భేష్ | Good job of kcr | Sakshi
Sakshi News home page

భేష్

Published Sat, Aug 22 2015 3:38 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

భేష్ - Sakshi

భేష్

నేను నిన్న ఒక్క మాట చెప్పాను. అందరూ ముందుకొచ్చారు. ఎక్కడెక్కడో స్థిరపడిన గ్రామానికి చెందిన వారు

 గజ్వేల్/జగదేవ్‌పూర్ : ‘నేను నిన్న ఒక్క మాట చెప్పాను. అందరూ ముందుకొచ్చారు. ఎక్కడెక్కడో స్థిరపడిన గ్రామానికి చెందిన వారు కూడా స్పందించి ఊరి అభివృద్ధికి భూములు, పైసలు ఇస్తామంటున్నారు. ఇటువంటి ఐక్యతే కావాలి. నేను కోరుకున్నది ఇదే..’ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఎర్రవల్లి గ్రామస్తులను ప్రశంసించారు. రెండో రోజు శుక్రవారం కూడా ఆయన జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలో గ్రామజ్యోతిలో భాగంగా నిర్వహించిన శ్రమదానం పనుల్లో పాల్గొన్నారు.

పనులను తాను స్వయంగా పర్యవేక్షిస్తూ, సలహా సూచనలు ఇస్తూ సందడి సృష్టించారు. ‘ఇంతటితో ఆగేది లేదు. ఇంకా ముందుకు వెళ్దాం...’ అంటూ ఉత్సాహపరిచారు. గ్రామంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో శ్రమదానం పనుల్ని సీఎం ప్రారంభించారు. సాయంత్రం వరకు పనులు కొనసాగగా స్వయంగా పర్యవేక్షించారు. సాయంత్రం జరిగిన సభలో మాట్లాడుతూ గ్రామస్తుల స్పందనపై హర్షం వ్యక్తం చేశారు.

 గంగదేవిపల్లిని మించిపోవాలి..
 ఐదారు నెలల్లో ఎర్రవల్లి స్వరూపాన్నే మార్చేద్దామని కేసీఆర్ అన్నారు. ‘ముందుగా సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్ర మం అనుకున్నాం. అది మొదలుపెట్టి విజయం సాధిం చాం. మునుముందూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ గ్రామాన్నంతటినీ పరిశుభ్రంగా తీర్చిదిద్దుకుందాం’ అని ఆయన పిలుపునిచ్చారు. తన సొంత డబ్బులతో ఇంటిం టికీ ప్లాస్టిక్ డబ్బాలను పంపిస్తానని, వాటితో చెత్తను సేకరించాలని, వాటిలో తడి-పొడి చెత్తలను వేర్వేరుగా వేయాలని గ్రామస్తులకు సూచించారు. అంకాపూర్, గంగదేవిపల్లి గ్రామాలను ఎర్రవల్లి మించిపోవాలన్నారు. ఎర్రవ ల్లి అభివృద్ధిని చూసేందుకు అందరూ ఇక్కడికి రావాల న్నారు. గ్రామంలో పాడుబడ్డ ఇళ్లన్నిటినీ కూల్చేద్దామని, నివాసయోగ్యంగా లేని ఇళ్లనూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తే కూల్చేద్దామని సీఎం అన్నారు. ఈ క్రమం లో ఎవరికీ నష్టం జరగకుండా చూస్తామన్నారు.

 త్వరలోనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు..
 ఐదారు నెలల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టి అప్పగిస్తామని కేసీఆర్ గ్రామస్తుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రభుత్వం తరపున ప్రతి ఇంటికీ ఉచితంగా నల్లా కనెక్షన్ బిగిస్తామని చెప్పారు. ‘ఇవన్నీ అయినంక.. మల్లొక్కసారి మంచిగ దావత్ చేసుకుందాం’ అంటూ నవ్వులు పూయించారు. ఊరు స్వరూపం మారడం ఒక్క టే కాదు.. అందరూ మంచిగా బతకాలని, ఒక్కరు ఒక్క పూట కూడా పస్తు ఉండొద్దని కేసీఆర్ అన్నారు. ఇదంతా జరగాలంటే అందరికీ పని కల్పించాలని, ఇందుకోసం ఆలోచన చేస్తున్నామన్నారు. ‘నేను మీకు నిన్ననే జెప్పిన.. కచ్చితంగా ఇది జరిగి తీరతది. గ్రామంలో సంపూర్ణ పారి శుద్ధ్యం సాధించే వరకు శ్రమదానం పనులు ఆపొద్దు. నేను మళ్లీ వస్త. గ్రామాభివృద్ధికి ఎజెండా ఖరారు చేద్దాం’ అన్నారు. ఆ ఎజెండా ప్రకారమే ముందుకు వెళ్దామన్నా రు.

‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపునకు హైదరాబాద్, అమెరికాలో ఉంటున్న ఈ గ్రామస్తులు స్పందించి అభివృద్ధిలో తామూ భాగస్వాములమవుతామని ముందుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, జాయింట్ కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి, ఎంపీపీ రేణుక, జడ్పీటీసీ రాంచంద్రం, గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, ఎంపీటీసీ భాగ్యమ్మ, టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూంరెడ్డి, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, ఎర్రవల్లి గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 
 సీఎం సహపంక్తి భోజనం
  జగదేవ్‌పూర్: సీఎం అన్నమాట ప్రకారమే శుక్రవారం గ్రామస్తులతో కలిసి సహంపక్తి భోజనాలు చేశారు. ఉదయం గ్రామంలో పర్యటించిన సీఎం కేసీఆర్ మధ్యాహ్నం గ్రామస్తులతో కలిసి సహంపక్తి భోజనంలో పాల్గొన్నారు. 10 క్వింటాళ్ల బియ్యం, 7 క్వింటాళ్ల చికెన్, 3 క్వింటాళ్ల మటన్, పప్పు కూరగాయల వండారు.

   500 మంది భోజనాలు చేశారు. సీఎంతో కలిసి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ భాగ్య, ఎంపీటీసీ భాగ్యమ్మ, కలెక్టర్ రోనాల్డ్‌రాస్ కూడా భోజనం చేశారు. సీఎం తను భోజనం చేసిన తరువాత మిగతా అందరినీ తిన్నారా అని పలకరించారు. వంటలు బాగున్నాయని మెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement