సాక్షి, సిటీబ్యూరో: అక్రమ కట్టడాల కథ కంచికి చేరకుండానే తిరిగి మొదటికొచ్చింది. హెచ్‌ఎండీఏతో పాటు వివిధ విభాగాల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టి అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా.. భవన యజమానులు తిరిగి నిర్మిస్తున్నారు. చాలాచోట్ల స్థానిక నేతల అండదండలతో అక్రమ భవనాల పునర్నిర్మాణం యథావిధిగా కొనసాగుతోంది. కూల్చివేసిన చోట మరోసారి నిర్మాణం చేపట్టకుండా హెచ్‌ఎండీఏ నిఘా ఏర్పాటు చేసినప్పటికీ అక్రమాలు ఎక్కడా ఆగడం లేదు.
ఒక్క దుండిగల్‌లోనే మున్సిపల్ అధికారులు అక్రమ భవనాలను ఏకంగా మూడుసార్లు కూల్చివేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. దుండిగల్‌తో పాటు శంకర్‌పల్లి, ఘట్కేసర్, మేడ్చల్, శంషాబాద్ జోన్‌లలోని పలు ప్రాంతాల్లో ఇదే తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు చివరికి చేతులెత్తేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రహసనంగా కూల్చివేతలు..
హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టిన అధికారులు నెల రోజుల వ్యవధిలో 202 అక్రమ భవనాలను గుర్తించి కూల్చివేశారు. వీటిలో చాలా వరకు 600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించివే. గ్రామ పంచాయతీల్లో జీ+2 భవనాల కోసం అనుమతులు తీసుకొని అయిదారు అంతస్తుల వరకు అపార్ట్‌మెంట్లను నిర్మించారు. కొన్ని చోట్ల గోడౌన్‌లను ఏర్పాటు చేశారు. అధికారులు ఇలాంటి వాటిని గుర్తించారు. వీటిని కూల్చివేయించారు.
వేల సంఖ్యలోనే అక్రమాలు..
నగరం చుట్టు శివారు ప్రాంతాల్లో వేలాదిగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. రెండంతస్తుల కంటే ఎక్కువగా అపార్ట్‌మెంట్‌లు నిర్మించేందుకు టీఎస్‌బీ పాస్ నుంచి చట్టబద్ధమైన అనుమతులు తీసుకోవాలి. ఔటర్ రింగురోడ్డుకు అన్ని వైపులా విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం పారదర్శకమైన అనుమతులను అందుబాటులోకి తెచ్చింది. కానీ చాలామంది నిర్మాణదారులు నిబంధనలను ఉల్లంఘించి గ్రామ పంచాయతీల అనుమతులతోనే బహుళ అంతస్తులు చేపట్టారు. (క్లిక్: బన్సీలాల్‌పేట్ కోనేరు బావిపై మోదీ ప్రశంసలు)
► దుండిగల్, నిజాంపేట్, శంకర్‌పల్లి, మేడ్చల్, పోచారం, బడంగ్‌పేట్, తుర్కయంజాల్ తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా కొనసాగాయి. ప్రత్యేకంగా కోవిడ్ కాలంలో రెండేళ్లుగా ఇలాంటి అక్రమ భవనాలను ఎక్కువగా నిర్మించినట్లు అధికారులు అంచనా వేశారు. మరోవైపు తాము చేపట్టిన కూల్చివేతల కారణంగా కొత్తగా భవనాలను నిర్మించేవాళ్లు మాత్రం నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నారని, ఈ మేరకు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఫలితాన్నిచ్చాయని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. (క్లిక్: నల్సార్ సాహసోపేతమైన నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment