బేస్తవారిపేట : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహిస్తున్న పనులను నెలలో రెండుసార్లు తప్పనిసరిగా పరిశీలించాలని డ్వామా పీడీ ఎన్.పోలప్ప టెక్నికల్ అసిస్టెంట్లకు సూచించారు. గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల టెక్నికల్ అసిస్టెంట్లతో స్థానిక ఐడబ్ల్యూఎంపీ కార్యాలయంలో శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఉద్యానవన పనులను వేగవంతం చేయాలని సూచించారు. వాటర్‌షెడ్ కమిటీ సభ్యులు, రైతులతో సమావేశాలు నిర్వహించి హార్టీకల్చర్‌పై అవగాహన కల్పించాలన్నారు. నాటిన మొక్కలు చనిపోకుండా రైతులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నారు. తరచూ తనిఖీలు చేయాలని సూచించారు. హార్టీకల్చర్ పనుల అనంతరం బిల్లులిప్పించే బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పంచాయతీల వారీగా ప్లాంటేషన్‌పై సిబ్బందితో సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా హార్టీకల్చర్ ప్లాంటేషన్ అధికారిణి ఎస్.వెంకటరత్న, ఐడబ్ల్యూఎంపీ ప్రాజెక్ట్ అధికారి ఎం.రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
గిట్టుబాటు కూలి కల్పించాలి...
ఉపాధి కూలీలకు గిట్టుబాటు కూలి కల్పించే బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లపైనే ఉందని డ్వామా పీడీ పోలప్ప పేర్కొన్నారు. బేస్తవారిపేటలోని ప్రాంతీయ జీవనోపాధుల వనరుల కేంద్రంలో క్లస్టర్ పరిధిలోని ఏపీవో, టీఏలు, ఎఫ్‌ఏలతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి పంచాయతీలో పనిదినాలు పూర్తిచేయాలని, కచ్చితమైన కొలతలు ఇచ్చిన కూలీలకు రోజుకు రూ.150 కూలి పడేలా చూడాలని సూచించారు. బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానా విధిస్తామని సిబ్బందిని హెచ్చరించారు. పనిచేసిన 15 రోజుల్లోపే కూలీలకు కూలి మంజూరు చేయాలన్నారు. సమావేశంలో హార్టీకల్చర్ జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ ఎస్.వెంకటరత్న, ఏపీడీ హరికృష్ణ, ఏపీఓ, టీఏ, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.
ఉపాధి పనుల పరిశీలన తప్పనిసరి
Published Sun, Jan 11 2015 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM
Advertisement
Advertisement