కేటీఆర్ షేర్ చేసిన ఫొటో
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో తెలంగాణ వాటా ఉందని ట్వీట్ చేశారు. కేంద్రానికి తెలంగాణ రూపాయి ఇస్తే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి 46 పైసలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పీడీఎస్ దుకాణాల వద్ద థ్యాంక్స్ టు తెలంగాణ అని బ్యానర్లు పెట్టే సమయం వచ్చిందని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
మోదీ సర్కార్ ఇస్తున్నట్లు చెబుతున్న కేంద్ర ఆర్థికమంత్రికి వాస్తవాలు ఇవిగో అంటూ.. రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి ఇస్తున్న మొత్తాన్ని, తిరిగి కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న మొత్తాలను పట్టిక రూపంలో తెలియజేశారు. 2014–15 నుంచి 2020–21 వరకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి రూ. 3,65,787 కోట్లు చెల్లిస్తే, కేంద్రం తిరిగి రాష్ట్రానికి రూ.1,68,647 కోట్లు చెల్లించిందని, ఇంకా రూ.1,97,150 కోట్లు బాకీ ఉందని ఈ పట్టికలో వెల్లడించారు.
స్వాతంత్య్ర సమరయోధుడు మా తాత కేశవరావు
మంత్రి కేటీఆర్ శనివారం మరో ఆసక్తికరమైన ఫొటోను పరిచయం చేశారు. ‘మా కుటుంబం నుంచి అందరికీ ఆదర్శవంతమైన వ్యక్తిని ఇవాళ పరిచయం చేస్తున్నా’ అంటూ తన తాత దివంగత జె.కేశవరావుతో పాటు చిన్నపిల్లలుగా తామున్న ఫొటోను కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘మా తాత (అమ్మ వాళ్ల తండ్రి) కేశవరావు గాంధీజీని స్ఫూర్తిగా తీసుకుని 1940 చివరలో తెలంగాణ తిరుగుబాటులో భాగంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు.
ఆయన స్వాతంత్య్ర సమరయో«దుడిగా భారత ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందారన్నారు. ‘ప్రజల కోసం పోరాడిన కుటుంబ చరిత్ర మాది.. అందుకు భారతీయుడిగా, తెలంగాణవాసిగా గర్వంగా ఫీలవుతున్నాను. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులు ఎంత మంది స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు’ అని కేటీఆర్ ప్రశ్నించారు. వారికి సంబంధం లేని విషయాలను కూడా తమదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment