Surendramohan
-
‘ఈ-పంచాయతీ’తో మెరుగైన పాలన
ఖమ్మం జెడ్పీసెంటర్: గ్రామ పంచాయతీలలో మెరుగైన పాలన అందించేందుకు, జవాబుదారీతనం పెంచేందుకు ‘ఈ-పంచాయతీ’ వ్యవస్థను నెలకొల్పుతున్నట్టు జాయింట్ కలెక్టర్ (జేసీ) సురేంద్రమోహన్ చెప్పారు. కంప్యూటరీకరణ, పంచాయతీరాజ్ వ్యవస్థ, ఈ-పంచాయతీలు, మిషన్ మోడ్ ప్రాజెక్ట్ తదితరాంశాలపై సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఒక రోజు శిక్షణ శిబిరాన్ని ఆయన శుక్రవారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 369 పంచాయతీలలో ‘ఈ-పంచాయతీ’ వ్యవస్థను పెలైట్ ప్రాజెక్టుగా చేపడుతున్నట్టు చెప్పారు. మొదటి దశలో భాగంగా 17 మేజర్ పంచాయతీల్లో ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలవుతుందని అన్నారు. ప్రజలకు అన్ని రకాల పనులు/సేవలను తక్షణమే అందించేందుకు ‘ఈ-పంచాయతీ’ని ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి పని, రేషన్, కోర్టు కేసులు, ఆడిట్, గ్రీవెన్స్ తదితరాలన్నీ ఆన్లైన్లోనే చూసుకునేలా కంప్యూటరీకరణ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. గ్రామాల్లో బర్త్, డెత్ సర్టిఫికెట్లతోపాటు పన్నుల వసూళ్లు, ఖర్చులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని అన్నారు. కంప్యూటరీకరణపై వచ్చే వారంలో సర్పంచులకు భద్రాచలం, ఖమ్మంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. అన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని టెలికం డిప్యూటీ జనరల్ మేనేజర్ వాసుదేవరావుకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జయప్రకాష్ నారాయణ, డీఐవో శ్రీనివాస్, చక్రవర్తి, డీటీ ఖాసిం, డీఎల్పీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మంలో సైన్స్ మ్యూజియం
ఖమ్మం : జిల్లా సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు ఇన్చార్జ్ కలెక్టర్ సురేంద్రమోహన్ విద్యాశాఖ అధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండు దశాబ్దాలుగా మూలుగుతున్న సైన్స్ మ్యూజియం నిధులు రూ.40 లక్షలకు మోక్షం లభించింది. జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు, దాని ఆవిశ్యకత, దానికి సంబంధించిన నిధులు తదితర అంశాలపై ఇన్చార్జ్ కలెక్టర్‌కు జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి వివరించారు. దీనిపై స్పందించిన ఇన్చార్జ్ కలెక్టర్ విద్యాశాఖ, ఆర్వీఎం అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఖమ్మంలో ఉన్న ఎన్నెస్పీ స్థలంలో సైన్స్ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తే అందరికీ అనువుగా ఉంటుందనే చర్చ ఈ సందర్భంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన కల్పించేందుకు సైన్స్ మ్యూజియం అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందు కోసం నిల్వ ఉన్న రూ. 40లక్షలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొత్త భవనాల నిర్మాణం కాకుండా అందుబాటులో ఉన్న రెండు ఎన్నెస్పీ భవనాలను ఇందుకు వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసే మ్యూజియం అధునాతనంగా ఉండాలన్నారు. ఇందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సైన్స్ మ్యూజియాలను పరిశీలించి రావాలని అన్నారు. ఇదంతా 15రోజుల్లో పూర్తి చేసి నివేదిక అందజేయాలని, పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. ఇన్చార్జ్ కలెక్టర్ సురేంద్రమోహన్ వెంట డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ ఈఓ బస్వరావు, ఆర్వీఎం పీఓ శ్రీనివాస్, ఈఈ రవికుమార్, ఎన్నెస్పీ ఏఈ తిరుపతమ్మ, ఐక్యరాజ్య సమితి జిల్లా ప్రతినిధి సునీల్‌కుమార్ ఉన్నారు. సైన్స్ మ్యూజియంల పరిశీలనకు ప్రత్యేక బృందాలు జిల్లాలో ఏర్పాటు చేసే సైన్స్ మ్యూజియంలో అన్ని హంగులు, పరికరాలు, అమర్చేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న సైన్స్ మ్యూజియంల పరిశీలన కోసం ప్రత్యేక బృందాలను పంపిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వరంగల్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యూజియంలు పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.