‘అనుబంధం’లో ‘జ్యోతి’ లేదు!
తండాల వైపు దృష్టి సారించని యంత్రాంగం
కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన సమస్యలు
కమిటీల్లో పేర్ల వరకే పరిమితమైన అధికారులు
అభివృద్ధి పనులు ఇంకెప్పుడని ప్రశ్నిస్తున్న ప్రజలు
తాండూరు రూరల్ : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గ్రామజ్యోతి’ కార్యక్రమం అనుబంధ గ్రామాల్లో కొనసాగడంలేదు. ఎన్నాళ్లుగా తిష్టవేసిన సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని ఆశపడిన ప్రజలు నిరాశ కు గురవుతున్నారు. కమిటీల్లో పలువురి పేర్లను నామమాత్రంగా చేర్చిన నోడల్ అధికారులు ఆ పిదప పట్టించుకోవడంలేదంటున్నారు. గ్రామాలపై వివక్ష కనబరుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వారంరోజులవుతున్నా ఇటువైపు చూసిన నాథుడే కరువయ్యాడని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తాండూరు మండలంలోని 25 గ్రామ పంచాయతీల పరిధిలో గోపన్‌పల్లి, చిట్టిఘనాపూర్, గుంతబాసుపల్లి, చింతమణిపట్నం, బోంకూర్, రాంపూర్, రాంపూర్‌చిన్నతండా, పెద్దతంవీర్‌శెట్టిపల్లి, సంకిరెడ్డిపల్లి, గుండ్లమడుగుతండా, జినుగుర్తితండా, ఉద్దాండపూర్ తండాలు అనుబంధ గ్రామాలున్నాయి. ఈ నెల 17న ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి వారం రోజులవుతున్నా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు.
కాల్వల్లో మురుగు ఎక్కడికక్కడే పేరుకుపోయింది. తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయడంలేదు. పైపులైన్ల లీకేజీలతో పాటు పలు సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. అయితే.. నోడల్ అధికారులు మాత్రం అనుబంధ గ్రామాల నుంచి వార్డు సభ్యులను, మరికొందరిని గ్రామకమిటీలో చేర్చుకున్నారు. అధికారులు కమిటీలలో పేర్లు చేర్చుకోవడం వరకే పరిమితమయ్యారు. తమ గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కోరినా స్పందించడంలేదని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అనుబంధ గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
స్థానిక అధికారుల్ని ఆదేశించాం
గ్రామజ్యోతి పథకం కింద ముందుగా పంచాయతీలకు ప్రాధాన్యమిస్తున్నాం. అనుబంధ గ్రామాల్లోని వార్డు సభ్యులు, యువకులు కమిటీలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని అనుబంధ గ్రామాల్లో పనులు చేశాం. గ్రామజ్యోతి పథకం ద్వారా వచ్చిన నిధులు కూడా అనుబంధ గ్రామాలకు కేటాయించాం. ఆయా గ్రామాల్లో గ్రామజ్యోతి పనులు చేపట్టాలని స్థానిక అధికారులకు ఆదే శాలిచ్చాం.
- జయరాజ్, గ్రామజ్యోతి మండల చేంజ్ అధికారి