panchayat system
-
పంచాయతీ పుట్టింది ఇలా..
సాక్షి, సత్తెనపల్లి: దేశంలో ఆంగ్లేయుల పాలనలో గవర్నర్ జనరల్‌గా కారన్ వాలిస్ ఉన్నప్పుడు లాటరీ విధానంలో పంచాయతీ వ్యవస్థను రద్దు చేశారు. 1884లో లార్డ్ రిప్పన్ రాజప్రతినిధిగా వచ్చిన తరువాత రద్దు చేసిన పంచాయతీ వ్యవస్థను నూతన హంగులతో పునరుద్ధరించారు. అప్పటి నుంచి బ్యాలెట్ ఎన్నికల విధానానికి శ్రీకారం చుట్టారు. అందుకే లార్డ్ రిప్పన్‌ను స్థానిక సంస్థల పితామహుడిగా అభివర్ణిస్తారు. పంచాయతీ చట్టం –1964లో అమలులోకి వచ్చింది. అంతకు ముందు మద్రాసు గ్రామ పంచాయతీ చట్టం –1950 (ఆంధ్రాప్రాంతంలో), హైదరాబాద్ గ్రామ పంచాయతీ చట్టం –1956 (తెలంగాణ ప్రాంతంలో) అమలులో ఉండేది. 1959లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలను వేర్వేరుగా ఉన్న పంచాయతీ చట్టాలను రద్దు చేసి రెండింటిని క్రోడీకరించి 1964లో ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టాన్ని చేశారు. 1964లో రాష్ట్రం అంతటా ఎన్నికలు నిర్వహించారు. గ్రామాల్లో సాధారణ సమస్యల పరిష్కారానికి ‘పంచాస్’ అనే అయిదు గురు సభ్యులతో కూడిన మండలి ఉండేది. పంచాస్ అనే పదమే ఆ తర్వాత పంచాయతీగా మారింది. -
కేరళ పంచాయతీ వ్యవస్థ దేశానికే ఆదర్శం
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, హైదరాబాద్: కేరళలోని పంచాయతీ పాలనా విధానం దేశానికే ఆదర్శమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశంసించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా శనివారం కేరళ ఎర్నాకులం జిల్లా పరక్కడావు బ్లాక్ పంచాయతీ, శ్రీమూలనగరం గ్రామ పంచాయతీలను మంత్రి బృందం సందర్శించింది. కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థలో అమలుచేస్తున్న పథకాల తీరుపై అక్కడి అధికారులను జూపల్లి అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే 100 శాతం అక్షరాస్యత సాధించిన తొలి జిల్లాగా గుర్తింపు పొందిన ఎర్నాకులంలో విద్యా వ్యవస్థ తీరును కూడా మంత్రి పరిశీలించారు. తెలంగాణాలో పర్యటనకు రావాలని అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి ఆహ్వానించారు. అనంతరం కేరళ మాజీ సీఎం ఊమెన్చాందీతో జూపల్లి కొద్దిసేపు భేటీ అయ్యారు. శనివారం రాత్రి జూపల్లి, కమిషనర్ నీతూకుమారిప్రసాద్, ఇతర అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. -
తెలంగాణలో పంచాయతీ వ్యవస్థ భేష్
భూదాన్‌పోచంపల్లి : తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా.. భేషుగ్గా ఉందని రాజస్థాన్‌కు చెందిన బ్లాక్ డెవలప్మెంట్ అధికారుల (ఎంపీడీఓ స్థాయి) బృందం కొనియాడింది. హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్ఐఆర్డీ(నిర్డ్)) ఆధ్వర్యంలో రాజస్థాన్‌కు చెందిన 47 మంది బీడీఓలు ఆదివారం పోచంపల్లి గ్రామ పంచాయతీని సందర్శించారు. సర్పంచ్ తడక లతావెంకటేశం, కార్యదర్శి బాలాజీ, పాలకవర్గంతో సమావేశమయ్యారు. గ్రామపంచాయతీల విధులు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అందిస్తున్న నిధులు, అభివృద్ధి సంక్షేమ పథకాలు, జాతీయ ఉపాధిహామీ పథకం అమలు తీరుపై ఆరా తీశారు. కూలీలకు రోజుకు ఎంత కూలీ లభిస్తుందని అడిగి తెలుసుకున్నారు. అలాగే పన్నుల వసూళ్ల విధానం, గ్రామాభివృద్ధికి గ్రామపంచాయతీలు చేపట్టుతున్న పనులపై సమీక్షించారు. ఈ-పంచాయతీ ద్వారా ప్రజలకు అంది స్తున్న సత్వర సేవలను తెలుసుకొని అభినందించారు. అనంతరం పోచంపల్లి చారిత్రక నేపథ్యం, టై అండ్ డై వస్త్రాలకు ఉన్న ప్రాముఖ్యతను సర్పంచ్ వివరించారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆదర్శంగా ఉన్నాయని కితాబునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్ఐఆర్డీ ప్రతినిధి డాక్టర్ ఆర్పీ ఆచారి మాట్లాడుతూ రాజస్థాన్ గ్రామీణాభివృద్ధి సర్వీస్ ట్రైనీ అధికారులు స్టడీటూర్‌లో భాగంగా ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. ఆసరా పింఛన్ పథకం బాగుంది తెలంగాణలో ఆసరా పింఛన్ పథకం ఆదర్శం గా ఉంది. రాజస్థాన్‌లో 60 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.500, 75ఏళ్లు దాటినవారికి రూ.750లు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. తెలంగాణలో వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకూ రూ.1000లు పింఛన్ ఇవ్వడం గొప్ప విషయం. మా రాష్ట్రంలో దేశంలోనే ప్రప్రథమంగా ‘భామాషా’ స్కీమ్ అమలవుతుంది. అన్ని పథకాల చెల్లింపులు ఈ పోర్టల్ ద్వారానే జరుగుతాయి. - నరేంద్రసౌ, బీడీఓ మా రాష్ట్రంలో ఏడాది నుంచి.. మా రాష్ట్రంలో ఏడాది నుంచే ఇందిరా ఆవాస్‌యోజన కింద పేదలకు డబుల్‌బెడ్ రూం పథకం అమలవుతుంది. కాకపోతే ఇక్కడి మాదిరిగా రూ. 5లక్షలు వ్యయం కాదు. ఇక్కడి ప్రజాప్రతినిధుల వేతనం బాగుంది. అదే మా దగ్గర నెలనెలా సర్పంచులకు రూ.3వేలు, ప్రధాన్(ఎంపీపీ)లకు నెలకు రూ.4వేలు గౌరవ వేతనం అందిస్తున్నారు. మా రాష్ట్రంలో సర్పంచ్ పవర్ఫుల్. చెక్కు పవర్ కేవలం సర్పంచ్‌కే ఉంటుంది. - అభిమన్యు, బీడీఓ -
నేటి నుంచి ‘గ్రామజ్యోతి’
- మెయినాబాద్ మండలం అజీజ్ నగర్లో ప్రారంభం - హాజరుకానున్న మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా : గ్రామాల సమగ్ర అభివృద్ధితో పాటు పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘గ్రామజ్యోతి’ నేడు కార్యరూపం దాల్చనుంది. సోమవారం జిల్లాలోని మెయినాబాద్ మండలం అజీజ్‌నగర్ గ్రామ పంచాయతీలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రజలే ‘ప్రణాళికా’కర్తలు.. గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రజాసమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు సర్కారు సరికొత్త మార్గాన్ని అనుసరిస్తోంది. ఇప్పటివరకు ప్రజాసమస్యలను గుర్తించి పరిష్కారంచేసే పనంతా అధికారులు, ప్రజాప్రతినిధులు చూసుకునేవారు. తాజా కార్యక్రమంలో ఈ బాధ్యత ప్రజలకే అప్పగించింది. పంచాయతీ స్థాయిలో ప్రత్యేకంగా గ్రామసదస్సు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ప్రజలు లేవనెత్తే సమస్యలను పరిగణించి ప్రణాళిక తయారు చేస్తారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో పంచాయతీ స్థాయిలో ప్రధానంగా ఐదు కేటగిరీల్లో కమిటీలు ఏర్పాటు చేస్తారు. పారిశుద్ధ్యం- తాగునీరు, ఆరోగ్యం- పౌష్టికాహారం, విద్య, సామాజిక భద్రత- పేదరిక నిర్మూలన, సహజవనరుల నిర్వహణ, వ్యవసాయ కమిటీలుగా విభజించి గ్రామంలోని అన్ని వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేస్తూ సభ్యులను ఎన్నుకుంటారు. ఒక్కో కమిటీలో ఐదుగురు చొప్పున సభ్యులుంటారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించాల్సి ఉంటుంది. క్లీన్ ‘విలేజ్’ రోజుకు కనిష్టంగా రెండు పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలి. ఇందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను ప్రభుత్వం నియమించింది. ఉదయం 8గంటల కల్లా అధికారుల బృందం గ్రామానికి చేరుకుని దళితవాడలు, తండాలు, అన్ని వార్డులను కాలినడకన పర్యటించిన తర్వాత గ్రామసభ నిర్వహించాలి. గ్రామజ్యోతిలో భాగంగా కేవలం ఒక గ్రామసభ నిర్వహణ కాకుండా.. వరుసగా వారం రోజులపాటు పలు కార్యక్రమాలు చేపడతారు. 17న: గ్రామసభ నిర్వహణ, కమిటీల ఏర్పాటు, ప్రణాళికపై చర్చ 18న: వీధులను శుభ్రం చేయడం, చెత్త, పొదల తొలగింపు, మురుగుకాల్వలను శుభ్రపర్చడం 19న: కమిటీల ప్రత్యేక సమావేశాలు, గ్రామంలో పర్యటన, సమస్యల గుర్తింపు 20న: క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, ప్రణాళిక తయారు 21 నుంచి 29వరకు: ఆయా కమిటీలకు గుర్తించిన సమస్యలు పరిష్కరించడం -
‘ఈ-పంచాయతీ’తో మెరుగైన పాలన
ఖమ్మం జెడ్పీసెంటర్: గ్రామ పంచాయతీలలో మెరుగైన పాలన అందించేందుకు, జవాబుదారీతనం పెంచేందుకు ‘ఈ-పంచాయతీ’ వ్యవస్థను నెలకొల్పుతున్నట్టు జాయింట్ కలెక్టర్ (జేసీ) సురేంద్రమోహన్ చెప్పారు. కంప్యూటరీకరణ, పంచాయతీరాజ్ వ్యవస్థ, ఈ-పంచాయతీలు, మిషన్ మోడ్ ప్రాజెక్ట్ తదితరాంశాలపై సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఒక రోజు శిక్షణ శిబిరాన్ని ఆయన శుక్రవారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 369 పంచాయతీలలో ‘ఈ-పంచాయతీ’ వ్యవస్థను పెలైట్ ప్రాజెక్టుగా చేపడుతున్నట్టు చెప్పారు. మొదటి దశలో భాగంగా 17 మేజర్ పంచాయతీల్లో ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలవుతుందని అన్నారు. ప్రజలకు అన్ని రకాల పనులు/సేవలను తక్షణమే అందించేందుకు ‘ఈ-పంచాయతీ’ని ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి పని, రేషన్, కోర్టు కేసులు, ఆడిట్, గ్రీవెన్స్ తదితరాలన్నీ ఆన్లైన్లోనే చూసుకునేలా కంప్యూటరీకరణ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. గ్రామాల్లో బర్త్, డెత్ సర్టిఫికెట్లతోపాటు పన్నుల వసూళ్లు, ఖర్చులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని అన్నారు. కంప్యూటరీకరణపై వచ్చే వారంలో సర్పంచులకు భద్రాచలం, ఖమ్మంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. అన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని టెలికం డిప్యూటీ జనరల్ మేనేజర్ వాసుదేవరావుకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జయప్రకాష్ నారాయణ, డీఐవో శ్రీనివాస్, చక్రవర్తి, డీటీ ఖాసిం, డీఎల్పీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.