‘గ్రామజ్యోతి’కి రూ.1,824 కోట్లు | 'Gramajyoti' Rs .1,824 crore | Sakshi
Sakshi News home page

‘గ్రామజ్యోతి’కి రూ.1,824 కోట్లు

Published Fri, Aug 14 2015 3:59 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

‘గ్రామజ్యోతి’కి రూ.1,824 కోట్లు - Sakshi

‘గ్రామజ్యోతి’కి రూ.1,824 కోట్లు

బాన్సువాడ : పార్టీలకతీతంగా గ్రామజ్యోతి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.  గ్రామాభివృద్ధికి అందరూ కలిసి రావాలని, ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, పట్టింపులకు వెళ్లొద్దని సూచించారు. ఈ నెల 17 నుంచి 23 వరకు జరిగే గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా జిల్లాకు రూ.1,824 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రతి రోజూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యను పరదోలుతామన్నారు. బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ శాంతారూప్‌సింగ్ గురువారం ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన బహిరంగ సభలో మంత్రి పోచారం మాట్లాడారు. ప్రత్యేక ప్రణాళికల ద్వారా గ్రామజ్యోతి నిధులను కేటాయిస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఆసరా పింఛన్లు, బీడీ కార్మికుల భృతి తదితర పింఛన్ పథకాలకు ప్రత్యేకంగా ఒక తేదీ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే వారికి వెంటనే మంజూరు చేస్తామన్నారు. రూ.200 పింఛన్‌ను రూ.వెయ్యికి పెంచడం తమ ప్రభుత్వ ఘనత అని అన్నారు.  సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం పంపిణీ చేయడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం లభిస్తోందని, త్వరలో పాఠశాలలకు విస్తరింపజేస్తామన్నారు.

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకాల ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతోందన్నారు. రూ.5.05లక్షలతో 560 చదరపు అడుగుల ఏరియాలో డబుల్ బెడ్‌రూం ఇల్లు నిర్మించే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. అధికారులే గ్రామాల్లో తిరిగి గుడిసెల్లో, అద్దెకు ఉంటున్న వారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా కట్టించిన ఇళ్లను అప్పగిస్తారని తెలిపారు. లబ్ధిదారులు నేరుగా ఇంటికి సున్నం వేసుకుని, గృహప్రవేశం చేయాలని, మిగతా అన్ని పనులను ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించామని తెలిపారు.

వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఒక్క ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి, ప్రతి ఒక్కరికి 100 లీటర్ల నీరు సరఫరా చేస్తామన్నారు. ఇందుకోసం జిల్లాకు రూ.3,470 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాలకు, ఎస్సారెస్పీ ద్వారా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, అర్బన్, కామారెడ్డి నియోజకవర్గాలకు నీరందిస్తామని మంత్రి పోచారం వివరించారు.

 బోర్లం గ్రామానికి అన్నివిధాలా సహకారం
 బోర్లం సర్పంచ్ శాంతారూప్‌సింగ్ టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని ప్రశంసించిన మంత్రి, గ్రామాభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. బోర్లం క్యాంప్ వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామని, సీసీ రోడ్లు వేస్తామని, ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. బసవేశ్వర మందిర సమీపంలో రూ.40లక్షలతో వంతెన నిర్మిస్తామని చెప్పారు.సర్పంచ్ శాంతారూప్‌సింగ్‌తో పాటు మరో 400 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

బోధన్ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్, తహసీల్దార్ గోపి, ఎంపీడీఓ విజయ్‌భాస్కర్, ఎంపీపీ రే ష్మాబేగం ఎజాస్, జెడ్పీటీసీ సభ్యుడు జంగం విజయ గంగాధర్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు అలీముద్దీన్ బాబా, సింగిల్‌విండో చైర్మన్లు శ్రీనివాస్‌రెడ్డి, ఎర్వల కృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నార్ల సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తకొండ భాస్కర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, సర్పంచ్ శాంతారూప్‌సింగ్, మాజీ సర్పంచ్ నర్సింలు, సాయిలు, రఘురాం, జలీల్, సయ్యద్ అహ్మద్ పాల్గొన్నారు.

 ఉల్లి ధర స్థిరీకరణకు చర్యలు..
 బాన్సువాడ : రాష్ట్రంలో ఉల్లి ధర విపరీతంగా పెరగడంతో ఈ ధరల స్థిరీకరణకు  చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.  గురువారం రాత్రి తన నివాసగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉల్లి ధరల స్థిరీకరణ కోసం శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో సమావేశం నిర్వహిస్తున్నామని, ఇందులో మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు పాల్గొననున్నట్లు వెల్లడించారు.  

రైతులు ఉల్లి సాగు చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి విత్తనాల సబ్సిడీని 50  నుంచి 75 శాతానికి పెంచినట్లు తెలిపారు. ధర ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా రూ.20కి కిలో చొప్పున విక్రరుుంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శుక్రవారం జరిగే సమావేశంలో రైతులు పాల్గొనవచ్చని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement