ఖమ్మం : జిల్లా సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు ఇన్‌చార్జ్ కలెక్టర్ సురేంద్రమోహన్ విద్యాశాఖ అధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండు దశాబ్దాలుగా మూలుగుతున్న సైన్స్ మ్యూజియం నిధులు రూ.40 లక్షలకు మోక్షం లభించింది. జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు, దాని ఆవిశ్యకత, దానికి సంబంధించిన నిధులు తదితర అంశాలపై ఇన్‌చార్జ్ కలెక్టర్‌కు జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి వివరించారు.
దీనిపై స్పందించిన ఇన్‌చార్జ్ కలెక్టర్ విద్యాశాఖ, ఆర్వీఎం అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఖమ్మంలో ఉన్న ఎన్నెస్పీ స్థలంలో సైన్స్ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తే అందరికీ అనువుగా ఉంటుందనే చర్చ ఈ సందర్భంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన కల్పించేందుకు సైన్స్ మ్యూజియం అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందు కోసం నిల్వ ఉన్న రూ. 40లక్షలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కొత్త భవనాల నిర్మాణం కాకుండా అందుబాటులో ఉన్న రెండు ఎన్నెస్పీ భవనాలను ఇందుకు వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసే మ్యూజియం అధునాతనంగా ఉండాలన్నారు. ఇందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సైన్స్ మ్యూజియాలను పరిశీలించి రావాలని అన్నారు. ఇదంతా 15రోజుల్లో పూర్తి చేసి నివేదిక అందజేయాలని, పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ సురేంద్రమోహన్ వెంట డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ ఈఓ బస్వరావు, ఆర్వీఎం పీఓ శ్రీనివాస్, ఈఈ రవికుమార్, ఎన్నెస్పీ ఏఈ తిరుపతమ్మ, ఐక్యరాజ్య సమితి జిల్లా ప్రతినిధి సునీల్‌కుమార్ ఉన్నారు.
సైన్స్ మ్యూజియంల పరిశీలనకు ప్రత్యేక బృందాలు
జిల్లాలో ఏర్పాటు చేసే సైన్స్ మ్యూజియంలో అన్ని హంగులు, పరికరాలు, అమర్చేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న సైన్స్ మ్యూజియంల పరిశీలన కోసం ప్రత్యేక బృందాలను పంపిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వరంగల్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యూజియంలు పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.
ఖమ్మంలో సైన్స్ మ్యూజియం
Published Sat, Jul 19 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM
Advertisement
Advertisement