కూల్చి‘వెత’లెన్నో! | HMDA Targets Illegal Constructions in Hyderabad | Sakshi
Sakshi News home page

కూల్చి‘వెత’లెన్నో!

Published Wed, May 22 2019 10:34 AM | Last Updated on Wed, May 22 2019 10:34 AM

HMDA Targets Illegal Constructions in Hyderabad - Sakshi

నందిగామ మండలం బందోనిగూడ గ్రామంలో అక్రమ లేఅవుట్‌ను తొలగిస్తున్న సిబ్బంది

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చేపట్టిన అక్రమ లేఔట్ల కూల్చివేతలపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూల్చివేతల ప్రక్రియ అధికారులకు కత్తిమీదసాములా మారింది. సోమవారం నుంచి దాదాపు పదిరోజుల పాటు జరగనున్న ఈ డ్రైవ్‌లో ఇప్పటికే గుర్తించిన దాదాపు 713 అక్రమ లేఅవుట్‌లలో 500కుపైగా కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఘట్‌కేసర్, మేడ్చల్, శంషాబాద్, శంకర్‌పల్లి జోన్‌లలోని ప్లానింగ్‌అధికారులు దగ్గరుండి మరీ కూల్చివేతలను పర్యవేక్షిస్తున్నారు. హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది, స్థానిక పోలీసుల సహకారంతో జేసీబీ యంత్రాలతో అక్రమ లేఅవుట్‌లను కూల్చివేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ప్లానింగ్‌ అధికారులను అక్కడి ప్లాట్ల కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక వారు కంగుతింటున్నారు. 

కొన్నింటిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని...
పటాన్‌చెరు ప్రాంతంలో అధికారులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. అక్కడికి జేసీబీ యంత్రాలతో కూల్చేందుకు వెళ్లిన కిందిస్థాయి ప్లానింగ్‌ అధికారులను స్థానికులు నిలదీశారు. మా లేఔట్‌ అక్రమమని కూల్చివేస్తున్న మీరు...పక్కనే ఉన్న వాటిని ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై వారు సమాధానం చెప్పలేకపోయారు. చివరకు పోలీసుల సహయంతో ఇక్కడ లేవుట్‌ను కూల్చివేశారు. అలాగే ఒట్టినాగులపల్లిలో అక్రమ లేఅవుట్‌ల విషయంలో భారీగా డబ్బులు చేతులు మారాయని, కిందిస్థాయి ప్లానింగ్‌ అధికారుల ఆమ్యామ్యాలతో వాటిని అసలు లెక్కలోకే తీసుకోలేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. మేడ్చల్, ఘట్‌కేసర్‌ జోన్‌లలోనూ ఇదే పరిస్థితి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఒక ప్రాంతంలో భారీగా అక్రమ లేఅవుట్‌లు ఉంటే రెండు, మూడింటిని మాత్రమే కూల్చి మిగతావారిని దారిలోకి తెచ్చుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. హెచ్‌ఎండీఏకు ఆదాయం తెచ్చి పెట్టే ఉద్దేశంతో కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ ఆదేశాలతో మొదలైన స్పెషల్‌ డ్రైవ్‌ కాస్తా  కొంతమంది అసిస్టెంట్‌ ప్లానింగ్‌ అధికారులు, జూనియర్‌ ప్లానింగ్‌ అధికారులకు వరంగా మారిందని హెచ్‌ఎండీఏ వర్గాల్లోనే వినిపిస్తోంది. 

తూతూ మంత్రంగా...
అక్రమ లేఅవుట్‌లపై కొరడా ఝుళిపిస్తామని చెబుతున్న హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ అధికారులు కొందరు తూతూమంత్రంగానే తొలగిస్తున్నారు. అక్కడి రియల్టర్లతో కుమ్మక్కై ఆ లేఅవుట్‌లో ఉన్న సర్వే నంబర్లు కూడా బయటకు పొక్కనీయడం లేదు. ‘మరో నాలుగు రోజుల తర్వాత మీ పని మీరు మళ్లీ మొదలెట్టండి, ఎవరైనా వచ్చి చూసేది ఉందా..’ అని శంకర్‌పల్లి జోన్‌లోని ఓ అసిస్టెంట్‌ ప్లానింగ్‌ అధికారి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి ఇక్కడ అవినీతి రాజ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ప్లానింగ్‌ అధికారులు వ్యవహరిస్తున్న తీరు హెచ్‌ఎండీఏకే చెడ్డపేరు తెచ్చేలా ఉందని లోలోన మథనపడుతున్నారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ పూర్తిస్థాయిలో దృష్టి పెడితే దారి తప్పుతున్న అధికారులు దారిలోకి వస్తారని డిమాండ్‌ చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement