కూల్చివేతలు కొనసాగిస్తాం
మణికొండ: హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమనిర్మాణాలు, లేఅవుట్‌ల కూల్చివేతలు కొనసాగిస్తామని టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మణికొండ పంచాయతీ పరిధిలోని సెక్రటేరియట్‌కాలనీ, పంచవటి కాలనీల్లో రెండు భవనాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, నిబంధనలను పాటించని భవనాలను ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తీసుకున్న అనుమతుల మేరకే భవనాలను నిర్మించుకోవాలని భవన నిర్మాణదారులకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటశివయ్య, బిల్‌కలెక్టర్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.
అడ్డుకునేందుకు విఫలయత్నం...
సెక్రటేరియట్ కాలనీలో జీప్లస్‌టు అంతస్తులకు అనుమతులు తీసుకుని మూడు అంతస్తుల నిర్మాణాన్ని కొనసాగిస్తున్న భవన నిర్మాణదారులు కూల్చివేతలకు వెళ్లిన అధికారులను అడ్డుకున్నారు. అధికారులు డబ్బులు ఆశించే కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పంచాయతీకి చెందిన ఓ వార్డుసభ్యునికి ఇప్పటికే రూ.3 లక్షలు ఇచ్చామని, ఇపుడు అతను ఫోన్ ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిని చుట్టముట్టడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సికింద్రాబాద్ ప్రాంతంలోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గురువారం అధికారులు పార్క్‌లేన్‌లో పురాతన భవనాన్ని కూల్చివేశారు.
జేఎన్‌టీయూ బృందం పరిశీలన
రాయదుర్గం: నానక్‌రాంగూడలో కుప్పకూలిన భవన నిర్మాణ స్థలాన్ని జేఎన్‌టీయూ ప్రొఫెసర్ల బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు పిల్లర్లను తవ్వి వాటికి ఉపయోగించిన సిమెంట్, ఇసుకల మిశ్రమాన్ని, భూమిని, ఇతర నిర్మాణ పనులను పరిశీలించారు. భవన నిర్మాణ నాణ్యతపై విచారణకు ప్రభుత్వం జేఎన్‌టీయూ ప్రొఫెసర్ రమణారావు ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక సారి ఈ స్థలాన్ని పరిశీలించిన అధికారులు మరోసారి ఆధారాలను సేకరించారు.