నేటి నుంచి ‘గ్రామజ్యోతి’
- మెయినాబాద్ మండలం అజీజ్ నగర్‌లో ప్రారంభం
- హాజరుకానున్న మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా : గ్రామాల సమగ్ర అభివృద్ధితో పాటు పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘గ్రామజ్యోతి’ నేడు కార్యరూపం దాల్చనుంది. సోమవారం జిల్లాలోని మెయినాబాద్ మండలం అజీజ్‌నగర్ గ్రామ పంచాయతీలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
ప్రజలే ‘ప్రణాళికా’కర్తలు..
గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రజాసమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు సర్కారు సరికొత్త మార్గాన్ని అనుసరిస్తోంది. ఇప్పటివరకు ప్రజాసమస్యలను గుర్తించి పరిష్కారంచేసే పనంతా అధికారులు, ప్రజాప్రతినిధులు చూసుకునేవారు. తాజా కార్యక్రమంలో ఈ బాధ్యత ప్రజలకే అప్పగించింది. పంచాయతీ స్థాయిలో ప్రత్యేకంగా గ్రామసదస్సు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ప్రజలు లేవనెత్తే సమస్యలను పరిగణించి ప్రణాళిక తయారు చేస్తారు.
గ్రామజ్యోతి కార్యక్రమంలో పంచాయతీ స్థాయిలో ప్రధానంగా ఐదు కేటగిరీల్లో కమిటీలు ఏర్పాటు చేస్తారు. పారిశుద్ధ్యం- తాగునీరు, ఆరోగ్యం- పౌష్టికాహారం, విద్య, సామాజిక భద్రత- పేదరిక నిర్మూలన, సహజవనరుల నిర్వహణ, వ్యవసాయ కమిటీలుగా విభజించి గ్రామంలోని అన్ని వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేస్తూ సభ్యులను ఎన్నుకుంటారు. ఒక్కో కమిటీలో ఐదుగురు చొప్పున సభ్యులుంటారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించాల్సి ఉంటుంది.
క్లీన్ ‘విలేజ్’
రోజుకు కనిష్టంగా రెండు పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలి. ఇందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను ప్రభుత్వం నియమించింది. ఉదయం 8గంటల కల్లా అధికారుల బృందం గ్రామానికి చేరుకుని దళితవాడలు, తండాలు, అన్ని వార్డులను కాలినడకన పర్యటించిన తర్వాత గ్రామసభ నిర్వహించాలి. గ్రామజ్యోతిలో భాగంగా కేవలం ఒక గ్రామసభ నిర్వహణ కాకుండా.. వరుసగా వారం రోజులపాటు పలు కార్యక్రమాలు చేపడతారు.
17న: గ్రామసభ నిర్వహణ, కమిటీల ఏర్పాటు, ప్రణాళికపై చర్చ
18న: వీధులను శుభ్రం చేయడం, చెత్త, పొదల తొలగింపు, మురుగుకాల్వలను శుభ్రపర్చడం
19న: కమిటీల ప్రత్యేక సమావేశాలు, గ్రామంలో పర్యటన, సమస్యల గుర్తింపు
20న: క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, ప్రణాళిక తయారు
21 నుంచి 29వరకు: ఆయా కమిటీలకు గుర్తించిన సమస్యలు పరిష్కరించడం