అనుమతి లేకపోతే... కూల్చివేతే! | without Permission If not ... Demolition! | Sakshi
Sakshi News home page

అనుమతి లేకపోతే... కూల్చివేతే!

Published Mon, Oct 12 2015 2:13 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

అనుమతి లేకపోతే... కూల్చివేతే! - Sakshi

అనుమతి లేకపోతే... కూల్చివేతే!

అక్రమ నిర్మాణాలపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే అక్రమ లేఅవుట్లను భూస్థాపితం చేస్తున్న పంచాయతీ శాఖ.. తాజాగా అనుమతిలేని కట్టడాలపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటెన్ డెవలప్‌మెంట్ అథారిటీ) పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే 289 నిర్మాణ సంస్థలు, కంపెనీలకు తాఖీదులిచ్చింది. రెండువారాల్లో సంజాయిషీ ఇవ్వకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. వీటిని పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఆయా సంస్థలకు నేరుగా లేదా రిజిస్టర్ పోస్టుల ద్వారా పంపించాలని కలెక్టర్ ఆదేశించారు.
 
అక్రమ కట్టడాలపై చర్యలకు యంత్రాంగం నిర్ణయం
* 289 నిర్మాణ సంస్థలకు నోటీసులు జారీ
* రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ
* లేకుంటే కూల్చివేతలు తప్పవని హెచ్చరిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో 23 మండలాల్లో హెచ్‌ఎండీఏ పరిధి ఉంది. ఈ మండలాల పరిధిలో నిర్మాణ అనుమతులు హెచ్‌ఎండీఏ నుంచి తీసుకోవాల్సి ఉంది. జీ ప్లస్-1 వరకు గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకున్నప్పటికీ.. ఆపైన నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ అనుమతి తప్పనిసరి. అయితే పలు నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండానే వె లిశాయి.

అటు పంచాయతీ, ఇటు హెచ్‌ఎండీఏ అనుమతులు తీసుకోకుండానే బహుల అంతస్థులు కట్టుకోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. ఇలాంటి నిర్మాణాలు ఎక్కువగా శంషాబాద్, మేడ్చల్, ఘట్‌కేసర్, శంకర్‌పల్లి జోన్‌ల పరిధిలో ఉన్నాయి. ఇందులో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా గృహ నిర్మాణ సముదాయాలు చేపట్టాయి. వీటిలో గుర్తించిన అక్రమ నిర్మాణాల్లో 289 నిర్మాణాలకు సంబంధించి పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

గతంలోనూ వీరికి హెచ్‌ఎండీఏ అధికారులు నోటీసులిచ్చారు. అయితే వాటిపై ఎలాంటి స్పందన లేకపోవడం.. తాజాగా అక్రమ లేఅవుట్ల వ్యవహారాన్ని తిరగతోడుతున్న నేపథ్యంలో కలెక్టర్ ప్రస్తుతం నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నోటీసుల ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన నిర్ణయించారు.
 
గడువు దాటితే ‘కూల్చివేతే’..
అనుమతిలేని నిర్మాణాలకు సంబంధించిన ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసిన పంచాయతీ శాఖ.. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. ఇందులో కొందరు అనుమతులున్నట్లు చెబుతుండడంతో ఆయా అనుమతి పత్రాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా అక్రమ లేఅవుట్లలో గృహ సముదాయాలు నిర్మించిన సంస్థలపై పంచాయతీ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది.

లేఅవుట్లలో రోడ్లు, మరుగు వ్యవస్థ, లైటింగ్ సదుపాయాలు, అందుకు ఆయా శాఖ అనుమతులు కూడా సమర్పించాలంటూ నియమం పెట్టింది. మొత్తంగా రెండు వారాల్లో సంస్థలు సంతృప్తికరమైన వివరణ ఇవ్వకుంటే కూల్చివేతకు వెనకాడేది లేదని పంచాయతీ శాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement