తిరుపతి సెంట్రల్: ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ఉద్యమాన్ని మరోసారి ఉక్కుపాదంతో అణగదొక్కేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నించారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ఉద్యమాలను ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. చరిత్రలో నియంతలుగా మిగిలిపోయిన హిట్లరే చంద్రబాబును చూసి సిగ్గుపడే పరిస్థితి, ముస్సోలినికే మూర్చపోయే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పోలీసుల అండతో ప్రజల ఆశలను నీరుగార్చేందుకూ వెనుకాడలేదని విమర్శించారు.
మంగళవారం నాటి బంద్ ప్రారంభమైన కొంత సేపటికే వేల సంఖ్యలో కార్యకర్తలను అరెస్టు చేశారన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిర్బంధించిన కారణంగా వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త దుర్గారావు గుండె పోటుతో మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి, నగరి ప్రాంతాల్లో తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని ఆరోపించారు. చంద్రబాబు చేస్తే దీక్షలు, మేము చేస్తే శిక్షలా... ఆయన చేస్తే ధర్మపోరాటం, మేము చేస్తే అధర్మపోరాటం అవుతుందా అంటూ నిప్పులు చెరిగారు.
ప్రత్యేక హోదా అంశం ప్రజల్లో శ్రీరామ నామ జపంలా నానుతోందని, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరకమైన చైతన్యాన్ని నింపారని తెలిపారు. ఏ ఒక్క రోజైనా ప్రదాని నరేంద్ర మోదీపై సీఎం చంద్రబాబు హోదా కోసం ఒత్తిడి చేశారా అని ప్రశ్నించారు. 2016, సెప్టెంబర్ 7 తేదీన అర్ధరాత్రి హోదా లేదు, ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటిస్తే... ఆ ప్రతిపాదనను స్వాగతించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పార్లమెంట్ సాక్షిగా టీడీపీనే తమ మిత్ర వర్గమంటూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment