భూదాన్‌పోచంపల్లి : తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా.. భేషుగ్గా ఉందని రాజస్థాన్‌కు చెందిన బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారుల (ఎంపీడీఓ స్థాయి) బృందం కొనియాడింది. హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్‌ఐఆర్డీ(నిర్డ్)) ఆధ్వర్యంలో రాజస్థాన్‌కు చెందిన 47 మంది బీడీఓలు ఆదివారం పోచంపల్లి గ్రామ పంచాయతీని సందర్శించారు. సర్పంచ్ తడక లతావెంకటేశం, కార్యదర్శి బాలాజీ, పాలకవర్గంతో సమావేశమయ్యారు. గ్రామపంచాయతీల విధులు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అందిస్తున్న నిధులు, అభివృద్ధి సంక్షేమ పథకాలు, జాతీయ ఉపాధిహామీ పథకం అమలు తీరుపై ఆరా తీశారు. కూలీలకు రోజుకు ఎంత కూలీ లభిస్తుందని అడిగి తెలుసుకున్నారు. అలాగే పన్నుల వసూళ్ల విధానం, గ్రామాభివృద్ధికి గ్రామపంచాయతీలు చేపట్టుతున్న పనులపై సమీక్షించారు. ఈ-పంచాయతీ ద్వారా ప్రజలకు అంది స్తున్న సత్వర సేవలను తెలుసుకొని అభినందించారు. అనంతరం పోచంపల్లి చారిత్రక నేపథ్యం, టై అండ్ డై వస్త్రాలకు ఉన్న ప్రాముఖ్యతను సర్పంచ్ వివరించారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆదర్శంగా ఉన్నాయని కితాబునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్‌ఐఆర్డీ ప్రతినిధి డాక్టర్ ఆర్‌పీ ఆచారి మాట్లాడుతూ రాజస్థాన్ గ్రామీణాభివృద్ధి సర్వీస్ ట్రైనీ అధికారులు స్టడీటూర్‌లో భాగంగా ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు.
ఆసరా పింఛన్ పథకం బాగుంది
తెలంగాణలో ఆసరా పింఛన్ పథకం ఆదర్శం గా ఉంది. రాజస్థాన్‌లో 60 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.500, 75ఏళ్లు దాటినవారికి రూ.750లు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. తెలంగాణలో వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకూ రూ.1000లు పింఛన్ ఇవ్వడం గొప్ప విషయం. మా రాష్ట్రంలో దేశంలోనే ప్రప్రథమంగా ‘భామాషా’ స్కీమ్ అమలవుతుంది. అన్ని పథకాల చెల్లింపులు ఈ పోర్టల్ ద్వారానే జరుగుతాయి. - నరేంద్రసౌ, బీడీఓ
మా రాష్ట్రంలో ఏడాది నుంచి..
మా రాష్ట్రంలో ఏడాది నుంచే ఇందిరా ఆవాస్‌యోజన కింద పేదలకు డబుల్‌బెడ్ రూం పథకం అమలవుతుంది. కాకపోతే ఇక్కడి మాదిరిగా రూ. 5లక్షలు వ్యయం కాదు. ఇక్కడి ప్రజాప్రతినిధుల వేతనం బాగుంది. అదే మా దగ్గర నెలనెలా సర్పంచులకు రూ.3వేలు, ప్రధాన్(ఎంపీపీ)లకు నెలకు రూ.4వేలు గౌరవ వేతనం అందిస్తున్నారు. మా రాష్ట్రంలో సర్పంచ్ పవర్‌ఫుల్. చెక్కు పవర్ కేవలం సర్పంచ్‌కే ఉంటుంది.
- అభిమన్యు, బీడీఓ
తెలంగాణలో పంచాయతీ వ్యవస్థ భేష్
Published Mon, May 2 2016 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM
Advertisement