సాక్షి, హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తరహాలో దేశంలోని పట్టణ ప్రాంత పేదల కోసం ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకాన్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజల జీవన స్థితిగతుల మార్పునకు చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ కేటీఆర్.. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.
ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశం అందుకు మినహాయింపు కాదని పేర్కొన్నారు. మెరుగైన ఉపాధి, మంచి జీవనప్రమాణాల కోసం గ్రామీణ ప్రజలు పట్టణాలవైపు తరలుతున్న విషయాన్ని గుర్తు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 31 శాతం జనాభా పట్టణాల్లో నివాసం ఉందని, 2030 నాటికి అది 40 శాతానికి పైగా పెరగనుందని వివరించారు. తెలంగాణ వంటి వేగంగా అభివద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఇది 50 శాతాన్ని దాటే అవకాశం ఉన్నదన్నారు.
పెరిగే పట్టణ పేదరికంపై దృష్టి పెట్టాలి..
పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ పెరిగే పేదరికంపై కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. పట్టణ పేదలకు గృహవసతి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత, జీవనోపాధి వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. దురదృష్టవశాత్తు పట్టణ పేదలు అత్యధిక శాతం అసంఘటిత రంగంలో కార్మికులుగా, చిరు వ్యాపారులుగా, కూలీలుగా పని చేస్తున్నారని, ఒక్కరోజు ఉపాధి దొరకక పోయినా వారి బతుకు దుర్భరంగా మారే పరిస్థితి ఉందని వివరించారు.
ఈ నేపథ్యంలో పట్టణ పేదల ఉపాధికి, ఆదాయానికి మరింత హామీ అందించేలా కేంద్రం ముందుకు రావాలన్నారు. కరోనా సంక్షోభం వల్ల పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిందన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లెక్కల ప్రకారం 2019 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్యలో గరిష్టంగా 21 శాతం నిరుద్యోగం నెలకొని ఉందన్నారు.
పార్లమెంటరీ కమిటీ ఇదే చెప్పింది..
గతంలో పార్లమెంట్ సభ్యుడు భర్తృహరి మహతాబ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సీఐఐ వంటి సంస్థలు పట్టణ ప్రాంతాల్లోని ప్రజల సామాజిక భద్రతను పెంచేందుకు పట్టణ ఉపాధిహామీ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా సూచించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు.
అసంఘటిత రంగంలో ఉన్న పేదలకు నైపుణ్య అభివృద్ధి, ఆర్థిక తోడ్పాటు, సామాజిక భద్రత, సంక్షేమం వంటి అంశాలను ఈ ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమంలో చేర్చాలని సూచించారు. లాక్‌డౌన్ సమయంలో దేశం చూసిన హృదయవిదారకమైన పట్టణ పేద ప్రజల వలస సంఘటనలు పునరావృతం కాకుండా అసంఘటిత రంగాన్ని మరింత బలోపేతం చేయాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
పురపాలికలకు బాధ్యత ఉండాలి..
పట్టణ ప్రాంతాల్లోని పేదలకు చేయూతనందించాల్సిన బాధ్యత కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగర, పురపాలికలపై కూడా ఉండాలని కేటీఆర్ అన్నారు. పట్టణాల్లో చేపట్టే ఫుట్‌పాత్‌లు, డ్రైనేజీల నిర్మాణం, మొక్కల పెంపకం వంటి మౌలిక వసతుల నిర్వహణ వంటి కార్యక్రమాల్లో పట్టణ పేదలకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. పట్టణ పేద ప్రజలు నాణ్యమైన జీవన ప్రమాణాలను అందుకోవాలంటే, వారి ఉపాధికి మరింత హామీ కల్పించడం మాత్రమే ఏకైక పరిష్కార మార్గమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment