, మొయినాబాద్, చిలుకూరు, ప్రగతినగర్, బాచుపల్లిల్లో అక్రమ నిర్మాణాలపై సైతం కొరడా ఝళిపించారు.
స్థానికుల నుంచి ఫిర్యాదులు..
వరద ముంపునకు గురైన బండారి లేఔట్‌లో మళ్లీ అక్రమ నిర్మాణాలు ఊపందుకోవడం.. దీనిపై పంచాయతీ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం.. ఈ నేపథ్యంలో స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో నిజాంపేటలోని అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండీఏ దృష్టి కేంద్రీకరించింది. నిజాంపేటలోని శ్రీనివాస్‌నగర్‌లో 12 విల్లాలను అధికారులు కూల్చివేశారు. అయితే ప్రతి అపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లి అనుమతులు తనిఖీ చేసి, నోటీసు ఇవ్వకున్నా కూల్చివేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.