తిరుపతిలో త్వరలో సైన్స్ మ్యూజియం
అమరావతి : ప్రపంచస్థాయిలో ఉన్నతమైన అంశాలతో కూడిన సైన్స్ మ్యూజియంను తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని, అందుకు అవసరమైన 50 ఎకరాల భూములను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
విజయవాడలోని పి.బి.సిద్ధార్థ ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజ్ ఆవరణలో సోమవారం జరిగిన 2వ ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్-2016 సదస్సును చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరిలో తిరుపతిలో జరగబోయే జాతీయస్థాయి సైన్స్ సెమినార్ ప్రారంభానికి ప్రధాన మంత్రి మోదీ రానున్నారని, ఆయన చేతుల మీదుగా సైన్స్ మ్యూజియంకు శంకుస్థాపన చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు. వారసత్వ సంపదగా సైన్స్ మన జీవితంలో ఒక భాగం అయిందన్నారు. ప్రతి హైస్కూల్, యూనివర్శిటీని ఇంక్యుబేషన్ సెంటర్‌గా రూపుదిద్దుతామన్నారు.
మన రాష్ట్ర విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానంలో ఎంతో ప్రతిభ చూపుతున్నారంటూ గుగూల్ సంస్థ ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ విధానంలో స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ ఫెలోషిప్‌కు 20 మంది భారతీయులు ఎంపికైతే అందులో 13మంది రాష్ట్రానికి చెందిన వారు కావటం గొప్ప విశేషమని అన్నారు. విశాఖపట్నాన్ని నేవీహబ్‌తోపాటు డిఫెన్స్ మ్యాన్యుఫ్యాక్చర్ హబ్‌గా భవిష్యత్తులో తీర్చిదిద్దుతామని చెప్పారు.
చిత్తూరులో లేపాక్షి, నిమ్మకూరు, విశాఖపట్నంలలో డిఆర్‌డివో ఆధ్యర్యంలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ప్రాజెక్టులు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భారతీయ సంప్రదాయాలు, విలువలకు ఏమాత్రం తీసిపోకుండా విశాఖలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తాన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి రూ.149 లకే పైబర్ నెట్‌తోపాటు ప్రతి స్కూల్‌లో వైఫై ప్రవేశపెడతామని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, నగర మేయర్ కోనేరు శ్రీధర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.