భూమన కరుణాకర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా మాట ఇచ్చి మోసం చేశారని.. అదే వేదికపై సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. హోదా ద్రోహుల్లో మొదటి ముద్దాయి చంద్రబాబు కాగా, రెండో ముద్దాయి బీజేపీనని.. ఓట్ల కోసం రాష్ట్ర ప్రజలను వంచించారంటూ విమర్శించారు. వంచన, మోసం, కుట్ర, అవినీతిలను చంద్రబాబు వ్యక్తిగత ఆస్తులుగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు.
రైతులు, డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు, అదే వేదికపై కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు జీవితమంతా దుర్మార్గాలతో నడిచిన చరిత్ర చంద్రబాబుదంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా 15 ఏళ్లు ఇస్తారని చెప్పిన చంద్రబాబు.. హోదా వద్దు, ప్యాకేజీనే ముద్దు అని అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాలు చేసి సన్మానాలు చేశారని గుర్తు చేశారు.
ఆమెకు పదవి.. మర్మమేంటి చంద్రబాబు?
క్యాండిల్ ర్యాలీకి విశాఖకు వెళ్తే ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ప్రత్యేక హోదాను తారకమంత్రంగా మార్చి పోరాటాలు చేస్తున్న వ్యక్తి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని కొనియాడారు. హోదా మాట వినిపిస్తే జైళ్లు నోళ్లు తెరుస్తాయని బెదిరింపులకు పాల్పడి ఉద్యమాన్ని నీరుగార్చే యత్నాలు పలుమార్లు చేశారంటూ మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్థం కోసం భగవంతుడ్ని కూడా వాడుకుంటున్నారు. వంచన, మోసం, కుట్ర, కుతంత్రాలు చంద్రబాబు వ్యక్తిగత ఆస్తులంటూ ఎద్దేవా చేశారు. టీటీడీ బోర్డులో మహారాష్ట్ర మంత్రి భార్యను ఎలా నియమించారని చంద్రబాబును భూమన ప్రశ్నించారు. బీజేపీతో బాబు ఇంకా లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని చెప్పడానికి ఇది నిదర్శనం అన్నారు.
ప్రజాకోర్టులో శిక్ష తప్పదు
చంద్రబాబుది ధర్మపోరాట సభ కాదనీ.. దోపిడీదారుల సభ అన్నారు. తిరుపతిలో ఏపీ సీఎం సభ పెట్టడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని పేర్కొన్నారు. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో క్షుద్రపూజలు చేయించిన చంద్రబాబును నమ్మితే అంతకంటే పాపం మరొకటి ఉండదని ఏపీ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు రాక్షసత్వాన్ని ఏపీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఆయన మోసాలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ నేత భూమన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment