కర్ణాటకలోని బెలగావిలో రెండ్రోజుల పాటు కాంగ్రెస్ కీలక భేటీ
నవ సత్యాగ్రహ భైఠక్‌గా నామకరణ
వచ్చే ఏడాదికి కార్యాచరణపై కీలక చర్చలు.. 27న జై సంవిధాన్ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురష్కరించుకొని కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యేక భేటీ నిర్వహింనుంది. మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించిన కర్ణాటకలోని బెలగావిలోనే ఈ నెల 26, 27 తేదీల్లో రెండ్రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ భేటీకి నవ సత్యాగ్రహ భైఠక్‌గా నామకరణం చేసింది. ఈ భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వనితులు, ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ సీఎంలు హాజరుకానున్నారు.
మొత్తంగా 200ల మంది కీలక నేతలు హాజరవుతారని ఏఐసీసీ ప్రకటించింది. 26న మహాత్మాగాంధీ నగర్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ ప్రారంభం కానుంది. 27వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్టీ రెండు తీర్మానాలను ఆమోదించనుంది. దీంతో పాటే వచ్చే ఏడాది పార్టీ తీసుకోవాల్సిన కార్యాచరణపై ఇందులో కీలక చర్చలు చేయనున్నారు.
దీంతో పాటే రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అంశంపైనా చర్చించనున్నారు. ‘1924లో బెలగావిలో తన తొలి ప్రసంగంలో మహాత్మాగాంధీ అహింస, సహాయ నిరాకరణ, అంటరానితనం నిర్మూలన, వివిధ వర్గాల మధ్య ఐక్యత, సామాజిక–ఆర్ధిక సమతుల్యత, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రసంగించారు. ఈ భేటీకి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక భేటీ నిర్వహిస్తున్నాం.
200 మందికి పైగా నాయకులు దీనికి హాజరవుతారు. 27న నిర్వహించే సంవిధాన్ ర్యాలీలో కీలక నేతలతో పాటు లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొంటారు’అని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఆర్ధిక అసమానత, ప్రజాస్వామ్య ఖూనీ, రాజ్యాంగ సంస్థలపై దాడి, బీజేపీ పాలనలో దేశం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సవాళ్లు వంటి అంశాలపై ఇందులో చర్చిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment