ఇల్లు లేకున్నా మరుగుదొడ్డి నిర్మించుకుంది
శెభాష్.. పోశవ్వ
సిరిసిల్ల రూరల్: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆరెపల్లి పోశవ్వ(68) ఇల్లు లేకున్నా మరుగుదొడ్డి నిర్మించుకుని గ్రామస్తులందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ గ్రామాన్ని గ్రామజ్యోతి కార్యక్రమంలో సిరిసిల్ల పోలీసులు దత్తత తీసుకున్నారు. గురువారం ఊళ్లో గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే అందరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని డీఎస్పీ దామెర నర్సయ్య ప్రజలకు సూచించారు.
కానీ, గ్రామంలో ఇప్పటికే 80 శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని చాలామంది వాటిని ఉపయోగించడం లేదు. మళ్లీ బహిరంగా మూత్ర, మల విసర్జనకే మొగ్గుచూపుతున్నారు. కొంతమంది ఆర్థికంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు మోహం చాటేశారు. కానీ ఇదే గ్రామంలో ఆరెపల్లి పోశవ్వ(68) మాత్రం లక్ష్మీపూర్ గ్రామానికి ఆదర్శంగా నిలిచింది.
ఉండటానికి ఇల్లు లేకున్నా... తన రెక్కల కష్టంతో మంచి నాణ్యతతో మరుగుదొడ్డి నిర్మించుకుంది. ఇద్దరు కొడుకులు పొట్టకూటి కోసం ముంబయ్ వెళ్లగా ఒక్క తే ఓ చిన్న గుడిసెలో ఉంటోంది. ఈ విషయం డీఎస్పీ దామెర నర్సయ్య, సీఐ విజయ్‌కుమార్ దృష్టికి రావడంతో ఇంటికి వెళ్లి పోశవ్వ మరుగుదొడ్డిని పరిశీలించి ఆమెను అభినందించారు.