పేర్లు ఫైనల్‌.. మిగిలింది ప్రకటనే! | list of minister posts and PCC chief will be finalized in meeting of Kharge and KC | Sakshi
Sakshi News home page

పేర్లు ఫైనల్‌.. మిగిలింది ప్రకటనే!

Published Sat, Jun 29 2024 5:09 AM | Last Updated on Sat, Jun 29 2024 5:09 AM

list of minister posts and PCC chief will be finalized in meeting of Kharge and KC

ఖర్గే, కేసీల భేటీలో మంత్రి పదవులు, పీసీసీ చీఫ్, నామినేటెడ్‌ పోస్టుల జాబితా ఖరారు 

సీనియారిటీ, సామాజికవర్గాల ఆధారంగా ఎంపిక చేసిన హైకమాండ్, రాష్ట్ర నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించే నేతల పేర్లను కాంగ్రెస్‌ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. దీనితోపాటు పీసీసీ కొత్త చీఫ్‌ ఎంపిక, నామినేటెడ్‌ పదవుల జాబితానూ కొలిక్కి తెచ్చినట్టు సమాచారం. జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక వర్గాలు, పార్టీలో పనిచేసిన అనుభవం, సీనియారిటీ ఆధారంగా కొత్త మంత్రుల ఎంపిక జరిగినట్టు సమాచారం. కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి, గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు కలి్పంచాలని, ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి న వారికి అవకాశం ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణ యించినట్టు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమెల్యేలకు కీలక పదవులు దక్కే అవకాశం లేదని అంటున్నాయి. 

వరుసగా నేతలతో భేటీలు.. 
కీలక పదవుల పంపకాలపై ఢిల్లీలో ఐదు రోజులుగా వరుసగా భేటీలు జరుపుతున్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శుక్రవారం కూడా విడివిడిగా చర్చలు జరిపారు. సీఎంతో భేటీకి ముందే దీపాదాస్‌ మున్షీ తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు లతో గంటన్నర పాటు చర్చించారు. మంత్రివర్గంలో తీసుకునేందుకు పరిశీలనలో ఉన్నవారందరి పేర్లపై అభిప్రాయం తీసుకున్నారు. ఒకరిద్దరి పేర్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. మిగతా పేర్లపై ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలిసింది.

ఈ భేటీ అనంతరం దీపాదాస్‌ మున్షీ సహా నేతలంతా సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. ఏకాభిప్రాయం వ్యక్తమైన పేర్లపై చర్చించారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మక్తల్‌ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేర్లకు అందరూ ఆమోదం తెలిపినట్టుగా సమాచారం. మిగతా పేర్లలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, బల్మూరి వెంకట్, ప్రేమ్‌సాగర్‌రావు, వివే క్, బాలూనాయక్‌ తదితరుల పేర్లపై కొంత భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు తెలిసింది. దీంతో వీటి నుంచి ఫైనల్‌ చేసే బాధ్యతను అధిష్టానంకు కట్టబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. 

కొత్తగా చేరినవారికి ఎలా? 
బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్‌ల లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనపైనా భేటీలో చర్చించినట్టు తెలిసింది. దీనికితోడు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి వచ్చే ందుకు సిద్ధమైన దృష్ట్యా.. వారికి ఎలాంటి హామీ ఇవ్వాలన్న దానిపైనా చర్చ జరిగినట్టు సమాచారం.

చివరిగా ఈ భేటీ అనంతరం దీపాదాస్‌ మున్షీ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అయ్యారు. పరిశీలనలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు, ఏకాభిప్రాయం కుదిరిన పేర్లపై వారితో చర్చించారు. పీసీసీ అధ్యక్ష నియామకం విషయంలో నేతల అభిప్రాయాలను వారి దృష్టికి తెచ్చారు.

రాష్ట్ర నేతలు తెలిపిన పేర్లను పరిశీలించి ఒకట్రెండు రోజుల్లో తెలియజేస్తామని.. జూలై మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ చేసుకోవచ్చని అధిష్టానం పెద్దలు చెప్పినట్టు తెలిసింది. ఇక మంత్రి పదవులు, నామినేటెడ్‌ పోస్టులేవీ కొత్తగా చేరిన వారికి అవకాశం ఇవ్వకుండా.. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. 

బీసీకే పీసీసీ చీఫ్‌ పదవి! 
పీసీసీ చీఫ్‌గా బీసీ వర్గ నేతకే చాన్స్‌ ఇవ్వాలని నేతలంతా అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఈ లెక్కన ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. వీరి విషయంలో ఏకాభిప్రాయం రాని పక్షంలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్‌ పేరు పరిశీలనలో ఉందని అంటున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement