ఖమ్మం : సామాజిక అంశంపై పోరాటం చేసిన ఘనత తెలంగాణ ప్రజలకు, ఉద్యోగులకే దక్కిందని, తెలంగాణ ఉద్యమానికే ఇది సొంతమని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం అదనపు సంచాలకులు పసుపులేటి వెంకటేశ్వర్లు పదవీ విరమణ సభ ఆదివారం డీఈఓ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలంటే ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. ప్రస్తుతం పాఠశాలలు పెరిగినా ఉద్యోగుల సంఖ్య పెంచకపోవడంతో పనిభారంతో వారు ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు.
ప్రభుత్వం భర్తీ చేస్తున్న లక్ష ఉద్యోగాలతో అన్ని శాఖల ఉద్యోగులకు ఊరట కలుగుతుందని అన్నారు. పనిభారం ఉన్నా సహచర ఉద్యోగులను నొప్పించకుండా పని చేయించుకున్న ఘనత వెంకటేశ్వర్లుకే దక్కిందని అన్నారు. ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు విఠల్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో అలసిపోయిన నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాల భర్తీతో ఊరట కలుగుతుందని అన్నారు. చిన్న ఉద్యోగిగా చేరిన వెంకటేశ్వర్లు ఉన్నత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉన్నారని అన్నారు. సన్మాన గ్రహిత పసుపులేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయ కుటుంబంలో పుట్టి తాను పెద్దల సహాయంతో ఉద్యోగంలో చేరానని అన్నారు. అందరి అభిమానంతో పని చేసి ఉద్యోగ విరమణ పొందడం సంతోషంగా ఉందని అన్నారు.
అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌ఈఆర్‌టీ ప్రొఫెసర్ వేణయ్య, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు జంగయ్య, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి వెంకటనర్సయ్య, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ వేణుమనోహర్, డీఈఓ కార్యాలయ ఉద్యోగులు కిషోర్, హరిందర్, రాయుడు, సత్యనారాయణ, నాగేశ్వర్‌రావు, వెంకటేశ్వర్లు బంధువులు విఠల్, ముదిగొండ ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ మందడపు నాగేశ్వరరావు(బుల్లెట్‌బాబు), మేకల సంగయ్య, ఆకుల గాంధీ, శెట్టి రంగారావు పాల్గొన్నారు. అనంతరం పసుపులేటి వెంకటేశ్వర్లు, లక్ష్మి దంపతులను ఘనంగా సన్మానించారు.
పనిభారంతో ఉద్యోగుల్లో ఒత్తిడి
Published Mon, Dec 1 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM
Advertisement
Advertisement