బాధ్యతతో పనిచేద్దాం | Working with responsibility | Sakshi
Sakshi News home page

బాధ్యతతో పనిచేద్దాం

Published Mon, Aug 17 2015 2:02 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

బాధ్యతతో పనిచేద్దాం - Sakshi

బాధ్యతతో పనిచేద్దాం

అందుబాటులో నిధులున్నా పనులు మాత్రం జరగడం లేదు. కొన్ని పంచాయతీలకు ఆదాయం బాగా ఉన్నా.. వాటి వినియోగం సక్రమంగా లేకపోవడంతో కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో మురుగుతుండగా.. ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. వీటన్నింటినీ అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామజ్యోతి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
 
- గ్రామజ్యోతి అవగాహన సదస్సులో మంత్రి మహేందర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా:
క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని, ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా బాధ్యతతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా పరిషత్‌లో చైర్‌పర్సన్ సునీతారెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామజ్యోతి అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. సోమవారం నుంచి వరుసగా పదిరోజుల పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తారన్నారు.  
 
అభివృద్ధిపై రాజకీయాలెందుకు..?
గ్రామాల అభివృద్ధి విషయంలో రాజకీయాలు వద్దని మంత్రి మహేందర్‌రెడ్డి హితవు పలికారు. ఆదివారం నాటి గ్రామజ్యోతి అవగాహన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు గైర్హాజరయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. అభివృద్ధి కంటే రాజకీయాలే ఆ పార్టీ వారికి ముఖ్యమని, అందువల్లే సమావేశానికి రాలేదని పరోక్షంగా చురకలంటించారు. గ్రామజ్యోతితో పల్లెకు వస్తున్న నిధులు.. వాటి ఖర్చు.. చేపట్టే పనులు.. ఇలా సర్వస్వం ప్రజలకు తెలుస్తుందని, అవకతవకలపైన, ఆలస్యంపైనా అధికారులను నిలదీయవచ్చని అన్నారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు.

విద్యపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని, బడీడు, బడిబయటి పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. మహిళల్లో అక్ష్యరాస్యత పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా సభ్యులకు గ్రామజ్యోతి మార్గదర్శకాలకు వివరించి అవగాహన కల్పించారు. అనంతరం జెడ్పీటీసీలు అభిప్రాయాలు, సలహాలు ఇచ్చారు. చేవెళ్ల జెడ్పీటీసీ సభ్యురాలు చింపుల శైలజ మాట్లాడుతూ జిల్లాలో కూడా పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు తదితర అంశాల్లో వందశాతం ప్రగతి సాధించిన గ్రామాలున్నాయని, వాటిని గుర్తించి ప్రోత్సహించాలన్నారు. మద్యపాన నిషేదంతోనే అభివృద్ధి సాధ్యమని, కానీ ప్రభుత్వం చీప్‌లిక్కర్ తెచ్చే ప్రయత్నం చేస్తే పల్లెలు ఎలా అభివృద్ధి చెందుతాయని ప్రశ్నించారు. ఇంతలో మంత్రి కలగజేసుకోవడంతో ఆమె ప్రశ్నకు సమాధానం రాలేదు. సమావేశంలో ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, సంజీవరావు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement