సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, కేసీ వేణుగోపాల్, దీపాదాస్‌మున్షీ, మహేశ్‌కుమార్‌గౌడ్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి
సీఎం సహా అంతా బాగా పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది
నేతలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశా నిర్దేశం
మంత్రులందరూ నెలకోసారి జిల్లాలకు వెళ్లాలి
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
గాందీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ ఐదేళ్ళే కాకుండా మరో 20 ఏళ్ల పాటు అధికారంలో ఉండేలా పనిచేయాలని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. సీఎంతో సహా రాష్ట్ర కేబినెట్, టీపీసీసీ అధ్యక్షుడు, అన్ని స్థాయిల్లోని పార్టీ నేతలు కలసికట్టుగా పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. బుధవారం సాయంత్రం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ అధ్యక్షతన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలు, కార్యకలాపాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అభినందించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ప్రశంసించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంతమేర వెనుకబడ్డామని చెప్పారు. ప్రజలను విస్తృతంగా కలవడం ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లవచ్చునని సూచించారు.
రాష్ట్ర మంత్రులు విధిగా నెలకోసారి జిల్లాలకు వెళ్లి ప్రజాదర్బార్ నిర్వహించి, పార్టీ కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడాలని, వారి అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వ పనితీరును, కార్యక్రమాలను వివరించాలని సూచించారు, పారీ్టకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండాలని అన్నారు. కార్యకర్తలను, క్షేత్రస్థాయి నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను పీఏసీ సభ్యులందరూ తీసుకోవాలని కోరారు. గ్రామ, మండల, బ్లాక్, జిల్లా,రాష్ట్ర పార్టీ కమిటీలను మూడు వారాల్లోగా ఏర్పాటు చేయాలని సూచించారు. వీలున్నంత త్వరగా ప్రభుత్వ పదవులను కూడా భర్తీ చేయాలని చెప్పారు.
అంబేడ్కర్‌ను అవమానించడాన్ని సీరియస్‌గా తీసుకోవాలి
దేశ రాజకీయ చరిత్రలో అంబేడ్కర్‌ను అవమానించిన నాయకులు లేరని, మొదటిసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానకరంగా మాట్లాడిన విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పాదయాత్రలు నిర్వహించాలని కోరారు.
మంచి అభిప్రాయం ఉండేలా చూసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆశించిన మేర కృషి జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన వేణుగోపాల్..ముఖ్యమంత్రిపై మంత్రులకు, మంత్రులపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలపై ప్రజలకు మంచి అభిప్రాయం ఉండేలా చూసుకోవాలని చెప్పినట్లు తెలిసింది.
ప్రభుత్వ పథకాలను వివరించిన సీఎం
గత ఏడాది కాలంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రూ.21 వేల కోట్లతో రైతు రుణమాఫీ అమలు చేశామని, సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామని, జనవరి 26 నుంచి రైతు భరోసా అమలు చేయబోతున్నామని తెలిపారు. ఒక్కో వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు అందించబోతున్నామని, కొత్త రేషన్‌కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు.
మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని చెప్పారు. మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. అంబేడ్కర్‌ను అవమానించిన ఉదంతంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి నిరసనలు తెలియజేశామని వివరించారు.
ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీఏసీ సభ్యులు వి.హన్మంతరావు, జానారెడ్డి, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచందర్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, బలరాం నాయక్, గీతారెడ్డి, అజారుద్దీన్, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి తదితరులు హాజరయ్యారు.
పీఏసీ సభ్యురాలు రేణుకాచౌదరి వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి గైర్హాజరయ్యారు. కాగా గురువారం పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ సమావేశం జరిగే ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్లోనే వేణుగోపాల్ బుధవారం రాత్రి బస చేశారు. అక్కడే ఆయనతో కలిసి రేవంత్, తదితరులు డిన్నర్ చేశారు.
25–28 తేదీల మధ్య సంవిధాన్ బచావో ర్యాలీ
పీఏసీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు పలువురు నేతలతో కలిసి వాటిని విలేకరులకు వెల్లడించారు. అంబేడ్కర్‌ను అవమానిస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 25 నుంచి 28వ తేదీ మధ్యలో తెలంగాణలో సంవిధాన్ బచావో ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ర్యాలీకి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరు కావాలని కోరుతూ పీఏసీ తీర్మానించినట్లు తెలిపారు.
సంవిధాన్ బచావో పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు పాదయాత్రలు నిర్వహించాలని, ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ నేతల అభిప్రాయాలను కేవలం పీఏసీ సమావేశంలో మాత్రమే వివరించాలని, ఎవరూ బయట మాట్లాడకూడదని నిర్ణయించినట్టు చెప్పారు.
రాష్ట్ర మంత్రులు ప్రతినెలా జిల్లాల్లో ప్రజా దర్బార్ నిర్వహించాలని కూడా నిర్ణయించామన్నారు. మహాత్మాగాంధీ శత జయంతి ఉత్సవాలను ఏడాది కాలం పాటు రాష్ట్రమంతటా నిర్వహించేలా కార్యాచరణ తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. కొత్త గిగ్ వర్కర్స్ పాలసీ, ఎంఎస్‌ఎంఈ పాలసీని తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment