Rabindranath Reddy
-
ఎంఎస్ఎంఈ టీసీని తరలిస్తే ఉద్యమం
కడప కార్పొరేషన్: ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కొప్పర్తిలో కొనసాగించకపోతే ఉద్యమం తప్పదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో అఖిలపక్ష పార్టీ నేతలు, ప్రజా సంఘాలతో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దళిత ఫోరం జిల్లా చైర్మన్ కిశోర్ బూసిపాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు గాలిచంద్ర, జి.చంద్రశేఖర్, ఏఐసీసీ కో–ఆర్డినేటర్ ఎస్ఏ సత్తార్, బీఎస్పీ జిల్లా ఇన్చార్జి ఎస్.గుర్రప్ప, వైస్సార్‌ఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.250కోట్లతో కొప్పర్తిలో ఏర్పాటు చేసిన టెక్నాలజీ సెంటర్‌ను అమరావతికి తరలించడం దారుణమన్నారు. దీనివల్ల ఈ ప్రాంత యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై పెద్ద దెబ్బ పడుతుందని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కూడా నష్టం జరుగుతుందన్నారు. వైఎస్సార్ జిల్లాపై కక్షసా«ధించడానికే సీఎం చంద్రబాబు ఇలా చేశారని మండిపడ్డారు. కలెక్టర్ లోతేటి శివశంకర్‌కు వినతిపత్రం సమరి్పంచారు. -
పనిభారంతో ఉద్యోగుల్లో ఒత్తిడి
ఖమ్మం : సామాజిక అంశంపై పోరాటం చేసిన ఘనత తెలంగాణ ప్రజలకు, ఉద్యోగులకే దక్కిందని, తెలంగాణ ఉద్యమానికే ఇది సొంతమని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం అదనపు సంచాలకులు పసుపులేటి వెంకటేశ్వర్లు పదవీ విరమణ సభ ఆదివారం డీఈఓ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలంటే ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. ప్రస్తుతం పాఠశాలలు పెరిగినా ఉద్యోగుల సంఖ్య పెంచకపోవడంతో పనిభారంతో వారు ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. ప్రభుత్వం భర్తీ చేస్తున్న లక్ష ఉద్యోగాలతో అన్ని శాఖల ఉద్యోగులకు ఊరట కలుగుతుందని అన్నారు. పనిభారం ఉన్నా సహచర ఉద్యోగులను నొప్పించకుండా పని చేయించుకున్న ఘనత వెంకటేశ్వర్లుకే దక్కిందని అన్నారు. ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు విఠల్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో అలసిపోయిన నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాల భర్తీతో ఊరట కలుగుతుందని అన్నారు. చిన్న ఉద్యోగిగా చేరిన వెంకటేశ్వర్లు ఉన్నత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉన్నారని అన్నారు. సన్మాన గ్రహిత పసుపులేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయ కుటుంబంలో పుట్టి తాను పెద్దల సహాయంతో ఉద్యోగంలో చేరానని అన్నారు. అందరి అభిమానంతో పని చేసి ఉద్యోగ విరమణ పొందడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్ఈఆర్టీ ప్రొఫెసర్ వేణయ్య, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు జంగయ్య, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి వెంకటనర్సయ్య, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ వేణుమనోహర్, డీఈఓ కార్యాలయ ఉద్యోగులు కిషోర్, హరిందర్, రాయుడు, సత్యనారాయణ, నాగేశ్వర్రావు, వెంకటేశ్వర్లు బంధువులు విఠల్, ముదిగొండ ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ మందడపు నాగేశ్వరరావు(బుల్లెట్‌బాబు), మేకల సంగయ్య, ఆకుల గాంధీ, శెట్టి రంగారావు పాల్గొన్నారు. అనంతరం పసుపులేటి వెంకటేశ్వర్లు, లక్ష్మి దంపతులను ఘనంగా సన్మానించారు. -
విద్యార్థులు లేని స్కూళ్ల సమాచారం సేకరణ
ఖమ్మం: ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కనీస సంఖ్యలో విద్యార్థులు లేని పాఠశాలలను మూసివేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలో ఎన్ని పాఠశాలలను మూసివేయాల్సి వస్తుందనే సమాచారం ఓ కొలిక్కి వచ్చింది. డీఈవో రవీంద్రనాధ్‌రెడ్డి జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి ఆయా మండలాల్లో ఉన్న పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను తీసుకున్నారు. వారిచ్చిన జాబితాను పరిశీలించి జిల్లా వ్యాప్తంగా మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో 622 పాఠశాలలకు మూసివేత ముప్పు పొంచి ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలిసింది. ఇందులో 143 సక్సెస్ పాఠశాలలు కూడా ఉండటం గమనార్హం. దీంతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు రెండు వేల మంది ఉపాధ్యాయులకు స్థానచనలం కలుగనుంది. అయితే విద్యాసంవత్సరం మధ్యలో తగినంత మంది పిల్లలు లేరని పాఠశాలలు మూసివేస్తే ఆయా పాఠశాలల్లో చదివే ఒక్కరిద్దరు విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందికరంగా మారనుందని, ఇప్పటికిప్పుడు పాఠశాలలు మూసివేయడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో హేతుబద్ధీకరణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి పాఠశాలలు మూసివేయడం లేదని చెప్పడం గమనార్హం. కానీ, విద్యామంత్రి హామీ ఇచ్చిన విధంగా ఇప్పటికే విడుదలయిన ఉత్తర్వులలో మార్పులు తేకుంటే జిల్లా యంత్రాంగం సేకరించిన 622 పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని విద్యాశాఖ వర్గాలంటున్నాయి. మూసివేయకపోయినా వెయ్యి మంది బదిలీ? ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రకారం 20 మంది లోపు విద్యార్థులు ఉన్న పీఎస్‌లు, 6,7 తరగతులు కలిపి 40 మందికంటే తక్కువ విద్యార్థులు ఉన్న యూపీఎప్లు, 75 మంది విద్యార్థులకంటే తక్కువగా ఉన్న హైస్కూళ్లు, సక్సెస్ స్కూల్స్‌ను మూసివేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నిబంధనల ప్రకారం ప్రతి జిల్లాలో పాఠశాలలు, అక్కడ చదువుతున్న విద్యార్థులు, పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో డీఈవో ఎంఈవోల ద్వారా పూర్తి వివరాలు సేకరించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 289 ప్రాథమిక పాఠశాలలు, 182 యూపీఎస్‌లు, హైస్కూళ్లలో 8 తెలుగు మీడియం, 143 ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు... మొత్తం 622 పాఠశాలలను మూసివేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందులో మైదాన ప్రాంతంలో పీఎస్‌లు 93, యూపీఎస్‌లు 69, హైస్కూల్స్ తెలుగు మీడియంలో 4, ఇంగ్లిష్ మీడియంలో 100 ఉన్నాయి. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో పీఎస్‌లు 196, యూపీఎస్‌లు 113, హైస్కూల్స్ తెలుగు మీడియంలో 4, ఇంగ్లిష్ మీడియంలో 43 ఉన్నాయి. దీంతో ఒక వైపు రేషనలైజేషన్, మరోవైపు పాఠశాలల మూసివేత కారణంగా జిల్లాలో సుమారు రెండు వేల మంది ఉపాధ్యాయులకు స్థాన చెలనం కలగాల్సి ఉంది. ఒక వేళ విద్యాశాఖ మంత్రి ప్రకటించినట్లు పాఠశాలలు మూసివేయక పోయినా, రేషనలేజేషన్ ప్రకారం చూసినా జిల్లాలో వెయ్యిమంది ఉపాధ్యాయులు వారు పనిచేస్తున్న పాఠశాలల నుంచి బయటకు రావాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో పనిచేస్తున్న 463 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయలేదు. దీనికి తోడు ఇప్పుడు రేషలైజేషన్ ప్రకారం మిగిలిన ఉపాధ్యాయులను ఎలా సర్దుబాటు చేస్తారో వేచి చూడాలి. మంత్రి ప్రకటనతో ఊరట.. తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు మూసివేసేందుకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంగళవారం డీఈవో కార్యాలయంలో ఎంఈవోలతో సమావేశం ఏర్పాటు చేసి మూసివేసే పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి, సమీప పాఠశాలల్లో చేర్చడం, రేషనలైజేషన్ ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనల గురించి చర్చించారు. ఎంఈవోలు ఇచ్చిన నివేధికతో జిల్లాలో 622 పాఠశాలకు మూసివేత గండం పొంచి ఉందని స్పష్టం చేశారు. దీంతో తమకు స్థానం చలనం కలుగుతుందని ఉపాధ్యాయులు, తమ ఊళ్లో పాఠశాల మూసివేస్తారని గ్రామస్తులు, విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అయితే హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఒక్క పాఠశాలను కూడా మూసివేయడం లేదని, విద్యార్థుల సంఖ్యతో సబంధం లేకుండా పాఠశాలలు కొనసాగిస్తామని చెప్పారు. రేషనలైజేషన్ ప్రక్రియ మాత్రం కొససాగిస్తామని తెలిపారు. ఈ పరిస్థితిలో మారుమూల గ్రామాల్లో ఉన్న పాఠశాలలు యథాతధంగా ఉన్నా పలు పాఠశాలల్లో ముఖ్యంగా సక్సెస్ పాఠశాలల్లో 5,10 మంది విద్యార్థులే ఉన్నారు. హైస్కూళ్లలో ప్రతి 240 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే నిబంధన అమలు చేస్తే ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య భారీగా తగ్గే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏవిధంగా ఉంటుందోనని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. -
ఖమ్మంలో సైన్స్ మ్యూజియం
ఖమ్మం : జిల్లా సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు ఇన్చార్జ్ కలెక్టర్ సురేంద్రమోహన్ విద్యాశాఖ అధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండు దశాబ్దాలుగా మూలుగుతున్న సైన్స్ మ్యూజియం నిధులు రూ.40 లక్షలకు మోక్షం లభించింది. జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు, దాని ఆవిశ్యకత, దానికి సంబంధించిన నిధులు తదితర అంశాలపై ఇన్చార్జ్ కలెక్టర్‌కు జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి వివరించారు. దీనిపై స్పందించిన ఇన్చార్జ్ కలెక్టర్ విద్యాశాఖ, ఆర్వీఎం అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఖమ్మంలో ఉన్న ఎన్నెస్పీ స్థలంలో సైన్స్ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తే అందరికీ అనువుగా ఉంటుందనే చర్చ ఈ సందర్భంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన కల్పించేందుకు సైన్స్ మ్యూజియం అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందు కోసం నిల్వ ఉన్న రూ. 40లక్షలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొత్త భవనాల నిర్మాణం కాకుండా అందుబాటులో ఉన్న రెండు ఎన్నెస్పీ భవనాలను ఇందుకు వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసే మ్యూజియం అధునాతనంగా ఉండాలన్నారు. ఇందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సైన్స్ మ్యూజియాలను పరిశీలించి రావాలని అన్నారు. ఇదంతా 15రోజుల్లో పూర్తి చేసి నివేదిక అందజేయాలని, పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. ఇన్చార్జ్ కలెక్టర్ సురేంద్రమోహన్ వెంట డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ ఈఓ బస్వరావు, ఆర్వీఎం పీఓ శ్రీనివాస్, ఈఈ రవికుమార్, ఎన్నెస్పీ ఏఈ తిరుపతమ్మ, ఐక్యరాజ్య సమితి జిల్లా ప్రతినిధి సునీల్‌కుమార్ ఉన్నారు. సైన్స్ మ్యూజియంల పరిశీలనకు ప్రత్యేక బృందాలు జిల్లాలో ఏర్పాటు చేసే సైన్స్ మ్యూజియంలో అన్ని హంగులు, పరికరాలు, అమర్చేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న సైన్స్ మ్యూజియంల పరిశీలన కోసం ప్రత్యేక బృందాలను పంపిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వరంగల్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యూజియంలు పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.