కేరళ పంచాయతీ వ్యవస్థ దేశానికే ఆదర్శం
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
సాక్షి, హైదరాబాద్: కేరళలోని పంచాయతీ పాలనా విధానం దేశానికే ఆదర్శమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశంసించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా శనివారం కేరళ ఎర్నాకులం జిల్లా పరక్కడావు బ్లాక్ పంచాయతీ, శ్రీమూలనగరం గ్రామ పంచాయతీలను మంత్రి బృందం సందర్శించింది. కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థలో అమలుచేస్తున్న పథకాల తీరుపై అక్కడి అధికారులను జూపల్లి అడిగి తెలుసుకున్నారు.
దేశంలోనే 100 శాతం అక్షరాస్యత సాధించిన తొలి జిల్లాగా గుర్తింపు పొందిన ఎర్నాకులంలో విద్యా వ్యవస్థ తీరును కూడా మంత్రి పరిశీలించారు. తెలంగాణాలో పర్యటనకు రావాలని అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి ఆహ్వానించారు. అనంతరం కేరళ మాజీ సీఎం ఊమెన్‌చాందీతో జూపల్లి కొద్దిసేపు భేటీ అయ్యారు. శనివారం రాత్రి జూపల్లి, కమిషనర్ నీతూకుమారిప్రసాద్, ఇతర అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు.