Science Museum
-
రూ.1,500 కోట్లతో సైన్స్ మ్యూజియం
నేడు తిరుపతిలో శంకుస్థాపన సాక్షి, తిరుపతి: తిరుపతిలో రూ. 1,500 కోట్లతో మెగా సైన్స్ మ్యూజి యాన్ని నెలకొల్ప నున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మ్యూజియం నిర్మాణ పనులకు బుధవారం ఉదయం 7.30 గంటలకు భూమి పూజ చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో భాగంగా ఎస్వీయూ ఆవరణ లో నిర్వాహకులు ఏర్పాటు చేసిన మెగా సైన్స్ ఎగ్జిబిషన్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లా డుతూ.. ఇస్కా సదస్సుల్లో భాగంగా బుధవారం ఉదయం 11 గంటలకు చిల్డ్రన్స్, ఉమెన్ సైన్స్ కాంగ్రెస్‌లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతిలో జాతి గర్వించే దళిత నేతల స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. మంగళవారం తన నివాసంలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు సీఎం నివాళులర్పించారు. -
తిరుపతిలో త్వరలో సైన్స్ మ్యూజియం
అమరావతి : ప్రపంచస్థాయిలో ఉన్నతమైన అంశాలతో కూడిన సైన్స్ మ్యూజియంను తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని, అందుకు అవసరమైన 50 ఎకరాల భూములను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలోని పి.బి.సిద్ధార్థ ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజ్ ఆవరణలో సోమవారం జరిగిన 2వ ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్-2016 సదస్సును చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరిలో తిరుపతిలో జరగబోయే జాతీయస్థాయి సైన్స్ సెమినార్ ప్రారంభానికి ప్రధాన మంత్రి మోదీ రానున్నారని, ఆయన చేతుల మీదుగా సైన్స్ మ్యూజియంకు శంకుస్థాపన చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు. వారసత్వ సంపదగా సైన్స్ మన జీవితంలో ఒక భాగం అయిందన్నారు. ప్రతి హైస్కూల్, యూనివర్శిటీని ఇంక్యుబేషన్ సెంటర్‌గా రూపుదిద్దుతామన్నారు. మన రాష్ట్ర విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానంలో ఎంతో ప్రతిభ చూపుతున్నారంటూ గుగూల్ సంస్థ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విధానంలో స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ ఫెలోషిప్‌కు 20 మంది భారతీయులు ఎంపికైతే అందులో 13మంది రాష్ట్రానికి చెందిన వారు కావటం గొప్ప విశేషమని అన్నారు. విశాఖపట్నాన్ని నేవీహబ్తోపాటు డిఫెన్స్ మ్యాన్యుఫ్యాక్చర్ హబ్‌గా భవిష్యత్తులో తీర్చిదిద్దుతామని చెప్పారు. చిత్తూరులో లేపాక్షి, నిమ్మకూరు, విశాఖపట్నంలలో డిఆర్డివో ఆధ్యర్యంలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ప్రాజెక్టులు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భారతీయ సంప్రదాయాలు, విలువలకు ఏమాత్రం తీసిపోకుండా విశాఖలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తాన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి రూ.149 లకే పైబర్ నెట్‌తోపాటు ప్రతి స్కూల్లో వైఫై ప్రవేశపెడతామని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, నగర మేయర్ కోనేరు శ్రీధర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఖమ్మంలో సైన్స్ మ్యూజియం
ఖమ్మం : జిల్లా సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు ఇన్చార్జ్ కలెక్టర్ సురేంద్రమోహన్ విద్యాశాఖ అధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండు దశాబ్దాలుగా మూలుగుతున్న సైన్స్ మ్యూజియం నిధులు రూ.40 లక్షలకు మోక్షం లభించింది. జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు, దాని ఆవిశ్యకత, దానికి సంబంధించిన నిధులు తదితర అంశాలపై ఇన్చార్జ్ కలెక్టర్‌కు జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి వివరించారు. దీనిపై స్పందించిన ఇన్చార్జ్ కలెక్టర్ విద్యాశాఖ, ఆర్వీఎం అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఖమ్మంలో ఉన్న ఎన్నెస్పీ స్థలంలో సైన్స్ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తే అందరికీ అనువుగా ఉంటుందనే చర్చ ఈ సందర్భంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన కల్పించేందుకు సైన్స్ మ్యూజియం అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందు కోసం నిల్వ ఉన్న రూ. 40లక్షలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొత్త భవనాల నిర్మాణం కాకుండా అందుబాటులో ఉన్న రెండు ఎన్నెస్పీ భవనాలను ఇందుకు వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసే మ్యూజియం అధునాతనంగా ఉండాలన్నారు. ఇందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సైన్స్ మ్యూజియాలను పరిశీలించి రావాలని అన్నారు. ఇదంతా 15రోజుల్లో పూర్తి చేసి నివేదిక అందజేయాలని, పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. ఇన్చార్జ్ కలెక్టర్ సురేంద్రమోహన్ వెంట డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ ఈఓ బస్వరావు, ఆర్వీఎం పీఓ శ్రీనివాస్, ఈఈ రవికుమార్, ఎన్నెస్పీ ఏఈ తిరుపతమ్మ, ఐక్యరాజ్య సమితి జిల్లా ప్రతినిధి సునీల్‌కుమార్ ఉన్నారు. సైన్స్ మ్యూజియంల పరిశీలనకు ప్రత్యేక బృందాలు జిల్లాలో ఏర్పాటు చేసే సైన్స్ మ్యూజియంలో అన్ని హంగులు, పరికరాలు, అమర్చేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న సైన్స్ మ్యూజియంల పరిశీలన కోసం ప్రత్యేక బృందాలను పంపిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వరంగల్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యూజియంలు పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.