ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో జరిగిన భేటీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, దీపాదాస్ మున్షీ
స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఏఐసీసీ దిశానిర్దేశం
ఎన్నికల్లో సత్తా చాటేలా ఇప్పట్నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలి
అన్ని స్థాయిల నేతలను అప్రమత్తం చేయాలి
కనీసం 80 శాతం విజయాలు నమోదయ్యేలా చూడాలి
మంత్రులు ఏమాత్రం ఉదాసీనంగా వ్యవహరించొద్దన్న కేసీ వేణుగోపాల్
కేబినెట్ పనితీరుపై హైకమాండ్‌కు ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయని వెల్లడి
సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులతో ఢిల్లీలో కీలక భేటీ
వివిధ అంశాలపై రెండున్నర గంటలపాటు చర్చ
ఫిబ్రవరిలో రాష్ట్రంలో రాహుల్‌గాంధీ సభ ఉంటుందన్న పీసీసీ చీఫ్
నెలాఖరుకల్లా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ‘మార్చిలోగా జీహెచ్‌ఎంసీ సహా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి. ఆ ఎన్నికల్లో సత్తా చాటేలా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతలను అప్రమత్తం చేయాలి. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలను తొలుత నిర్వహించాలి. తర్వాత మిగతా ఎన్నికలను నిర్వహించేలా కార్యాచరణ తీసుకోవాలి. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న దృష్ట్యా కనీసం 80 శాతం విజయాలు నమోదు చేయాలి. రాష్ట్ర మంత్రులు ఎంతమాత్రం ఉదాసీనంగా ఉండొద్దు. జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలి. ముఖ్య నేతలు కూడా స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..’ అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల్లో ఫలితాల ఆధారంగానే రాబోయే రోజుల్లో నేతలకు పదవుల పంపకాలు ఉంటాయని స్పష్టం చేసింది.
‘స్థానిక’ సంసిద్ధతపై ఆరా
రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరితోనే ముగిసింది. మండల, జిల్లా పరిషత్‌ల పదవీకాలం గత జూలైతో పూర్తయ్యింది. ఇక ఈ నెల 26వ తేదీకి ఒకటీ రెండు మినహా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీ కాలం కూడా ముగియనున్న నేపథ్యంలో ఏఐసీసీ వాటి ఎన్నికలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీ సంసిద్ధతపై ఆరా తీసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు.
ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో కేసీ పలు అంశాలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఆ సమావేశానికి కొనసాగింపుగా ఢిల్లీ వేదికగా ఈ కీలక భేటీని నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కొండ సురేఖ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, పార్టీ పనితీరు, స్థానిక ఎన్నికలు, సంస్థాగత నిర్మాణం, రాహుల్‌గాంధీ సభ తదితర అంశాలపై సుమారు రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. బీసీ కుల గణనపై కూడా చర్చించినట్లు తెలిసింది.
ప్రభుత్వ పథకాలు వివరించిన నేతలు
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను కేసీ వేణుగోపాల్‌కు రాష్ట్ర నేతలు వివరించారు. రైతు కూలీలకు కూడా ఏడాదికి రూ.12 వేలు ఆర్థికసాయం అందజేయనుండటం, కొత్త రేషన్ కార్డుల జారీ, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తదితరాలపై తాజా వివరాలు అందజేశారు. ఈ నేపథ్యంలో కేసీ మాట్లాడారు.
కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపాలన్న కేసీ
మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు అందుతున్నాయని, ఇన్‌చార్జి మంత్రులు తమ తమ జిల్లాల కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపేలా బాధ్యత తీసుకోవాలని కేసీ వేణుగోపాల్ సూచించారు. జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్థత, ఆయా ఎన్నికల్లో విజయడంకా మోగించడంపై దిశానిర్దేశం చేశారు. పీసీసీకి సంబంధించి సంస్థాగత పునర్నిర్మాణంతో పాటు జిల్లాల్లో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మిగిలిపోయిన నామినేటెట్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకం తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. త్వరలో రాష్ట్రంలో నిర్వహించనున్న రాహుల్‌గాంధీ సభ విజయవంతం చేసేలా రూపొందించిన ప్రణాళికలపై చర్చించారు.
కష్టపడి పనిచేస్తున్న వారికే పదవులు: మహేశ్‌గౌడ్
ఈ నెలాఖరుకల్లా నామినేటెడ్ పదవులు, పెండింగ్ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో ఉన్న వారికే పదవులు దక్కుతాయని చెప్పారు. కేసీ వేణుగోపాల్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
స్థానిక ఎన్నికలు, పీసీసీ కూర్పు ఇతర అంశాలపై చర్చించామని తెలిపారు. ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్‌గాంధీ సభ నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం, పార్టీ పనితీరు భేషుగ్గా ఉందని కేసీ వేణుగోపాల్ ప్రశంసించారన్నారు. కేబినెట్ విస్తరణపై సీఎం, అధిష్టానం పెద్దలు కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment