‘ఈ-పంచాయతీ’తో మెరుగైన పాలన | better rule with E-Panchayat | Sakshi
Sakshi News home page

‘ఈ-పంచాయతీ’తో మెరుగైన పాలన

Published Sat, Jul 26 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM

better rule with E-Panchayat

ఖమ్మం జెడ్పీసెంటర్: గ్రామ పంచాయతీలలో మెరుగైన పాలన అందించేందుకు, జవాబుదారీతనం పెంచేందుకు ‘ఈ-పంచాయతీ’ వ్యవస్థను నెలకొల్పుతున్నట్టు జాయింట్ కలెక్టర్ (జేసీ) సురేంద్రమోహన్ చెప్పారు. కంప్యూటరీకరణ, పంచాయతీరాజ్ వ్యవస్థ, ఈ-పంచాయతీలు, మిషన్ మోడ్ ప్రాజెక్ట్ తదితరాంశాలపై సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఒక రోజు శిక్షణ శిబిరాన్ని ఆయన శుక్రవారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో ప్రారంభించారు.

ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 369 పంచాయతీలలో ‘ఈ-పంచాయతీ’ వ్యవస్థను పెలైట్ ప్రాజెక్టుగా చేపడుతున్నట్టు చెప్పారు. మొదటి దశలో భాగంగా 17 మేజర్ పంచాయతీల్లో ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలవుతుందని అన్నారు. ప్రజలకు అన్ని రకాల పనులు/సేవలను తక్షణమే అందించేందుకు ‘ఈ-పంచాయతీ’ని ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి పని, రేషన్, కోర్టు కేసులు, ఆడిట్, గ్రీవెన్స్ తదితరాలన్నీ ఆన్‌లైన్‌లోనే చూసుకునేలా కంప్యూటరీకరణ చేస్తున్నట్టు చెప్పారు.

 ఈ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. గ్రామాల్లో బర్త్, డెత్ సర్టిఫికెట్లతోపాటు పన్నుల వసూళ్లు, ఖర్చులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని అన్నారు. కంప్యూటరీకరణపై వచ్చే వారంలో సర్పంచులకు భద్రాచలం, ఖమ్మంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. అన్ని పంచాయతీలకు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని టెలికం డిప్యూటీ జనరల్ మేనేజర్ వాసుదేవరావుకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జయప్రకాష్ నారాయణ, డీఐవో శ్రీనివాస్, చక్రవర్తి, డీటీ ఖాసిం, డీఎల్‌పీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement